మేలుకొలుపు
కొంపలు గోడలు గుల్లలు చేస్తూ
తల విరబోసుక తైతకలాడే
మద్యపాన మను మహారాక్షసిని
నీ పలుగులతో పొడిచేయ్యాలోయ్ -
నిద్దురలేవోయ్ ! కర్షకుడా!!
రైతుల పైబడి రక్తము తాగే
బీదల ఎముకలు కరకర నమిలే
వడ్డీ దయ్యము కాళ్ళు చేతులను
నీ గొడ్డలితో నరికేయ్యాలోయ్ -
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
ధనికతత్వమూ స్వార్ధపరత్వము
బిగుసుకుపోయిన బీటిపొలాలను
పాదుకుపోయిన పాటిదిబ్బలను
నీ నాగలితో దున్నెయ్యాలోయ్-
నిద్దురలేవోయ్ ! కర్షకుడా!!
కార్మికవర్గము కండలు కొరికే
కర్మాగారపు కఠిన చట్టములు
యంత్రాలయముల హైన్య పద్దతుల
నీ గుంటకతో సరిచెయ్యాలోయ్-
నిద్దురలేవోయ్ ! కర్షకుడా!!
జాతివైరములు చదునైపోయిన
జాతీయత వ్యవసాయము చేసిన
జన్మభూమిలో శాంతిబీజములు
నీ జడ్డిగమున వేదబెట్టాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
పైరు పొలాల్లో పడి తెగ తింటూ
రంకెలు బెట్టె అబోతెద్దుల
గంతులు వేసే గంగిరెద్దులను
నీములుగఱ్ఱతో అదిలించాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
అల్లిబిల్లిగా అల్లుకుపోయ్యే
మూడాచారపు కలుపు ముళ్ళతీగలను
నీ కొడవలితో కోసేయ్యాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
పంటచెలపై పచార్లు చేస్తూ
పైపై తిరిగే పరిగపిట్టలను
కంకులు కొరికే కాకిమూకలను
నీ వడిసేలతో బెదిరించాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
కుప్పలు బడ్డా కులబేధాన్ని
కళ్ళాన్నేసీ నురిపిడి చేసీ
భరతభూమిపై పాటలు పాడుతూ
నీ చేటలతో తూర్పేత్తాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
అగ్రజాతులా ఆత్మల లోపల
అంటుకుపోయిన అస్పృశ్యతనీ
అతుక్కుపోయిన అందత్వాన్నీ
నీ పోలికట్టతో తుడిచేయ్యాలోయ్-
నిద్దురలేవోయ్! కర్షకుడా!!
తాలూ తరకా గాలికి పోనీ
దయాశాంతులను ధాన్యపురసులు
బండ్లకు ఎత్తీ పాతర వేసీ
నీ గాదెల్లో నిండించాలోయ్-
నిద్దురలేవోయ్ ! కర్షకుడా!!
తప్పులేని తమ్ముడు
అందకుండా మీరు
ముందు పరుగేస్తుంటే
విడలేక తమ్ముడూ
వెనకాలె వస్తుంటే
ధుమధుమలాడారుటే! బిడ్డపై
దుమ్మెత్తి పోశారుటే!!
వడగాడ్పులో శోష
వచ్చి నాలుక ఎండి
చెరువులో దేవుడి
చ్చిన నీళ్లు త్రాగె నని
కళ్ళేఱ్ఱ చేశారుటే! తండ్రిపై
రాళ్లన్ని రువ్వారుటే!!
ద్వజస్తంభము కాడ
దణ్ణాలు పెడుతుంటే
మడిగట్టి కూర్చున్న
గుడిలోని జేజాయి
మైలబడు నన్నారుటే! నాయన్ని
"మాలవా" డన్నారుటే!!
అన్నలంతా గూడి
నన్ను కేటా జేసి
శివుడి గుళ్ళోకెళ్ళి
చిందులేశారంటు
వెక్కి వెక్కేడ్చాడురా! నా తండ్రి
చిక్కి సగమైనాడురా!!
జట్టులో రానీక
నెట్టి వేశారంటు
మరిగిపోయెను మనసు
తిరిగిపోయెను బుద్ది
కరిగిపోతున్నాడురా! నానాడు
తరిగిపోతున్నాడురా!!
కడగొట్టు తమ్ముడని
గారాబు తమ్ముడని
కనికరమ్మే లేని
కటిక రక్కసులార!
ఏ తప్పు చేశాడురా! మీ సొమ్ము
ఏమి కాజేశాడురా!!
బీదాసాదా
ఉందామంటే కొంపా లేకా
తిందామంటే తిండీ లేకా
కొందామంటే పైసా లేకా
కూరుచున్నా మోయ్ తండ్రీ!
కుములుచున్నా మోయ్!
రెక్కలన్నీ విరుచుకొని
రక్తమంతా ధారపోస్తే
రాకాసి లోకమ్మూ మమ్మూ
కూకలేస్తుందోయ్ తండ్రీ!
కేకలేస్తుందోయ్!
ఎండిపోయేను కండలన్నీ
ఇంకిపోయెను నెత్తురంతా
కరువు భూతం మా గుడిసెల్లో
కాలు పెట్టిందోయ్ తండ్రీ!
గజ్జే కట్టిందోయ్!
దివ్య దీపావళి
వెలగవే వెలగవే
విశ్వాంగణమ్ములో
దివ్యదీపావళీ!
నవ్య శోభవళీ!
వెలగవే వెలగవే
వీరభారతభూమి
దిగ్దిగంతములందు
దేదీప్యమానముగ
విజయ విప్లవ కర్మవీర వక్షోరక్త
సంసిక్త ముక్తావళీ!
కాలభైరవ మహాభీల ఫాలానల
ప్రజ్వల జ్వాలావళీ!
సాత్రాజితీ కృష్ణ సమర విజయోత్సాహ
చైతన్య రూపావళీ!
స్వాతంత్ర్య దీపావళి!
దివ్వెల పండుగ
దీపావళి దీపావళి దివ్యోజ్జ్వల దీపావళి
సత్యాక్రుష్ణుల విజయోత్సవ కౌతుక రూపావళీ
అస్వతంత్ర భారతీయ దాస్యతమస్సమూహాలు
శాశ్వతముగ పోకార్చెను విశ్వశాంతి చేకూర్చెను
దేశద్రోహుల మొగాలు తెల్లమతాబా రవ్వలు
ప్రజాపీడకుల గుండెలు పగిలిన తారాజువ్వలు
శీతాచల శిఖరమ్ములు స్వాతంత్ర్యజ్యోతులతో
అవిగో ధగధగ మెరిసేను అరుణ కమలములు విరిసెను
భారత విప్లవవీరుల ప్రస్పుర దాత్మజ్యోతులే
దీపికలై త్యాగగుణోద్దీపికలై దిగివచ్చెను
చిచ్చుబుడ్లు దివ్విటీలు చిచింద్రీలు దివి నిండెను
గగనంలో ప్రాగ్జ్యోతిష నగరం భగ్గున మండెను
జాలజాక్షుని చేతి విష్ణుచక్రము గిరగిర తిరిగెను
నరనారీకంటకు డగు నరకాసురు తల తరిగెను
తియ్యని చిరునవ్వులతో తెలుగు వెలుగు పువ్వులతో
చిట్టి చిట్టి చేతులతో సిరులు చిందు గీతులతో
గుమ్మటాలు తిప్పుకుంటు గుమ్మంలో కూర్చున్నావ్
ఎవరమ్మా! ఎవరమ్మా! అమ్మా! నీవెవరమ్మా?
వెలిగింపవె వెలిగింపవె వీరబాల! దీపమాల
యుగయుగాల చైతన్యం జగజగాల వెలిగింపవె
నవయువకుల హృదయంలో వేడివేడి చమురు పోసి
వెలిగింపవె వెలిగింపవె వీరబాల! దీపమాల
అదిగదిగో అరుణకాంతి! అదిగదిగో స్వర్ణకాంతి!
దేశమాత గుమ్మంలో దివ్యోజ్జ్వల దీపకాంతి!!