అర్జునతో పాటు వాళ్ళ మెడమీదో, తోటలోనో గడపాల్సిన అందమయిన కాలాన్ని ఇలా గడపవల్సివచ్చింది.
మళ్ళీ వెళ్ళితే!
రౌడీ మేళం తన్నినా తతుంది.
విజయ్ కి గదిలో వుండబుద్దికాలేదు. గదికి తాళం వేసి కిందికి దిగాడు.
సాయిబాబా గుడికి ఎదురుగా వున్న వంతెనపైన కూర్చున్నాడు.
అతనికి తోచడంలేదు.
"ఏయ్ నువ్విక్కడున్నావా?"
ఉలిక్కిపడి చూశాడు విజయ్.
కాశ్మీరా!
"ఎక్కడ్నుంచి?" అడిగాడు.
"గుడికి వచ్చాను" అంది.
"గుడికా? ఎప్పట్నుంచి భక్తి?"
కాశ్మీర నవ్వింది.
"నాకే భక్తి లేదు. నువ్వు ప్రతి గురువారం ఈ గుడికి వస్తావని తెలుసు. నీతో పాటుగా కలిసి దేవుడికి మొక్కాలని వచ్చాను. నువ్వెంతకీ రాకపోతే ఏదో టైముకి వస్తావుకదా అని ఎదురుచూస్తున్నా" అంది.
"ఎందుకు?"
"నీకోసమని చెప్పానుగా"
"ఇవేళ గుడికి ఎందుకని రాలేదు" అడిగింది.
"ప్రొద్దున్నే వెళ్ళాను"
కాశ్మీర గుసగుస లాడింది.
"ఏదో ఒక టైమ్ కి వెళ్ళడం నీ ఇష్టమేనా?" అంది.
విజయ్ కి ఆమె మాటలు నవ్వు కలిగించాయి.
"ఇది మరి బాగుంది. నా విషయాల్లో కూడా నా ఇష్టం వుండా కూడద?" అన్నాడు.
"నాకూ ఇష్టమవ్వాలి. అప్పడే నువ్వు ఏమన్నా చేయాలి" అంది. చేతిలో విభూతిని అతని చేతిలో పెడుతూ.
"మొదటిసారిగా నువ్వు నా చేతిలో పెట్టేది ఇదా?" అన్నాడు.
"ఇది బూడిదకాదు. విభూది" అంది
"ఎవరన్నా చూస్తే బాగోదు. వెళ్ళిపో"
"ఇది మరి బాగుంది నా ఇష్టమయిన వాళ్ళతో నేను మాట్లాడితే తప్పేమిటి? గట్టిగా మాట్లాడితే నీ చెయ్యి పట్టుకుని మరి నడుస్తాను. మరి ఏమన్నా అంటే పళ్ళు వూడగోడతాను" అంది.
"సరేపద!" అన్నాడు.
"ఎక్కడికెళదాం ?" అడిగింది చిలిపిగా.
"నువ్వు మీ ఇంటికి నేను అద్దెగదికి" అన్నాడు చేతిలో సిగరేట్ ని అవతల పారేస్తూ.
కాశ్మీర అతని పక్కనే నడుస్తూ మధ్య మధ్య అతనికి తగలడానికి ప్రయత్నం చేస్తోంది.
"నిన్ను గురించి మా ఫ్రెండ్ ఏమన్నదో తెలుసా?" అడిగింది.
"చెప్పు"
"దానికి నిన్ను ముద్దు పెట్టుకోవాలనుందట" అంటూ నవ్వేసింది కాశ్మీర.
"నువ్వు ఏర్పాటు చేస్తానని చెప్పావా?" ఎగతాళిగా అన్నాడు విజయ్.
"కాదు. అతన్ని నేను రిజర్వు చేసుకున్నానని చెప్పాను" అంది.
ఆమె మాటలకి విజయ్ ఓసారి కాశ్మీరకేసి చూసాడు.
మనసు అసలే అల్లరిచేస్తున్న ఆ సమయంలో కాశ్మీర మాటలు అతన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి.
అనుభవం కావాలనుకుంటే ఇప్పడంత కష్టంకాదు అతనికి.
కాశ్మీర!
కావాల్సినంత దగ్గరలో అందుబాటులో కాశ్మీర ఉంది.
"ఏం అలా చూస్తున్నావు నేనంటే నీకు ఇష్టంలేదా" అడిగింది కాశ్మీర.
"అబ్బే అదికాదు"
దూరంగా ఏదో కారువస్తోంది.
"నాన్న వస్తున్నాడు" అంటూ వడివడిగా నడుస్తూ వెళ్ళి పోయింది కాశ్మీర.
ఆ కారుకేసి కసిగా చూశాడు విజయ్. గదికి వెళ్ళి బాల్కని లో పరుపు వేసుకుని పడుకున్నాడు విజయ్.
అతనికి తనమీద తనకే కోపం వచ్చింది.
మనసు కాశ్మీరని కోరుతుంది.
అంటే తను అర్జునకి పరోక్షంగా ద్రోహం చేయడానికి సిద్దపడుతున్నాడా!
అర్జున
తన ప్రేమ దీపం.
అర్జునకి ద్రోహంచేస్తే తిరిగి మనిషి జన్మ దొరుకుతుందా? అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
అతనిలో ఉద్రేకం మరోలా ఆలోచిస్తోంది. ప్రేమించిన మనిషి వుండగా మరో ఆడదానితో కలవాలనుకోవడం ప్రేమించనాడ దానికి ద్రోహం చేసినట్టా? కాదు.
ప్రేమించిన ఆడదానికిచ్చే స్ధానం ఎప్పడూ ఒక్కటే. తులసి మొక్క గంజాయి మొక్క ఒకటేలా అవుతాయి.
మనసుని అదుపులో పెట్టుకోడానికి అతను తలకిందులు అవుతున్నాడు.
నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిద్రాదేవి కరుణించలేదు.
అశాంతి.