ఓహో మహాంధ్ర జననీ
ఓహో! మహాంధ్ర జననీ! ఓ
హోహో! మహాంధ్ర జననీ!
సాహిత్యవనీ! సంగీత ధునీ! జో
హారు విశ్వవిజ్ఞాన వాహినీ! ||ఓహో||
చతుష్కోటి నరనారీ మండల
జనయిత్రీ! సురచిర శుభగాత్రీ!
అహీన మహిమా గ్రుహిత సుషమా
సుహాసినీ! సుందర సువాసినీ!
అమరావతి నాగార్జున కొండా
హంపీ ఏకశిలా చార్ మీనార్
నీ జడలో పుష్పాలమ్మా!
నీ ప్రమోద బాష్పాలమ్మా! ||ఓహో||
రాజరాజు భారత నిష్యందం
పోతరాజు భాగవత మరందం
గోపరాజు భద్రాద్రి నిధానం
త్యాగరాజు మధురామృత గానం
చల్లారని రుద్రమ వీరత్వం
పెల్లుబికిన మొల్లమ్మ కవిత్వం
నీ తొలివెలుగులు అలలమ్మా!
నీ కనుగొలుకుల కలలమ్మా! ||ఓహో||
శాతవాహనుల కళాన్వేషణం
చాళుక్యుల సాహితీ పోషణం
పల్లనాటి బ్రహ్మన్న ప్రాభావం
కాకతీయ సామ్రాజ్య వైభవం
కొండవీటి పౌరుష విక్రాంతులు
కృష్ణరాయ భువన విజయ కాంతులు
నీ చరిత్ర ఘట్టాలమ్మా!
నీ గౌరవజయ పట్టాలమ్మా ||ఓహో||
తెలుగు తల్లి
జయం తెలుగుతల్లీ! నవనవో
దయం తెలుగుతల్లీ! ||జయం||
శ్రీలు పొంగే పాలవేల్లీ!
కనుల విందౌ కల్పవల్లీ!
అమృతం కురుసే - ఆర్ద్రత మెరిసే-
విరజాజులు విరిసే జాబిల్లీ! ||జయం||
గోదావరి కృష్ణా పినాకినీ
తుంగభద్ర కిన్నెర మంజీరా
పరతరంగ సురచిరాన్నపూర్ణా!
సుశ్యామల సస్యామలవర్ణా! ||జయం||
'ఆంధ్రకేసరులు " ఆంధ్రరత్నములు"
"దేశభక్త" వీరేశలింగములు
"మాడపాటి" "విశ్వదాత' "సీతా
రామరాజు" నీ ముద్దుల బిడ్డలు |||జయం||
ఆంధ్రప్రాంతం రాయలసీమా
తెలంగాణ మొకటేనమ్మా!
విరులు వేరు వేరయినా కట్టిన
సరము మాత్ర మొకటేనమ్మా! ||జయం||
బాపూజీ
మా
నవాభ్యుదయ సంకేతం
నీ జన్మదినోత్సవ జయగీతం
హిమాలయ
మహా మహీధర
శిఖరాగ్రం మీది నుండి
స్వచ్చమైన అందం లాగున
చెంగు చెంగుమని లంఘించే
చల్లని నదీమతల్లుల
ఉదాత్త జీవనానికి
ఉజ్జీవనం
బాపూజీ! నీ జీవనం!
నీ నిత్యోజ్జ్వుల వదనంలో
నీ సత్యాగ్రహ కధనంలో
బుద్దదేవు కారుణ్యం వలె
శ్రద్దామయ కర్తవ్యం వలె
ప్రవహించిన
ప్రతిధ్వనించిన
ప్రశాంత జయ ఘంటాధ్వానం
ప్రపంచ నవయుగాహ్వానం!
పరాధీన భారతదేశంలో
నిరాధార నిర్భాగ్య ప్రజలకు
తరతరాల చైతన్యం
నరనరాల కెక్కించే
భవ్య భవత్తపశ్శక్తి
భారత దాస్య విముక్తి!
నీ అహింసా మకుట మణికాంతులు
ఈ మహాప్రపంచ సుఖశాంతులు!
నీ ఖాదీ
మా ఆజాదీ!
నీ ధ్యేయనిష్ఠ
జాతి స్వాతంత్య పునఃప్రతిష్ట!
నీ సత్యాగ్రహ సాధన
శాంతి దేవతా సమారాధన!
నీ కర్తవ్య మహాదీక్ష
లోకానికి శ్రీరామరక్ష!
నీ సర్వమానవ సమాన దృష్టి
సత్యాహింసల సమష్టి!
నీ బోసినవ్వులు
దేశమాత పూజకోసం
కోసి రాసిపోసిన
పువ్వులు!!
విశ్వవైతాళికుడు
స్తంభించింది అకస్మాత్తుగా
జగత్తంతా ఒక్కక్షణం!
జారింది లోకం చెక్కిళ్ళపై
గోరువెచ్చని అశ్రుకణం!
నిలబడింది నిమేషకాలం
నిర్నిమేషంగా ఓల్గానది!
కరిగి నీరై గట్లు తెంచుకొని
పొరలిపోయింది జనతా హృది!
తల వంచింది దీనంగా
మౌనంగా అరుణపతాకం!
సమర్పించింది శ్రద్దాంజలి
సమస్త ప్రజానీకం!
కలాన్నీ చుట్టుకొని ముందుకు
కదలలేకున్నది కవిత -
జాలిగా నిట్టూర్చింది
శాంతి వొడిలో మానవత-
రైతుకు పట్టం గట్టిన
"రష్యా భాగ్యవిధాత" అతడు!!
కూలికీ కిరీటం పెట్టిన
"స్టాలిన్ మహానేత" అతడు!!
పదేపదే కదలనే
కదలదా పెదవుల జంట -
పదే పదే మ్రోగనే
మ్రోగదా గుడిలో గంట -
కదలక కదలక కదిలిందో
ప్రపంచమంతా నిశ్శబ్దం!!
మ్రోగక మ్రోగక మ్రోగిందో
ముందుకు సాగుతుంది శతాబ్దం!!
అయన వెలిగించిన ఆశాజ్యోతి
అడ్డగీస్తుంది అశాంతిని;
అయన ఆలపించిన క్రాంతిగీతి
ప్రసరిస్తుంది ప్రశాంతిని
జయ జయ జయ జయప్రకాశ
వెలువడింది
విప్లవ సింహ కిశోరం
కుటిల జటిల శృంఖలాలు
పెటపెట ఫేటఫేటా త్రెంచి
కఠోర కారాగారపు
కటకటాల నడుమ నుంచి
పీడిత తాడిత జనగణ
ప్రేమమయ ప్రియ సుహృదయ!
ధనికవాద దావానల
ప్రశమన ఘనఘనాభ్యుదయ!
జయజయ జయ
జయ ప్రకాశ!
నవభారత యువ సమ్రాట్!
నవజీవన విజయ విరాట్!
ఆంధ్రకేసరి
ఆ కన్ను కోనలలో
అంధ్ర తేజోరేఖ మొలిచిందిలే!
ఆ కార్యదీక్షలో
అసమాన ధైర్యమ్ము నిలిచిందిలే!
ఆ సింహగర్జనలో
అచల కర్తవ్యమ్ము మ్రోగిందిలే!
ఆ సాహసమ్ములో
ఆత్మగౌరవగీతి తూగిందిలే!
వీరాంధ్ర కేసరీ! విజయాంధ్ర కేసరీ!
వేంచేయుమూ రాష్ట్ర విజయవేదిక పైకి
ఆంధ్రప్రజా ప్రసుప్తాంతరంగముల కొక
అమర సందేశమ్మువై!
ఆశా ప్రకాశమ్మువై!!
జయపతాక
అదిగో మన జయపతాక
అదిగో మన ప్రియపతాక
అదిగో అల్లదిగో మన
స్వాతంత్ర్య సువర్ణనౌక ||అదిగో||
ధగధగమని నిగనిగమని
ఎగురుచుండె గగనమందు
మువ్వన్నెల సొంపులతో
ముద్దులొలుకు వంపులతో ||అదిగో||
ధర్మచక్ర సముపెతం
ప్రగతికి నాందీగీతం
శాంతి పావురము రెక్కల
కాంతుల కిది సంకేతం ||అదిగో||
నవభారత యువభారత
నరనారీ ప్రియపతాక
"జైహిం" దని జేకొట్టుడు
స్వాతంత్ర్యం నిలబెట్టుడు ||అదిగో||