Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 59

 

                                  పండుగరోజు
    
    వచ్చింది వరహాల రోజు - కొని
    తెచ్చింది మనకెంతో మోజు - ఆహా                  ||వచ్చింది||

    దొంగ వ్యాపారాల శృంగభంగం చేసి
    దోపిడీ తోడేళ్ళ తోకల్లు తెగ్గోసి
    హలమూ కలమూ కలిసి అవని పాలించాలి
    బుజమూ బుజమూ కలిపి ప్రజలంతా నడవాలి     ||వచ్చింది||

    చిన్న రైతుల బట్టి చిక్కులలో బెట్టి
    పన్ను గట్టని స్వార్ధపరుల పని పట్టాలి
    నల్లబజార్లల్లో కొల్లగొట్టుకు తినెడి
    భల్లూకరాయుళ్ళ పళ్ళూడగొట్టాలి                     ||వచ్చింది||

    గతిలేని నిరుపేద బతుకు వెలిగించాలి
    మతిలేని అధికార్ల మత్తు వదిలించాలి
    మధ్యతరగతి ప్రజల మనుగడలు నిలపాలి
    దుడుకు పెత్తందార్ల మెడబట్టి దులపాలి               ||వచ్చింది||

        
                             ఎఱ్ఱకోట పై ఎగిరే జెండా

    ఎఱ్ఱకోటపై ఎగిరే జెండా ఏమి చెప్పెరా చిన్నోడా? నీ
        కేమని చెప్పెర బుల్లోడా?

    శౌర్యం త్యాగం సమైక్య భావం చాటి చెప్పెనే చిన్నమ్మీ! కను
        గీటి చెప్పెనే బుల్లెమ్మీ!

    సిపాయి పేల్చిన తుపాకీ శబ్దం ఏమి చెప్పెరా చిన్నోడా? నీ
        కేమని చెప్పెర బుల్లోడా?
    
    దురాక్రమణలను నిరోదింపుమని మ్రోగి చెప్పెనే చిన్నమ్మీ! చెల
        రేగి చెప్పెనే బుల్లెమ్మీ?        ||ఎఱ్ఱ||

    తూర్పున పొడిచే సూర్యుడి కిరణం ఏమి చెప్పెరా చిన్నోడా? నీ
        కేమని చెప్పెరా బుల్లోడా?

    చీకటి తెరలను చీల్చివేయమని చేరిచెప్పెనే చిన్నమ్మీ! చెవి
        దూరి చెప్పెనే బుల్లెమ్మీ!        ||ఎఱ్ఱ||

    సింహాచల నరసింహసామి నీ కేమి చెప్పెరా చిన్నోడా? నీ
        కేమని చెప్పెర బుల్లోడా?

    రక్కసి మూకల డొక్కా చీల్చమని నొక్కి చెప్పెనే చిన్నమ్మీ? కొం
        దెక్కి చెప్పెనే బుల్లెమ్మీ!        ||ఎఱ్ఱ||

    చల్లగ ఎగిరే శాంతిపావురం ఏమి చెప్పెరా చిన్నోడా? నీ
        కేమని చెప్పెర బుల్లోడా?

    ఎల్లలోక మొకటే కుటుంబమని మెల్లగ చెప్పెనే చిన్నమ్మీ! మేల
        మెల్లగ చెప్పెనే బుల్లెమ్మీ!        ||ఎఱ్ఱ||

    
                                   సహ జీవనం    

    యుగయుగాల మన మానవజాతికి - ఉజ్జీవనం
    జగజగాల చైతన్యజ్యోతికి - సంభావనం
    జీవనం సహజీవనం
    నవజీవనం మా - నవజీవనం
    
    మానవులంతా అన్నదమ్ములని
    మానవసేవయే మాధవసేవని
    ఏరువాకగా పూలనౌకగా
    సాగుము ముందుకు సందియ మెందుకు    ||జీవనం||

    కోటీశుల పన్నీటి చిందులూ
    నిరుపేదల కన్నీటి బిందువులూ
    మంచిముత్యాలుగ మణితోరణాలుగా
    ప్రగతి పధంలో ప్రజారధంలో                    ||జీవనం||

    సురచిర సురభిళ సుమమాలలో
    ప్రళయ మహాజ్వాలన జ్వాలలలో
    మధురగాధగా విధురబాధగా
    విధినిర్వహణమె విజయపతాకగ               ||జీవనం||

    సమతలోని సౌందర్యం కనుగొని
    మమతలోని మాధుర్యం చవిగొని
    సమసమాజ సంస్థాపన హితమును
    "సత్యమేవ జయతే నానృత మను              ||జీవనం||

        
                                    చదువు


    చదవు నేర్చుకొని శక్తి కూర్చుకొని
    జాతి గౌరవం పెంచండోయ్!
    జగతికి ప్రగతిని పంచండోయ్ ! ఈ
    జగతికి ప్రగతిని పంచండోయ్!        ||చదువు||

    దళారి ఆటలు కట్టాలంటే
    దగాకోర్లపని పట్టాలంటే
    పల్లెల భాగ్యం పండాలంటే
    ప్రజలు సుఖంగా ఉండాలంటే         ||చదువు||

    పల్లెలోని పెదబాబుల్లారా!
    మిల్లులోని కూలన్నల్లారా!
    చదువే అనలౌ ప్రయోజకత్వం
    చదువే సిసలౌ నియోజకత్వం         ||చదువు||

    పలుగూ పారా పట్టే చెయ్యే
    పలకా బలపం పట్టాలోయ్
    హలం పట్టుకొను ఆ హస్తంతో
    కలం కాగితం పట్టాలోయ్               ||చదువు||

    చదువుకుంటే సంఘంలో స్థానం
    చదువుకుంటేనే లోకజ్ఞానం
    చదువే మనిషికి మూడవనేత్రం
    చదువే బ్రతుకుకు గౌరవపాత్రం         ||చదువు||

    
                                   విధి వంచితులు


    వ్యధా భరిత జీవనులారా!
    విధివంచిత మానవులారా!
    రోగులమని దిగులెందుకు సాగుడు మునుముందుకూ
    రోగాలను పారద్రోలి బాగుపడేటందుకూ                            ||వ్యధా||

    దగ్గలేక దగ్గలేక బాధపడే అమ్మడూ!
    దగ్గి దగ్గి బలంతగ్గి శల్యమైన తమ్ముడూ!
    క్షయరోగం నయమోనర్చి భయం తీర్చి ప్రియం కూర్చి
    బ్రతుకును సుఖమయం చేయు ప్రముఖవైద్య లేతెంచిరి       ||వ్యధా||

    పండువంటి దేహమంత పుండైపొయిందటంచు
    కుళ్ళికుళ్ళి ఏడ్వబోకు కుష్టురోగ సోదరుడా!
    నీ రోగం నాయమోనర్చి ఆరోగ్యం దిద్దితీర్చి
    క్రొత్త బ్రతుకు చేకూర్చే గొప్ప డాక్టరులు వచ్చిరి.                  ||వ్యధా||

    కన్నులున్న గ్రుడ్డికన్న కనులులేని గ్రుడ్డి నయం
    ధనగర్వాంధుల కంటే జనుషాంధులు చాల నయం
    కనులులేని సోదరులకు మనసు విప్పి చదువు చెప్పి
    ఆత్మదృష్టి ప్రసాదించు అధ్యాపకు లరుదెంచిరి     ||వ్యధా||


                             ఉదయించే రవిబింబం
    
    కడలంటిన కోడికూత ఏమన్నది? ఏమ్మన్నది?
    ప్రొద్దు పొడిచే ప్రజలంతా నిద్దుర లేవాలన్నది.

    ఉదయించే రవిబింబం ఏమన్నది/ ఏమన్నది?
    నవయుగ చైతన్యానికి నాంది పలుకుతా నన్నది.
    
    ముంగిట్లో రంగవల్లి ఏమన్నది? ఏమన్నది?
    బంగారపు సంక్రాంతులు పొంగిపొరలవలె నన్నది.

    ఎఱ్ఱకోటపై జెండా ఏమన్నది? ఏమన్నది?
    సమతకు మమతకు పొంగిపోరలవలె నన్నది.

    కరుణశ్రీ కవి హృదయం ఏమన్నది? ఏమన్నది?
    ప్రగతిశీల సౌహార్దం జగతికి కావాలన్నది.
    

                              సరిపడని సంగతులు
    
    "కాయకోసుకోరా" అని కత్తి చేతికిస్తే
    తలకాయ కోసుకున్నాడొక  పిచ్చి బుడంకాయ
    
    "పాలుతీసి తాగరా బాబూ!" అని అవునిస్తే
    పొదుగుకోసి నెత్తురు తాగాడొక రాకాసి ఆకతాయ

    శాంతి పావురాన్ని చేతికిచ్చి "ఎగురవేయరా" అంటే
    పలావు చేసుకున్నాడొక పనికిమాలిన బడుద్దాయ
    
    మానవసంక్షేమం కోసం అణుబాంబు చేసిఅందిస్తే
    మారణహోమం సాగించా డొక మతిలేని గడుగ్గాయ

                                      అరుణారుణ కరుణాంజలి
    
    కదనోద్ధత కర్మవీర
    వదనోద్గత రుధిరపూర
    బలి పులకిత నవభారత
    జగతీ జాగరణాంజలి
    తరుణ తరుణ బాష్పాంజలి
    
    పరిమ్లాన దీన హీన
    పరిక్లిప్త శప్త తప్త
    పరాభూత జనతా దు
    ర్భర జీవన మరణాంజలి
    అరుణ అరుణ బాష్పాంజలి
    
    సత్యాగ్రహ దీక్షాబల
    సంస్తంభిత పరప్రభుత్వ
    హత్యామయ దుష్క్రత్య
    ప్రత్యక్షీకరణాంజలి
    కరుణ కరుణ బాష్పాంజలి
    
                              మనసుకు కళ్ళెం పెట్టండి

    గులాబి బుగ్గల విలాసినీ!
    చలాకి పలుకుల సుహాసినీ!
    సుందరి! నా మది చలిస్తున్నదీ
    పందిరి మంచం పిలుస్తున్నది         ||గులాబి||

    ఇదుగో కొంచెం ఆగండీ
    ఇలాగైతే ఎలాగండీ
    కామానికి తెర వేయండీ
    ప్రేమకు తలుపులు తెరవండీ        ||ఇదుగో||

    పాపా బాబూ పడుకున్నారే
    తీపికలలు కంటున్నారే
    మంచి సమయమిది మించిందంటే
    మనసంతా ఒకటే కంగారే            ||గులాబి||

    పాపంటే మీకు ముద్దూ
    బాబంటే నాకు ముద్దూ
    ఇద్దరి కంటే వద్దండీ మన
    ముద్దుల కది సరిహద్దండీ             ||ఇదుగో||

    ఇంటి ముందు ఎల్లమ్మను చూడు
    ఇంటి ప్రక్క పుల్లమ్మను చూడు
    ఏటా ఒకరిని కంటారే
    ఎంతో కులాస గుంటారే               ||గులాబీ||

    పరిమిత సంతానం - అపరమిత
    ఆనందానికి మూలం
    అంతులేని సంతానంతో బ్రతు
    కంతా గందరగోళం                     ||ఇదుగో||

    నీ సలహా బాగున్నది కుటుంబ
    నియంత్రణం ఇక పాటిద్దాం
    ప్రణయానికి భాష్యం వ్రాద్దాం
    మన ఇల్లే స్వర్గం చేద్దాం             ||గులాబి||

    మురిపానికి చిన్న కుటుంబం
    తిరపానికి పెద్ద కుటుంబం
    అందానికి ఆనందానికి
    మితమౌ కుటుంబమే ఆలంబం     ||ఇదుగో||

    సమధిక సంతతి తప్పండీ అది
    జాతి మనుగడకు ముప్పండీ
    మనసుకు కళ్ళెం పెట్టండీ మీ
    మమతకు పట్టం గట్టండీ           ||గులాబి||

 Previous Page Next Page