మంత్రాలోచనము
శ్రీకృష్ణుఁడు
ఐనవి సంధిసంబరము, లాయుధముల్ ధరియింపుఁడయ్య! దా
పైనది వీర భారత మహా రణరంగము; సర్వదా వృథా
యైనవి సంప్రదింపులు - తథాస్తు - జయాపజయమ్ము లేవి యె
ట్లైనణు మీవి వారివి గుణాగుణముల్ గ్రహియించి రందఱున్!!
పోయితి మీకు వారికిని పొందు పొసంగు నటంచు; వ్యర్ధమై
పోయెను నా శ్రమల్; ముదిరిపోయెను ఱేనికి స్వార్ధబుద్ధి; ఏ
మో యొక వాఁడి సూదిమొన మోపిన నేలయు చేతిమీఁదుగా
నీయఁడటే కురుప్రభుఁడదెక్కడి రక్కసి రాజ్యకాంక్షయో!!
ఇమ్మన్నాఁడయిదూళ్ళు భీష్ముడు; గురుం డేదో విధిన్ సంధి కా
నిమ్మన్నాఁడు; విచిత్రవీర్యతనయుం డేలా విరోధమ్ము పో
నిమ్మన్నాఁ; డటుమీఁద కర్ణుని మొగ మ్మీక్షించి పొందేమి పో
పొమ్మన్నాఁడు సుయోధనుండనుఁగుతమ్ముల్ రొమ్ములుబ్బింపఁగన్.
సిరులు దోరంగి ఘోరవనసీమల చెట్టుకు పుట్టకొక్కరై
యరిగినవారు మీరు; దొరలై తెకతేరకు తీయగా తినన్
మరగినవారు వా; రలఁతిమాటలతో ధర యిత్తురయ్య! సం
గారమున ఖడ్గముల్ గదలు గాండివముల్ చెరలాడకుండఁగన్!
కాలుని దున్నపోతు చిఱుగంటల మ్రోతకు గాక సంధి వా
క్యాలకు వీనులోగ్గుదురటయ్య మదాంధులు; గుండెగాలమై
యాలము దాపురించె దొర లందఱకున్; కురుచక్రవర్తికిన్
గాలము దాపురించె; కలకాలము నిల్చునె మాయసంపదల్?
బంధింపన్ దలపెట్టినారు; బహుధా ప్రచ్చన్నులై వచ్చి ని
ర్చంధింపన్ సమకట్టినారు చెరసాలన్; చాలులే సంధి సం
బంధ మ్మీక్రియ బంధనమ్ములకు త్రోవందీసె; భీమన్నచే
బంధింపంబడుఁగాక! కృష్ణ కబరీబంధ మ్మవశ్య మ్మిఁకన్!
భీముఁడు
త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్త మ్మన్నముంబెట్టి, రే
చేటున్ వాటిలకున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర
చ్చోటన్ కొంపకు నిప్పుపెట్టి, రడవుల్ చుట్టించి, రీ సాధ్వి కా
పాటుల్ గూర్చిరి, భాగమీయ మని, రబ్బా యెంత సౌభ్రాత్రమో!
అవి యొక వీరభారతకులాంగన కంటి కవోష్ణ బాష్ప బిం
దువులు ధరిత్రిపైఁ గురియు దుర్భర దుస్సహ దుర్దినమ్ము; ల
య్యవి పదిమందిలో ఒక మహాసతి పైటచెఱంగుఁ బట్టి ధ
ర్మువు దిగద్రావి రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముమూర్తముల్!
అది పాంచాలి పటాంచలాపహరణమ్మా! కాదు; తత్ కౌరవాం
త్య దిన ప్రేత పటాంచలాహరణమే యౌ నూటికి న్నూఱు పా;
ళ్ళది వేణీగ్రహణమ్మటే! వికటనృత్య న్మృత్యుకాంతా భయ
ప్రద పాణిగ్రహణమ్ముగాక; భవితవ్యం బెంత దుర్లంఘ్యమో!
ఆశ్చర్య మ్మవిలంఘ్యమౌవిధికృత మ్మట్లుండెఁ గాఁబోలు! నా
దుశ్చారిత్రులు దుర్విదగ్దులు దురాత్ముల్ దుర్మదగ్రస్తులై
పశ్చాత్తప్తులు గారు నేఁటికిని; తత్పాపంబుఁ బాపంగ ప్రా
యశ్చిత్తమ్మిఁక లేదు; మారణమహాయజ్ఞమ్మె కర్తవ్యమౌ!
రారా జెవ్వఁడు రాజ్యమేలఁగ? నపార స్ఫార దోస్సార మే
పారన్ రాజుల నాజులన్ గెలిచి, నాఁ డాసేతుశీతాచల
క్ష్మారాజ్యమ్మును పాండురాజు వెలయింపన్, నేఁడిటుల్ కొల్వుసిం
గారమ్మై కుడువంగఁ బుట్టిరి దొరల్ గాంధారి గర్భమ్మునన్!!
అబ్దిప్రావృతమేదినీవలయరాజ్య మ్మెల్ల మా తండ్రిచే
లబ్ధమ్మయ్యెను గ్రుడ్డిరాజునకు; ఏలా నేఁడు చేజారు నా
లుబ్దాగ్రేసరచక్రవర్తి? అయిదూళ్ళుం గూడ నీయండు; ప్రా
రబ్ధం బింతకు నెట్టులున్నదొ యుపేంద్రా! వృద్ధజీవాలకున్!
అర్జునుఁడు
దొరల మటంచు రాజసముతో తెగ నీలిగి పట్టుపాన్పులన్
బొరలు దినమ్ము లన్నియును బోయె; ప్రపంచము మారిపోయె; ము
ష్కరులు కురూద్వహుల్ మనలఁగాదని కన్నులు మూసికొన్న, ఈ
నరుని కఠోర గాండివ నినాదము నిద్దుర మేలుకొల్పెడిన్!
పచ్చని రాజవంశవని పాడొనరింప జనించినాఁడు కా
ర్చిచ్చయి ఱేఁడు; సూతసుడు స్నేహము దానికి తోడు; గాడుపై
కచ్చెలు రేపె నా శకునిగాఁడు; రగుల్కొనె మంట మింట; వి
వ్వచ్చుని వింట నింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై!
ఆ సభయందు రాసభము లట్లు లతాంగిని లాగి కౌరవుల్
చేసిన చేఁతలున్, కుటిల జిహ్వులు కూసిన కూఁతలున్, మదిన్
గోసిన కోఁతలై చెఱగకున్నవి; వారికి వారివారికిన్
వ్రాసిన వ్రాఁతలె యిఁక ధనంజయ శాత శరప్రఘాతముల్!
దండము దక్క నొండొక విధానము వారల కింపుగాదు; కో
దండము దక్క కొండొక విధమ్మున కర్జము లేదు; మత్త వే
దండము మాడ్కి దివ్యబలధాముఁడు భీముఁడు దీప్తిమద్ గదా
దండము ద్రిప్పునప్పుడుగదా కదనానకు కాలుద్రవ్వుటల్!!
పుట్టినదాది రాజుకొనిపోయిన ద్వేషదవాగ్ని కీలలన్
జిట్టెముగట్టె కౌరవుల శీర్షము లన్నియు; తప్ప దింక డీ
కొట్టక వారికిన్, జితుకగొట్టక తప్పదు మాకు; సంధి కూ
కొట్టుదురయ్య! మేలిపలుకున్ చెవిబెట్టుదురయ్య బెట్టిదుల్?
అంధుఁడు వృద్ధరాజఁట! మదాంధుఁడటే యువరాజు! రాజసం
బందులు ద్యూతబంధులఁటె! మంచికి మార్గ మికెట్లు? గాఢ గ
ర్వాంధ తమ స్తమస్వినుల స్వార్ధపిశాచము గజ్జెగట్టఁగా
సంధిలునయ్య సంధి? కొనసాగునఁటయ్య నయప్రయత్నముల్!
నకులుఁడు
ఘోషయాత్రనాఁటి కురుకులాభరణంబు
తెలిసికొనఁడొ పాండవుల బలంబు;
చిత్రసేన కఠిన శృంఖాలా సంబద్ద
హస్తయుగళి గుర్తులయిన లేవొ!
విరాటు గోగణంబు మరలించు సమయాన
పార్ధువలన వీపు బ్రద్దలగుట
మఱచిపోయిరేమొ కురువీరు, లొకమాటు
తలలు తడవుకొన్న తలపు వచ్చు!