అరుణకిరణాలు
వందేమాతరం
జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చా ప్రియ
జనతా సంజీవనీ! ||జయము||
అరుణారుణ చరణకిరణ
కరుణా రసవాహినీ!
క్షమతాప్రియ మమతామయ
సమతా సమ్మోహినీ! ||జయము||
ధర్మవీర సమరధీర
దానశూర జనయిత్రీ!'
నిర్మల విజ్ఞాన ధాత్రీ!
కార్మిక కర్షక నవిత్రి! ||జయము||
మలయపవన చలదుపవన
కలిత లలిత హరితాంబర!
అతి సుందర దరిదంతర
ప్రతిబింబిత నీలాంబర! ||జయము||
పాటల సుమ సుకుమారీ!
కోటి కోటి నరనారీ
గళమంగళ విజయవాణీ!
లలిత కళా కళ్యాణీ! ||జయము||
చైతన్య రధం
అదిగదిగో చైతన్యరధం
కదలివచ్చే జన మనోరధం
పధ మంతా నవకాంతులు నిండుగ
భరతధాత్రి సుఖశాంతులు పండుగ ||అదిగదిగో||
విజయ కింకిణుల ఘణంఘణలతో
వీరదుందుభుల ధణంధణలతో
స్వార్ధపరులు లోలోన బెదరగా
గూండా మూకల గుండె లదరగా ||అదిగదిగో||
పెత్తందారుల ఆటలు కట్టగ
ఎత్తు పల్ల మొకటై కనుపట్టగ
క్రొత్త క్రొత్త శోభలు మినుముట్టగా
కోటి కోటి గొంతులు జయపెట్టగ ||అదిగదిగో||
పల్లవాధరలు పువ్వులు చల్లగ
ఎల్ల ప్రజలు సుఖముగ వర్ధిల్లగ
తెల్లని విద్యుత్కాంతులతో
మన పల్లెటూళ్ళు చల్లగ విలసిల్లగ ||అదిగదిగో||
జై భారత్
జయలక్ష్మిరా జగజ్జనని భారతమాత
జయపెట్టరా నీదు జన్మభూమికి నేడు
మ్రోగింపరా దిగంతములు నీ జయభేరి
సాగింపరా ప్రజాస్వాతంత్ర్య రధము నిక
ఊదరా జయశంఖ ముడుకురక్తము పొంగ
బాదరా దుస్స్వార్ధపరుల గుండెలు క్రుంగ
వెలిగింపరా ధర్మవీర విజయజ్యోతి
తొలిగింపరా ధూర్తా దుశ్శాసనుల భీతి
స్థాపింపరా నీ స్వరాజ్యదీక్షా ధ్వజము
ప్రాపింపరా నవ్యభారత మహోదయము
నిండింపరా నీ అఖండ సంస్కృతి జగతి
పండింపరా ప్రజలగుండెలందున ప్రగతి
సమైక్య భారతి
అందరమును నీ బిడ్డలమమ్మా! భారత సవిత్రి!
అందుకొనుము వందనములు సుందర సురచిత సుగాత్రి!
అందరి కొకటే న్యాయం అందరి కొకటే ధ్యేయం
సహజీవన సమైక్యతయే సమస్త విశ్వశ్రేయం ||అందర||
పదములు పలు విధములైన పాట ఒక్క టెనమ్మా
ప్రయాణీకు లెందరైన బాట ఒక్కటేనమ్మా ||అందర||
మా కభిమతమగు మతమ్ము మానవత్వ మొక్కటియే
మాకు బలమునిచ్చు కులము ఐక్యమత్య మొక్కటియే ||అందర||
పూవులు రకరకాలైన హారము ఒకటేనమ్మా
దివ్వెలు పదివేలైనా దేవళ మొకటేనమ్మా ||అందర||
నవతను పూజిస్తాం మానవతకు స్వాగత మిస్తాం
సమతా ప్రియమమతామయసమాజమును స్థాపిస్తాం ||అందర||
జయజయరావమ్ములతో సాగెను నీ జైత్రరధం
ప్రసరించెను జయక్రీల వసుదైక కుటుంబ పధం ||అందర||
స్వతంత్ర భారతి
స్వతంత్రభారతి! స్వరాజ్యభారతి !
సమైక్యభారతి! నమోస్తు తే
సువర్ణ భారతి! సుపర్వభారతి!
సురచిర భారతి! జయోస్తు తే ||స్వతంత్ర||
గంగా యమునా బ్రహ్మపుత్రా
గౌతమీ కృష్ణా పినాకినీ
తుంగభద్రా కావేరీ తరంగ
మంగళమయ సంగీత రసజ్నీ ||స్వతంత్ర||
ప్రాచేతన కృష్ణద్వైపాయన
భాస కాళిదాస బాణ భారవి
తులసీ నన్నయ పంప కంబ రవి
తుకారామ కవితా కళాన్వితే ||స్వతంత్ర||
మహా గుహాంతర తపోనిరంతర
మౌనిరాజి తేజో విరాజితే
సత్యవిభాసిని నిత్య సువాసిని
విజయోల్లాసిని విశ్వపూజితే ||స్వతంత్ర||