చిన్న కుటుంబం
ఒక్కరైతే ఎంతో ముద్దురా! ఇం
కొక్కరైనా సుఖం కద్దురా!
అంతకంటే మించి వద్దురా! అధిక
సంతానమున శాంతి రద్దురా ! ||ఒక్కరైతే||
బస్సులన్నీ నిండిపోయెరా! ఎక్స్
ప్రేస్సులేన్నో చాలవాయేరా!
గుడులందు బడులందు నడిబజారులయందు
కానరాదాయేరా కాలు పెట్టె సందు ||ఒక్కరైతే||
చిన్న కుటుంబమే మేలురా! అంత
కన్న మరికన్న గగ్గోలురా!
ఉన్న సంతతి నీకు చాలురా! విన
కున్న బ్రతుకది వీధి పాలురా! ||ఒక్కరైతే||
జయహే జవహర్లాల్
జయహే జవహర్ లాల్! జయ
జయహే జవహర్ లాల్!
పంచశీల నీ అంత స్సాక్ష్యం
ప్రజాసేవ నీ జీవితలక్ష్యం
స్వతంత్రభారత జనతాభ్యుదయం
సతతము కోరెను గద నీ హృదయం ||జయహే||
భరతమాత గారాబు బిడ్డనై
బాపూజీ ప్రియతమ శిష్యుడనై
భారత పుత్రుల భాగ్యరాశివై
ప్రపంచమంతా ప్రసిద్ది గంటివి ||జయహే||
విశాలవిశ్వం దివ్యశాంతిలో
అశోకచక్రం నవ్యకాంతిలో
త్రివర్ణకేతన సువర్ణరేఖలు
"సత్యమేవ జయతే" నీ శాఖలు ||జయహే||
సత్యం ధర్మం సమరభావం
స్వయంపోషణం సౌభ్రాతృత్వం
సహోదరులచే గ్రహింప చేసిన
మహానాయకా! జోహార్ ||జయహే||
ప్రియశాస్త్రీజీ
కనుమూసితివా బహుదూర్ జీ! ఇక
కనపడవా మా ప్రియ శాస్త్రీజీ ||కను||
దురహంకారుల గుండెగాల మగు
నిరహంకారిని నీవేగా
భరతావని నీ పరిపాలనలో
పురోగమించేను వేవేగా! ||కను||
భారత పాకీస్తాను మైత్రికై
ప్రాణా లర్పించితివా!
శాంతి మహాయజ్ఞములో బ్రతుకే
స్వాహా కవించితివా! ||కను||
మానవజీవనమును మెరపించిన
మా నవజీవన ధృవతారా!
దానవత్వమును రూపుమాపితివి
ధన్యుడవో భారతవీరా! ||కను||
ప్రియ బాపూజీ శాంతిపధం
వీర పటేల్ జీ క్రాంతిపధం
పండిత నెహ్రూ కాంతిపధం
వెలిగించెను నీ విజయరధం ||కను||
కర్మవీరుడు కందుకూరి
అందుకొండోయ్ అందుకోండోయ్!
అందుకోండోయ్! కాన్క లందుకొండోయ్!
"కందుకూరీ" గొప్ప కర్మవీరుండోయ్!
వీరేశలింగ మొక విప్లవతరంగమోయ్!
ఆంధ్రజాతికి మేలుకొల్పు పాడా దతడు
అంధ్ర గౌరవగీతి ఆలపించా డతడు
అంధవిశ్వాస గాడాంధకారము బాపి
అభ్యుదయగతుల ముందడుగు వేయించాడు!
తెలుగుగడ్డకు మంచిపేరు తెచ్చాడతడు
తెలుగుబిడ్డకు ముందుచూపు నిచ్చాడతడు
తెలుగుగుండెకు క్రొత్తవెలుగు పోశాడతడు
కులమత ద్వేషాలు కూల్చివేశా డతడు!
సవ్యాంధ్ర సాహితికి నాందిగీత మ్మతడు
ప్రాచీన సాహితికి భరతవాక్య మ్మతడు
దేశమంతటికి సందేశమైనా డతడు
లోకాని కొక నవాలోకమైనా డతడు!
సంఘసంస్కార దీక్షాబద్ధ కంకణుండోయ్
సాహిత్య నవయుగాస్థాన సంస్థాపనుండోయ్
మహిళా మహాభ్యుదయ మహనీయజీవనుండోయ్
అమరవీరునికి జోహారు లర్పిద్దాము రండోయ్!
జైత్రయాత్ర సాగించు
నరునిలా ఆలోచించు
సింహంలా పరాక్రమించు
నరసింహుడవై విజ్రుంభించు
నవయుగాన్ని ఆవిష్కరించు
అచంచలమైన ధైర్యంతో
అమోఘమైన స్థైర్యంతో
చెదరని దరహాసంతో
బెదరని విశ్వాసంతో
జైత్రయాత్ర సాగించు
జయశంఖం మ్రోగించు
మహితమైన నీ మంత్రాంగం
సమైక్యతా యంత్రాంగం
సరసమైన నీ హృదయం
సరస్వతికి అభ్యుదయం
సహజమైన నీ సౌజన్యం
జాతికి నవచైతన్యం
చల్లనైన నీ కైదండ
కష్టజీవులకు అండ
ఆహారహం పురోగమించు
అఖండజ్యోతివై ప్రకాశించు
అభివృద్ధి నిరోధక సైందవులూ
కురువృద్ద గురువృద్ద బంధవులూ
దుష్ట వృకాలూ
ధూర్త జంబుకాలూ
రాకాసీ కబంధ బంధాలూ
చీకట్లను ప్రేమించే దివాంధాలూ
నిలువలేవు నీ దారిలో ఇవేవీ
నిజం నిజం మా ప్రియమైన పీ.వీ.
విజయ భేరి
విజయభేరి మ్రోగింపుమురా
విజయశ్రీ వరియింపుమురా
హిమాలయం వలె నిలిచి శాత్రవుల
యమాలయానికి పంపుమురా ||విజయ||
ధర్మానికి జయ పెట్టుమురా
ధైర్యానికి జేకొట్టుమురా
దుర్మార్గంగా త్రోసుకువచ్చే
ద్రోహికి సమాధి కట్టుమురా ||విజయ||
దుండగీండ్ర దండింపుమురా
గూండాలను ఖండింపుమురా
కండలు క్రొవ్విన కటిక రక్కసుల
తుండే తుండేలుగ చెండుమురా ||విజయ||
క్షాత్రభూమి నీదేశమురా
ధాత్రికెల్ల సందేశమురా
శత్రుశిక్షణం మిత్రరక్షణం
జగన్మాత ఆదేశామురా ||విజయ||
భరతమాత ఆనందభాష్పములు
ప్రవహించెను నీ శిరోభాగమున
పరమశివుడవై పురోగమింపర
దురహంకారుల పరాభవింపరా ||విజయ||
జటాజూటమును విడలింపుమురా
నిటాలేక్షణము కదలింపుమురా
కాలభైరవాభీల కరాళ
జ్వాలామాలలు విరజిమ్ముమురా ||విజయ||
రా చెల్లి! రా తల్లీ!
గుండెల్లో నే డేదో - కొత్త ఆశ తలెత్తింది
ఎండిన వృక్షం కన్నుల - పండువుగా చిగిర్చింది
తీరనికోరిక ఏదో - తీయంగా హసించింది
అందని అందం ఏదో - అంతస్సును స్ప్రుశించింది
తుంగభద్ర తరంగాలు - పొంగిపొరలిపోతున్నవి
బంగారపు గుడిగంటలు - "ఖంగు ఖంగు" మంటున్నవి
తెలుగుతల్లి గుడితలుపులు - తీస్తారట ఈ ఉదయం
విశాలాంధ్రకే రాస్తా - వేసిందట జనహృదయం
రాచేల్లీ! రా తల్లీ - రా అన్న! రా తమ్ముడు !
తెలుగుతల్లి అడుగులపై - వెలుగుపూలు విరజిమ్ముడు!!