కదలండోయ్
కదలండోయ్ ! కదలండోయ్! కదలండోయ్!
కాదనోత్సాహం మిన్ను ముట్టగా
మదోస్మత్తులను మట్టుపెట్టగా ||కదలండోయ్||
ఉదయశ్రీ మిము పిలిచిందోయ్ ! ఆ
భ్యుదయం ముందర నిలిచిందోయ్
చెదిరిపోని శ్రీరామరక్షతో
ఎదురులేని ఏకైక దీక్షతో ||కదలండోయ్||
ఉదాసీనతను వీడవండోయ్! ఇక
ఉదజ్ముఖంగా నడవండోయ్!
గదాధారులై విరోధి గుండెల
బదాబదలుగా బాడాండోయ్! ||కదలండోయ్||
దృగంచలమ్ముల వీరోద్రేకం
దిగంచలమ్ముల విజయపతాకం
యుగయుగాల శౌర్యం వెదజల్లగా
జగజగాల సౌఖ్యం వర్ధిల్లగ ||కదలండోయ్||
నవయుగ భారత బాలలం
నవయుగ భారత బాలలం - చిరు
నవ్వుల పువ్వుల మాలలం
నవచైతన్యం నాట్యం చేసే
నవీన నర్తనశాలలం ||నవ||
నవ సమాజమును తీరుస్తాం - మా
నవ సమాజమును మారుస్తాం -
కవీంద్రులం యువ రవీంద్రులం - నవ
జవసత్వాలను సమకూరుస్తాం ||నవ||
మమతామయ మానస మందిరముల
సమతా తోరణములు కడతాం
నిత్యము నిర్భయముగ నిబ్బరముగ
జనని పాదముల కడ నిలబడతాం ||నవ||
జ్యోతి వెలిగించు
వెలిగింపరా జ్యోతి
వెలిగింపరా
విజయ భారతజాతి
విశ్వ మంగళగీతి
వినవచ్చుచుండేరా
విద్యార్ధి సోదరా ! ||వెలిగిం||
పారతంత్ర్య మహాంధ
కార కారాగార
ద్వారాలు బ్రద్దలై
వీర విస్పూర్తితో
నవ్య భారత భాగ్య
దివ్యఘంటాధ్వనులు
దిగ్దిగంతాల - ప్ర
తి ధ్వనించుచునుండే ||వెలిగిం||
అభ్రకంష మహా - హి
మాలయోత్తుంగ - శృం
గాగ్ర గంగాతరం
గ ప్రవాహమ్ములో
కాల మేఘాభీల
ఘట పటాపంచలై
స్వాతంత్ర్య చంద్రికలు
జాలువారేటట్లు ||వెలిగిం||
అరిభయంకర జయం
కర పవిత్ర క్షాత్ర
వీర విస్పార భా
రత కురుక్షేత్రాన
కలుష కౌరవ చమూ
కర్ణభేధమ్ముగా
విజయ గాండీవ రా
వము విజ్రుంభింపవలె ||వెలిగిం||
వ్యత్యాసాలు
మా కండలు పిండిన "నెత్తురు"
మీ పెండ్లికి చిలికిన 'అత్తరు"
మా మొగాల కీ "కన్నీరు"
మీ మొగాల కా "పన్నీరూ"
మా నోట్లో ఆకటి 'భగభగ"
మీ నోట్లో సిజర్సు "భుగభుగ"
మా కీ పడిపోయిన గోడలు!
మీ కే డంతస్తుల మేడలు!
చింపిగుడ్డ సింగారం మాకూ
ఒళ్ళంతా బంగారం మీకూ
మేము మండుటెండల్లో మాడుతు!
మీరు పండువెన్నెల్లో ఆడుతు!
మీ కార్ల కు పనికిరాని టైర్లు
మా కాళ్ళను కాపాడే జోళ్ళు
మా బ్రతు కిది మళ్ళీ మళ్ళీ
మీ బుగ్గన తిరిగే కిళ్ళీ!
బాబుగారి పాకీదొడ్లో
పట్టపగలు ఎలక్ట్రిసిటీ!
పాకీవాడి పూరిపాకలో
కార్మబ్బుల కటిక చీకటి!
మా లోపల అగ్ని జ్వాలలు
మీ లోపల అజీర్ణశూలాలు
మీ మోటార్ లేపిన ధూళి
మా నుదుటికి గులాబి పౌడర్!
వస్తున్నామే మేమిక్కడ
మేస్తున్నారా మీరక్కడ
ఎందాకా తమ కీ డాబులు!
క్రిందికి దిగుతారా బాబులు!!
వసుధైక కుటుంబం
ఓ నవభారత యువవీరా!
మానవతా దీక్షను గైకోరా!
ఆరని జ్యోతిని వేలిగింపుమురా
కారుచీకటులు తొలగింపుమురా ||ఓ నవ||
స్వాతంత్ర్యం నీ జన్మహక్కురా!
జగతికి సహజీవనమే దిక్కురా!
ఎల్ల లోకములు సౌఖ్యముగా - వ
ర్దిల్లాలన్నది వేదవాక్కురా! ||ఓ నవ||
జయభేరిని మ్రోగింపుమురా!
జైత్రయాత్ర సాగింపుమురా!
మతవిద్వేషం హతమార్చుటకై
బ్రతుకంతా వినియోగింపు,మురా! ||ఓ నవ||
సమైక్యతకు స్వాగతం బీయరా
శాంతిపావురా లెగురవేయరా
జవసత్వమ్ములు సడలిన జాతిని
చైతన్య చకచ్చకితం చేయరా ||ఓ నవ||
కార్మిక కర్షక కరావలంబం
నిర్మింపుము "వసుదైక కుటుంబం"
ఈ విశాల జగతికి మన భారతి
కావాలోయ్ చక్కని ప్రతిబింబం! ||ఓ నవ||
అంతా చీకటే
అంతా చీకటే ! బ్రతు
కంతా చీకటే!
శౌర్య ధైర్య సౌందర్యము లున్నా
చదువు లేక సంస్కారం సున్నా ||అంతా||
ఎన్ని ఎకరములు పోలమున్నా
ఏన్గును మించిన బలమున్నా
పదవున్నా సంపద ఉన్నా
చదువను వ్రాయను రానివాని కిక ||అంతా||
మీ కుండిన లోకజ్ఞానానికి
మెరుగుపెట్టుకొన బిడియం దేనికి?
వయోజనులమని సందియ మెందుకు
"జయోస్తు' చక్కగ సాగడు ముందుకు ||అంతా||
ఎక్కం వేసీ లెక్కలు వ్రాసీ
పత్రిక చదివీ ప్రపంచ మెరిగీ
నిరక్షరాస్యత నిర్మూలింపుడు
స్వరాష్ట్రమును చల్లగ పాలింపుడు ||అంతా||
కొయ్యలు చెక్కే అయ్యల్లారా
బట్టలు నేసె బాబుల్లారా
గుమ్మము లూడ్చే అమ్మల్లారా
అక్షరాలనే నేర్వండోయ్
అక్షయ సౌఖ్యము లందండోయ్ ||అంతా||
బాలవీరులు
స్వజాతి వీరశక్తులం
ప్రజా ప్రభుత్వ భక్తులం
అఖండ శౌర్యయుక్తులం
అజేయులం! అజేయులం!
స్వధర్మ కర్మవీరులం
స్వరాజ్య కర్ణధారులం
స్వదేశ చాటుకారులం
స్వతంత్రులం! స్వతంత్రులం!
సమైక్య భారతీయులం
అమోఘ వజ్రకాయులం
అనంత గుణవిధేయులం
అఖండులం! అఖండులం!
మహాత్మాగాంధి శిష్యులం
సుభాసుబోసు తమ్ములం
విశాల విశ్వభారతీ
విధాతలం! విధాతలం!
సువర్ణ వర్ణమాలతో
త్రివర్ణ కేతనాలతో
స్వతంత్ర సమరగాధలన్
లిఖించుతాం! లిఖించుతాం!
జయధ్వజంబు సాగెరా
జయం! జయం! జయం! జయం!
ప్రభాతభేరి మ్రోగెరా
శుభం! శుభం! శుభం!శుభం!
బాకా
మేమంతా తెలుగు పటాలం
ఏమైనా సహింపజాలం
స్వార్ధానికి స్వాగతమిస్తాం
సాంబారుకు సలాము చేస్తాం
ఆంధ్రంలో ఆలోచిస్తాం
అరవంలో ఫెయిర్లు వ్రాస్తాం
హిందీలో ప్రూఫులు దిద్దీ
ఇంగ్లీష్ లో అచ్చేయిస్తాం
మంత్రులమై బైఠాయిస్తాం
మదరాసుకు నీళ్ళు వదుల్తాం
మన రాష్ట్రం సమస్య వస్తే
మన కెందుకులే పొమ్మంటాం
బస్సుల్లో పచార్లు చేస్తాం
యస్సంటే యస్సేనంటాం
విస్సన్నలు విమర్శ చేస్తే
ముస్సోలిని ముఖాలు పెడతాం
స్వర్గానికి నిచ్చెన వేస్తాం
స్వాతంత్ర్యం మోసుకు వస్తాం
అయ్యల హస్తాలో పెట్టీ
అఘోరిస్తూ ఇంటికి వస్తాం
తెలుగంటే మూతి విరుస్తాం
వెలుగంటే కన్నులు మూస్తాం
కలుగుల్లో ఎలుకల్లాగా
స్వార్ధానికి గోతులు తీస్తాం
కాలానికి తాళం వేస్తాం
మేళానికి హంగులు చేస్తాం
ఎవరన్నా ఇదేమిటంటే
మీకెందుకు పో పొమ్మంటాం
గ్రూపుల్తో షాపులు పెడతాం
షాపుల్లో కాపులు కాస్తాం
వ్యాపారపు చూపులు చూసీ
పాపాలకు పర్మిట్లిస్తాం
అయోమయం మా శుద్దాంతం
అంధత్వం మా సిద్దాంతం
మేమంతా తెలుగుపటాలం
ఏమైనా సహింపజాలం.