Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 6

 

    పేవ్ మెంటు మీద పడుకున్న ఓ బిచ్చగాడు హడావుడిగా పరుగెత్తుకుంటూ వచ్చి లాటరీ టికెట్టు కొనేశాడు.
    ఏ.సి. రూంలో మొగుణ్ణి కావలించుకుని నిద్రపోతున్న ఓ ఇల్లాలు ఉలికిపడి లేచింది.
    ఇంకా మొద్దులా నిద్రపోతున్న మొగుడిని లేపింది.
    "ఏమండీ ఈరోజే ఆఖరు రోజట! సిరీస్ కి ఒకటి చొప్పున టికెట్లు తెప్పించండి " అంటూ సతాయించింది.
    "ఊ పడుకో , అబ్బా! యింకా తెల్లారలేదు" భుజాలు పట్టి లాగాడు .
    "హు! అలాగే నిద్రపోండి ! నదిలో మునిగిపోయే పడవలా తయారయ్యింది. అప్పుడు ఏ పేవ్ మెంటు మీదో పడుకుని ఇంకా హాయిగా నిద్రపోవచ్చు" విసురుగా దూరం జరిగిందావిడ.
    భర్త ఉలికిపడి లేచాడు.
    నైటు గౌనులో అలాగే వీధిలోకి పరుగు తీశాడు.
    "ఇంకా ఆలస్యం చేస్తున్నారా? అదృష్టం చేజరిపోవచ్చు. అనంద లోకం మీకు దూరం కావచ్చు. కాశీ మజిలీ కధలో రాజకుమారి వరించిన ఆ రాకుమారుడు మీరే కావచ్చు!
    రండి బాబూ! రేపే డ్రా! మరో యిరవై నాలుగు గంటలలో బంపరు డ్రా పదిలక్షలు! మీ తలుపులు తడుతున్నాయి" హడావుడిగా అందరూ నిద్ర మంచాల మీద నించి లేచివచ్చి టికెట్లు కొంటున్నారు.
    కోరుకున్న సిరీస్! లక్కీ నంబర్లు! పక్కా నమ్మకాలు!
    టికెట్లు కొన్నవారు పూజామందిరాల్లో, దేవుడి ఫోటోల దగ్గర దాచుకుంటున్నారు. గుండెల్లో దాచుకుంటున్నారు. బహుభద్రంగా! మళ్ళీ పడుకుని ఆ లాటరీ తమకే వస్తే ఏమవుతుందా అని ఊహించుకుంటూ కలల గుర్రాల మీద తేలిపోతున్నారు.
    "ఇవాళ యింట్లో గంజి కాయటానికి నూకల్లెవురా! ఆ రూపాయి ఎందుకు సముద్రంలో ముంచుతావు" అంటోంది ఓ దీనురాలయిన భార్య బిడ్డని ఒడిలో పోదువుకుంటూ!
    "లాటరీ తగిలితే నూకలే ఖర్మ! ఐస్ క్రీం కొనిపెడతా! బంగ్లా కొనిపెడతా! వొళ్ళంతా బంగారం నగలు చేయించి పెడతా!" రూపాయి తీసుకొని పరుగు లంకించాడు వినిపించుకోకుండా!
    "అన్నీ పెడతావు నువ్వు. పెట్టి పెట్టి ఇంరకాడికి తెచ్చావు. ఏ బిడ్డా! ఒడి బిడ్డా! కడుపులో బిడ్డ! నీకు మాత్రం లాటరీ కన్పిస్తే కళ్ళు కన్పించవు. " పైట కొంగుతో పొంగి వచ్చే కన్నీటి ఉప్పెనను అపుకోవాలని ప్రయత్నించిందా దీనురాలయిన తల్లి!
    ఆ మాటలు పట్టించుకోకుండా అతడు లాటరీ టికెట్ కొని తెచ్చాడు. మెరిసే కళ్ళతో దాని వంక చూసుకున్నాడు. మెడలో నూలు దారానికి కట్టి ఉన్న దేవుడి బొమ్మకి దాన్ని తాకించాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని కలలు కనటం ప్రారంభించాడు.
    ఆ ప్రక్కనే ఉన్న పార్కులో రాత్రి అంతా నిద్రలేక మండుతున్న కళ్ళతో నిరాశగా చూస్తున్నాడు జయసింహ! రాత్రి కొద్దిగా చినుకులు పడ్డాయి. ఎగిరే పురుగులు విజ్రుంభించాయి. పార్కు చుట్టూ పగిలిపోయిన డైనేజి పైపు ల్నించి మురికి పదార్ధాలు పేరుకు పోతున్నాయి .
    దోమలు ఈగల్లా, ఈగలు ఏనుగుల్లా ఉన్నాయి. నడుం వాల్చ్జే అందుకే కాని ఆ పార్కులో నిద్ర పోయేందుకు లేదు.
    సుప్రభాతన వీస్తున్న చల్లని గాలి కంటి మంటల్ని ఓదార్చుతోంది.
    "బాబుగారు నిద్రలేచారా?" పార్కులో ఓ మూల చిన్న పాకలో నివాసముంటున్న వాచ్ మన్ వచ్చి ప్రక్కనే కూర్చున్నాడు.
    "నిద్రపోతే కదా లేవటానికి?"
    "రాత్రంతా ఏం చేశారు బాబూ!"
    "ఈగల్లాంటి దోమల్ని, ఎనుగుల్లాంటి ఈగల్ని చంపుతూ కూర్చున్నాను" ఎర్రగా అయిపోయిన చేతుల్ని చూపించాడు.
    పానకాలస్వామి లేచి వెళ్ళి ప్లాస్టిక్ గ్లాసులో పైపు దగ్గర నీళ్ళు పట్టి తెచ్చి యిచ్చాడు. అభిమానంగా అందించాడు.
    "చేతులు తుడుచుకోండి బాబూ!" అన్నాడు ఆప్యాయంగా ! చేతులు ముఖము తుడుచుకున్నాడు జయసింహ!
    "బాబూ! రాత్రి అన్నం తిన్నారా?"
    "పానకాలస్వామి ! నువ్వు ఉద్యోగివి , నేను నిరుద్యోగిని"
    'అన్నం వొండి పెడతాను. తింటారా బాబూ!' అతనికీ ఎవరూ లేరు.
    "వద్దులే నా కష్టాన్ని నువ్వెందుకు పంచుకుంటావు?"
    "బాబూ! తమరు సదువుకున్నోరు. పెద్దోరు. తమకి సెప్పగలతాహతు నాకు లేదు. కాని నాకున్న వయసు, అనుభవం ఎక్కువ. నీ తండ్రి లాంటోన్ని ! చెబుతున్నా!
    దిక్కులేనోళ్ళకి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడున్నడో లేడో తెలియదు. కాని ఏ దిక్కులేని ఎకాకులందరికి ఒకరికోకరే దిక్కు! నాకేమీ కష్టం కాదు . అలవాటే!"
    "వొండి పెడతాను తిను బాబూ!" లేచి వెళ్ళిపోయాడు.
    సన్నగా చినుకులు ప్రారంభమయినాయి.
    రాత్రి పది గంటల తరువాత ఎవర్ని పార్కులోపలికి అనుమతించ కూడదు. కాని పానకాలస్వామి ఓ కుటుంబ సభ్యుడుగా తనకి ఆశ్రయమిచ్చి ఆదరించాడు.
    నా అనుకునే వాళ్ళెవరూ లేని మనుషులు!
    అతను ఉద్యోగి! తాను నిరుద్యోగి!
    పానకాలస్వామి మంచితనం మనస్సుని కదిలిస్తోంది.
    జయసింహ కన్నులు చెమరించు తున్నాయి. అతని వంక చూస్తుంటే?

 

                                          *    *    *

    బ్యాంకు రీజనల్ మేనేజర్ కార్యాలయంలో టెలిప్రింటర్లు టక్ టక్ లాడుతున్నాయి. స్టాఫ్ చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు.
    టైపు మిషన్ లు చాల వేగంగా కదులుతున్నాయి. బ్యాంక్ చెయిర్మన్ గారు విజిటింగ్ వచ్చారు. ఆర్.ఏం. చాంబర్ లో మీటింగ్ జరుగుతోంది. సీనియర్ అధికారులంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
    బయట పత్రికా విలేకరులు సిద్దంగా ఉన్నారు.
    "అన్ పార్చునేట్! ప్రమాదం జరిగింది. పోలీసు డిపార్టుమెంటు  ఇంతవరకూ ఏమీ తేల్చలేకపోయింది. సి.బి.ఐ అధికారులు బ్లూ ఫాక్స్ కమెండోలు కూడా రంగంలోకిదిగి పనిచేస్తున్నారు.
    స్ట్రాంగ్ రూమ్ లో ప్రేలుడు జరగటం, బ్యాంక్ లాకరులు మూడు వరసలు పగిలిపోవటం మాటలు కాదు.
    ఈ పరిస్థితిని మనం యిప్పుడు సమీక్షించాలి!' అపరాధి వంక చూచినట్లుగా బ్రాంచి మేనేజరు వంక చూచారు చెయిర్మన్.
    బి. యమ్ గారు తల దించుకున్నారు.
    "పురుషోత్తంగారూ! మీకు తెలిసినంతవరకూ ప్రమాదం ఎలా జరిగిందో వివరించండి. రిపోర్టు వ్రాసి పంపారు. నేనూ చూచాను. చాలా అస్పష్టంగా ఉంది.
    ఆ తరువాతే మరికొన్ని వివరాలు తెలుసుంటాయి కదా! చెప్పండి" ఆర్.యం. గారు బి.యం ని ప్రోత్సహించారు.
    "ప్రేలుడు సోమవారం ఉదయం తొమ్మిది గంటల అయిదు నిమిషాలకు జరిగింది. తొమ్మిదిన్నరకు షట్టరు తాళాలు తీయాలి. అప్పటి వరకూ ఎవరూ రాలేదు.
    అంతకు ముందు రోజు ఆదివారం ,శనివారం ముస్లింల పండగ. పబ్లిక్ హాలీడే! శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ అందరూ అయిదు గంటలకే వెళ్ళి పోయారు.
    నేను టెలిగ్రాంలు పంపాలని మరో అరగంట ఆఫీసులోనే ఉన్నాను. అటెండరు కూడా ఉన్నాడు.
    ఆరుగంటల పదినిమిషాలకి టెలిగ్రాంలు వ్రాయటం పూర్తీ అయ్యింది. అటెండరు కొచ్చి పంపాను. తంతితపాలా కార్యాలయం దగ్గరలోనే ఉంది. టెలిగ్రాంలు యిచ్చి రశీదులు తీసుకొని అటెండర్ ఆరు యిరవై అయిదుకి వచ్చాడు.
    ఆరు ముప్పయ్ కి షట్టర్స్ మూసేశాం! సోమవారం ఉదయం పది గంటలకు యింకా అయిదు నిముషాలుందనగా నేను ఆఫీసుకు వచ్చాను. అప్పటికే ప్రమాదం జరిగిపోయి ఉంది. రిపోర్టులోని విశేషాల్ని వివరించాడు  బి.ఎం. పురుషోత్తం.   

 Previous Page Next Page