Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 55

 

                           పెద్దల మాట - పిన్నల బాట
    
    స్వతంత్ర భారత వీరనారి మన
    ఝాన్సీరాణీ ఏమంది? మన ఝాన్సీ రాణీ ఏమంది?
        పరాయి రాజుల పారద్రోలి మన
        స్వరాజ్యమును నిలపాలంది.

    కాకలు దీరిన దేశనాయకుడు
    లోకమాన్యు డేమన్నాడు? మన లోకమాన్యుడేమన్నాడు?
        సంపూర్ణంబగు స్వాతంత్ర్యమె మన
        జన్మహక్కు లేమ్మన్నాడు.

    భారత భాగ్యవిధాతయైన మన
    బాపూజీ ఏమన్నాడు? మన బాపూజీ ఏమన్నాడు?
        శాంతి అహింసా సత్యాగ్రహములె
        జాతి అయుదాలన్నాడు.

    జాతికి నవజీవం పోసిన మన
    నేతాజీ ఏమన్నాడు? మన నేతాజీ ఏమన్నాడు?
        జయం జయం మన భారతమాతకు
        జైహింద్ జైహింద్ అన్నాడు.

    స్వతంత్ర భారత రధసారధి మన
    జవహర్లాల్ ఏమన్నాడు? మన జవహార్ లాల్ ఏమన్నాడు?
        అన్ని మతాలూ అన్ని కులాలూ
        అందర మొకటే నన్నాడు.

    ప్రతిభావారిది ఉక్కుమనిషి మన
    భాయి పటేలేమన్నాడు? వలభాయి పటే లేమన్నాడు?
        స్వతంత్ర భారత విజయ పతాకం
        సమైక్యరాష్ట్రమే అన్నాడు.
    
    చెంగున దుమికిన త్రిలింగ కేసరి
    టంగుటూరి ఏమన్నాడు? మన టంగుటూరి ఏమన్నాడు?
        నిండు గుండెతో విదేశీగూండా
        దండు నేదుర్కోమన్నాడు.

    రణభీముడు అల్లూరి సీతా
    రామరాజు ఏమన్నాడు? మన రామరాజు ఏమన్నాడు?
        ముష్కరులను గురిపెట్టి కొట్టి మును        
        ముందుకు దూకండన్నాడు.
    
    అందరికీ ప్రియదర్శిని యగు మన
    ఇందిరాగాంధీ ఏమంది? మన ఇందిరాగాంధీ ఏమంది?
        వెనుకబడిన బలహీన సోదదుల
        వెన్నుదట్టి ఒదార్చాలంది.
    
    సమైక్య భారత జీవనాడి రా
    జీవగాంధి ఏమన్నాడు? మన రాజీవగాంధి ఏమన్నాడు?
        నవయుగ నరనారీమణులంతా
        నడుంగట్టి నడవండన్నాడు.

                                 పొట్టిబాబు

    చిన్న మఱ్ఱిగింజ మన్నులోబడి మహా
    వృక్షమగుచు విస్తరించినట్లు
    పొట్టిబాబు మేను మట్టిలో లీనమై
    "ఆంధ్రరాష్ట్ర' మగుచు నవతరించే;

    "శ్రీరాముల" దయచేతను
    ఆరూడిగా ఆంధ్రరాష్ట్ర మబ్బెను మనకున్;
    ధారాళమైన రీతుల
    ఆరాధింపంగవలదె ఆ మహానీయున్.

    తమిళులకు చెన్నపురమును ధారపోసి
    కన్నడులకును బళ్ళారి కాస్కపెట్టి
    ఉత్కలులకు బరంపురం బోసగినారు
    తెలివితేటలు గలవారు తెలుగువారు

    
                                    కైమోడ్పు
    
    జోహారు, సజ్జనోత్సాహ! నందీశ్వర
         వాహ! కారుణ్య ప్రవాహ! నీకు
    దండంబు , శైలకోదండ! భూషిత చంద్ర
          ఖండ! భక్తాబ్జమార్తాండ! నీకు
    కైమోడ్పు, కైలాసధామ! భస్మీకృత
          కామ! దైతెయ విరామ! నీకు
    జోత, త్రిలోకాధినేత! కైవల్యప్ర
           దాత! ఆమ్నాయ విఖ్యాత! నీకు

    వందనము, మృగయాపురీవాస! నీకు
    శరణు శరణు , భుజంగమాభరణ! నీకు
    నతులు, శ్రీ పార్వతీ ప్రాణనాధ! నీకు
    మంగళమ్ములు, శ్రీ శంభులింగ! నీకు.

                                      మొదటి రాత్రి
    
    అది మొదటి రాత్రి, కడు తీయనైన రాత్రి;
    హృదయములు రెండు ఒకటిగా కదియు రాత్రి;
    పట్టే మంచమ్ముపై పూలపాన్పు మీద
    శోభన వధూవరులు కూరుచున్న రాత్రి.

    నిద్దపు నీలిముంగురుల నిగ్గులు, తీయని దొరసిగ్గులున్;
    ముద్దులు మూటగట్టు నగుమోమున దాగుడుమూతలాడు వా
    రిద్దరి ఈడుజోడు తిలకించి, మదిన్ పులకించి, చక్కటుల్
    దిద్దుచు వీడిపోవరు గదిన్ మదిరాక్షు లదేమి తీపియో!

    దంపతి తాంబూలంబులు,
    చెంపలు దువ్వుటలు, పూలచెండ్లాటలు, క
    వ్వింపులు, నెచ్చెలుల హెచ్చరింపు లవెన్నో!!

    వధువు తల్లి వచ్చి గదిలోని మగువుల
    గుంపు నెల్ల బైట కంపివైచి,
    పిల్లపైట సర్ది, అల్లుని క్రీగంట
    గాంచి తలపులను బిగించి చనియె-

    వరుడు:

      నిలబడు టెందుకో అనుగునెచ్చెలి! తీయని పల్కు పల్కవే
      చిలుకలకొల్కి! అందములు చిందేడి వాల్గనులెత్తి చూడవే
      నళినదళాయతాక్షీ! చిరునవ్వుల పువ్వు లనుగ్రహింపవే
      వలపుల కల్పవల్లి! తల వంచెద వెందులకే తలోదరీ!

    చూచెద వోరగా సుగుణసుందరీ! కాటుక కళ్ళలోని ఆ
    లోచనలేమి వారిరుహలోచన? నీ నునుసిగ్గులోని సం
    కోచము లెందుకో కుసుమకోమలి! నీ చిగురాకు మోవిలో
    దాచుకోనంగ నేటికి సుధాలహరుల్? రమణీ శిరోమణీ!
    
    వదలి పోయిరి; గడే వేసి వచ్చినాను;
    ఎవరు లేరిట; నేను నీవే లతాంగి!
    గోడపయి గడియారము చూడు మదిగో!
    రెండు ముండ్లేకమయ్యే! పన్నెండు కొట్టె.

         వధువు :

    బావ! మృదుస్వభావ! రసభావసుధామధురార్ద్రభావ! నే
    మీ వచనాలు వింటి; ఇక మేనమరందలి చిన్ని ప్రార్ధనన్
    దేవరవారు ముం దనుమతింపవలేన్; మన భావిజీవిత
    శ్రీ విలసిల్లగావలె అశేషజనాళికి మార్గదర్శియై.
    
        వరుడు :

    చదువుకొన్నావు నీవు భాషా ప్రవీణ;
    ఫస్టు క్లాసు "బియ్యే పట్టభద్ర' వీవు;
    నన్ను కొన్నావు పెద్ద కట్నమ్ము పోసి;
    పడతి! సిగ్గేల? తెలుపు నీ భావమేమొ!

       వధువు:
    అరవపుత్రినై జననమైతి; హరించెను భూము లన్నియున్
    హారతి కప్పురమ్ములయి అక్కల పెండ్లికి; ఏడువేలు శ్రీ
    వారికీ కట్నమీవలసివచ్చుట కొంపయుపోయె; వేడి క
    నీరది యొక్కటే మిగిలె నేటికి అమ్మకు నాన్నగారికిన్.
    
    పెంచిరి పువ్వులందునుచి; పెద్ద యోనర్చిరి; విద్యలన్నీ చె
    ప్పించిరి; వేలువేలు గురిపించిరి పిల్లల పెండ్లి కోసమై;
    వంచితులైరి వారు; తలవంచిరి దుర్విధికిన్; దరిద్రతా
    చంచలచిత్తులైరి; బహుసంతతి యెంత అనర్ధకారియో!

      వరుడు:
    పిల్లల చదువుకై యిళ్ళు వాకిళ్ళమ్మి
        వీధి కెక్కెను జగన్నాధరావు;
    నలుగు రల్లుండ్ర కట్నాలకై కొన్న నా
        ల్గెకరాలు తెగనమ్మే ఈశ్వరయ్య;
    మగబిడ్డ మోజుతో మరి మూడు జతల ఆ
        మ్మాయిల గనే ఆ రమాకుమారి;
    గంపెడు బిడ్డల కడుపు కక్కుర్తికై
        చిట్టిపంతులు ముష్టిచెంబు పట్టే;

    ఈ కుచేల సంతానంబు నీదజాల
    నంచు సాంబయ్య సన్నాసులందు గలిసె;
    మురిపెముగ బహుసంతానమును సృజింప
    తిరిపెమున కేమి కొదువ ఈ దేశమందు!

        వధువు:
    అమ్మ గదిలోపలికి పంపునపుడు తన వి
    షాద దుస్థితి నాకు రారాదటంచు
    హెచ్చరించి దీవించి పంపించె నన్ను;
    దంపతుల మామె మాట మన్నింపవలయు.

        వరుడు :
    తరుణీ! పరిమితంబైన సంతాన మెపుడు
    అపరిమితమైన సుఖముల కస్పదంబు;
    అపరిమితమైన సంతాన మది అపార
    కష్టనష్టమ్ములకు మూలకారణంబు
    
    ఒక్కరో! ఇద్దరో! అంత కేక్కుడైన
    శిశువులను గాంచి ద్రోహమ్ము చేయమంచు
    హృదయములు రెండు గట్టిగా అదిమిపట్టి
    ప్రతిన పట్టిరి వారు శోభనపు రాత్రి.

       వధువు:
    ముద్దు మరదలి ప్రార్ధనమ్మును గ్రహించి
    ప్రతిన పట్టు బావకు నమస్కృతి శతంబు!

         వరుడు :
    సమయమునకు మహోపదేశము నొసంగు
    చిన్ని మరదలుపిల్ల కాశీశ్శతంబు!!

 Previous Page Next Page