Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 61

                                  విశాలాంధ్ర


    ఆ సీమని ఈ సీమని
    ఆగం చేస్తారెందుకు
    అంతా రాయలసీమే
    అంతా మన తెలంగాణే             ||సీమని||

    వీరంటూ వారంటూ
    వేరు చేయకండి బాబూ!
    మనకంతా ఒకే బాట
    మనదంతా ఒకేమాట               ||సీమని||

    కృష్ణవేణి తుంగభద్ర
    గోదావరి తరంగాలు
    పండిస్తాయ్ బంగారం
    నిండిస్తాయ్ మన గృహాలు         ||సీమని||

    ముందు చనిన అన్నలకూ
    వెనుకబడిన తమ్ములకూ
    అందరికీ ఒకే తల్లి
    అనురాగపు పాలవెల్లి               ||సీమని||

    తెలుగుతల్లి గుమ్మంలో
    కురుస్తుంది అమృతసృష్టి
    ఒకే తుష్టి ఒకే దృష్టి
    మనమంతా ఒక సమష్టి           ||సీమని||

    శాంతి కొరకు కాంతిలోకి
    సాగిద్దాము ప్రయాణం
    విశాలాంధ్ర నిర్మాణం
    ఆశేషాంద్ర కల్యాణం                 ||సీమని||

    
                                విజయీ భవ
    
    విజయీ భవ! విజయీ భవ!
    విశాలాంధ్ర విద్యార్దీ!

    విజయరధం నీ హృదయం
    వీరపధం నీ ఉదయం
    విశ్వకళాక్షేత్రంలో
    వెదజల్లుము అభ్యుదయం
    
    సత్యం నీ సాహిత్యం
    సౌభ్రాత్రం నీ మిత్రం
    సౌశీల్యం నీ జీవం
    స్వాతంత్ర్యం నీ దైవం
    
    నవభారత గీతంలో
    యువభారత సంగీతం
    జయభారత గానంలో
    భయవిరహిత బలిదానం
    
    శ్రమరక్షణ క్రమశిక్షణ
    సమవీక్షణ గురుదక్షిణ
    పరీక్షలో జయం నీది
    ప్రజాస్వామ్య సామ్యవాది
    
    పెద్దతలలు గద్దేలకై
    గుద్దులాడుకొంటున్నై
    వద్దనవోయ్ స్వార్ధబుద్ది
    కద్దనవోయ్ కార్యసిద్ది

    తుంగభద్ర సొంపు\
    పెన్నానది పెంపుల్లో
    మందే రాష్ట్రం కనవోయ్
    "వందేమాతర" మనవోయ్
    
    తెలుగుతల్లి కన్నుల్లో
    వెలుగుతుంది మన భాగ్యం
    భాగ్యనగర వీధుల్లో
    పండును మన సౌభాగ్యం
    
    గోదావరి తరగల్లో
    కృష్ణవేణి పరుగుల్లో
    బంగారం పండుతుంది
    ప్రజల కడుపు నిండుతుంది
    
    జాతీయతలో అంత
    ర్జాతీయత నిర్వచించు
    నవనవోదయంలో మా
    నవ నవోదయం రచించు
    
    ప్రజారధం కదుల్తూంది
    ప్రజాధ్వజం మెరుస్తుంది
    ప్రజాయుగం వెలుస్తుంది
    ప్రజావాణి పిలుస్తుంది.

    విజయీభవ! విజయీభవ!
    విశాలాంధ్ర విద్యార్దీ!

                               తప్పు దులుపుకో

    లై లై లై లై చౌవన్ లై
    ఇటులై అటులై అటు లిటులై - నీ
    వెటులై పొదువో చౌవన్ లై
    
    చేసిన యత్నం చిటపటలై - నీ
    పండిన పాపం పటపటలై
    ఇటులై అటులై అటులిటులై - నీ
    వెటులై పొదువో చౌవన్ లై
    
    తప్పు దిద్దుకో చౌవన్ లై - నీ
    పప్పు లుడుకవోయ్ చౌవన్ లై
    ఇటులై అటులై అటులిటులై - నీ
    వెటులై పొదువో చౌవన్ లై
    
    తప్పు దులుపుకో చౌవన్ లై - నీ
    ముప్పు తెలుసుకో చౌవన్ లై
    ఇటులై అటులై అటులిటులై  -నీ
    వెటులై పొదువో చౌవన్ లై
    
    నీలో న్యాయం నై నైనై - మరి
    నీకీ దురాశ వై వై వై?
    ఇటులై అటులై అటులిటులై - నీ
    వెటులై పోదువో చౌవన్ లై
    
    అంతై ఇంతై అల్లంతై - ఇక
    గంతలబొంతై గల్లంతై
    ఇటులై అటులై అటులిటులై - నీ
    వెటులై పోదువొ చౌవన్ లై

                                సింహకిశోరం

    యువభారత సింహకిశోరమ!
    మనదేరా విజయ యశోరమ
    "జైహిం" దనినడుపుము ముందుకు
    సందేహం మరి నీ కెందుకు         ||యువ||

    అపజయమన్నది యిక లేదురా
    ఆలస్యం మంచిది కాదుర
    అందింపర జాతికి జీవం
    సంధింపర నీ గాండీవం             ||యువ||

    కావింపుము వీరవిహారం
    కదలింపుము స్కంధావారం
    సత్యానికి స్వాగతమీయర
    సౌఖ్యానికి బాటలు వేయర         ||యువ||

    కొట్టేయర దూర్తాచారుల
    నేట్టేయర దురహంకారుల
    పట్టింపర వచ్చిన దారీ
    కట్టింపర హింసకు గోరీ               ||యువ||

    మద మెక్కిన కరి కలభమ్ములు
    కదలించెను నీ మీసమ్ములు
    గుండెలు పగులగ గర్జింపర
    గూండామూకల నిర్ణింపర            ||యువ||

    
                               పురోగమింపర

    పురోగమింపర సహోదరా!
    పరాక్రమింపర మహావీరా!
    కరాళశస్త్రం కరాన దాలిచి
    కురుక్షేత్ర సంగ్రామంలోనికి                 ||పురో||

    దురాశతో ముష్కరాధములు - మన
    స్వరాష్ట్రసీమల హరింతురా    
    ధురంధరుడవై యుగంధరుడవై
    విరోధిమూకల నిరోధింపరా               ||పురో||

    విశాలభారత యశోగిరీంద్రం
    నిశాచరులతో నిండేనురా
    దిశాంతములలో అశాంతి రేపుచు
    విశాచబలములు నిలుచుండేనురా        ||పురో||

    హుటాహుటిని ఉద్భటానలార్చి
    ర్న టేశ్వరుడవై నడుపుమురా
    ప్రళయకాల దుర్వార భయంకర
    బడబాగ్నులు కురిపింపుమురా            ||పురో||

    
                                 ఖబర్ దార్
    చైనా చిట్తోడా!
    సిసింద్రీల జుట్తోడా!
    ఏనాటికైనా నీ వెక్కలేవు మా గోడా        ||చైనా||

    నల్లమందు తింటివా
    చెడ్డకలలు కంటివా
    మైదు మాట లెన్నో చెప్పి
    మ్యావు మ్యావు మంటివా                  ||చైనా||

    దబాయింప చూస్తివా
    జబర్దస్తీ చేస్తివా
    ఖబర్ధార్ గీత దాటి
    కాలు ముందుకు కేస్తివా                    ||చైనా ||

    చాలు నక్కజిత్తులు
    సాగవు నీ యెత్తులు
    వీరభారతీయు లెత్తి
    నారు విచ్చుకత్తులు                          ||చైనా||

        
                                              రంగి - రంగడు     

    ఒంటికంటి ఎలుగుబంటి చిన్నదాన!
    మన ఇంటిలోకి దూరినాదె పిల్లదాన!

    దుడ్డుకఱ్ఱ పుచ్చుకొని చిన్నవాడ!
    దాని నడ్డి విరుగగొట్టవోయి వన్నెకాడ!

    కుంటికాళ్ల కొంటెకోతి చిన్నదాన! మన
    గోడ దుమికి వచ్చినాదే పిల్లదాన!

    కొంటె కోతి తుంటి మీద చిన్నవాడ! బాగ
    గంటె కాల్చి వాతపెట్టు వన్నెకాడ!

    గోవుమూతి పెద్దపులి చిన్నదాన! మన
    గొడ్లపాక ముందు నిలిచె పిల్లదాన!

    మోము చూసి మోసపోకు చిన్నవాడ! దాని
    మూతి పగులగొట్టవోయి వన్నెకాడ!

    దేశమాత పిలుపు వచ్చే చిన్నదాన! నన్ను
    దీవించి పంపుతావ పిల్లదాన!

    వెళ్ళిరమ్ము జయము గొమ్ము చిన్నవాడ! నాకు
    మల్లెపూలదండ తెమ్ము వన్నెకాడ!

                                  రక్తదానం

    దానం చేయండీ! రక్తదానం చేయండీ!
    దానమ్ములలో రక్తదానమే
    మానవజాతికి మహాప్రధానము           ||దానం||

    కండలు కొరికే కొండలలోపల
    గుండెలొడ్డి కూర్చుండిరి వీరులు
    గుండెదెబ్బలకు గురియై నప్పుడు
    పోయిన నెత్తురు పూర్తిచేయుటకు        |\దానం||

    మనకోసం మనదేశం కోసం
    మన పసిపాపల మనుగడ కోసం
    కందకములలో కాననములలో
    పోరుచున్న మన వీరుల కోసం           ||దానం||

    మీ రొసంగు ప్రతి నెత్తురు బొట్టూ
    భారత ప్రగతికి బంగరు మెట్టూ
    అభ్యుదయానికి ఆయువు పట్టూ
    గూండామూకకు గొడ్డలిపెట్టూ               ||దానం||

 Previous Page Next Page