Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 54

 

                                        సినారె


    అయన హృదయం "నాగార్జునసాగరం"
    అయన యశస్సు "కర్పూర వసంతరాయలు"
    అయన నీడ "వెన్నెలవాడ"
    అయన కవితాకుమారి 'అజంతా సుందరి"
    అయన నివాసం 'మధ్య తరగతి మందహాసం"
    అయన ఆవేదన "మంటలు మానవుడు"
    అయన భావాలు "అక్షరాల గవాక్షాలు"
    అయన కలం "బంగారు కడ్డి"
    అయన పేరు "నారాయణరెడ్డి"

    ఆ పెదవి మెదిపితే ఆణిముత్తేపు జల్లు
    ఆ కలము కదిపితే అందాల హరివిల్లు
    అతని తీయనివాణి అది నిత్య కల్యాణి
    అతడు నిల్చిన క్షోణి అమృతలహరి "త్రివేణి"
    అభ్యుదయ భావాల కాత డొక సేమినారే
    బుధ లరసినారె! ఆ మధుర సుకవి "సినారె!!"

    పారిజాతాలు కుప్పలు పోసినారే
    నవరసోజ్జ్వల రచనలు చేసినారే
     తెలుగు సంస్కృతీకి తల్పులు తీసినారె
    వెలుగుకు పూలబాటలు వేసినారె
    మనసు కవి సినారె!
    మన సుకవి సినారె!!
    
    సార్వత్రిక విద్యాక్షేత్ర మున్నది ఆవల
    సారస్వత కళాక్షేత్ర మున్నది ఈవల
    విజ్ఞానపు విత్తనాలు ఇరుక్రేవల
    వెదజల్లు సాహిత్య కృషీవల!!

                            మనము మెచ్చిన చిత్రకారుడు

    బాపూ! నీ బొమ్మలు
          తలలూపు గులాబీ కొమ్మలు;
    బాపూ! నీ రేఖలు
          మునిమాపు శకుంతల లేఖలు;
    బాపూ! నీ లేఖిని
           దరిదాపు సుధారసవాహిని;
    బాపూ! నీ భావము
           వగబాపు కళకు నవజీవము.

    
                                        తెలుగు వెలుగుల ఉగాది
    
    ఆంధ్రు లిద్దరు కలిసినప్పుడు తీయని
    తెనుగులో మాటాడుకోనిన "తీపి ఉగాది"
    
    నతుల వెన్నాడు ముష్కర కీచకుల తలల్
    చితుక గొట్టినవాడె బ్రతుకు తెరువు ఉగాది
    
    కులమత వర్గాల కుళ్లు వీద్వడి జాతి
    పరిమళించిన వాడె భవ్యమైన ఉగాది

    కౌరవుల్ పాండవుల్ కక్షలు విడనాడి
    కలిసి పాలించుటే కలుపుగోలు ఉగాది
    
    మానవతకు పెద్ద మచ్చ అస్పృశ్యత
    అంత మగునాడే ప్రశాంతమైన ఉగాది
    
    రాకాసి కోరల రాబందు ముక్కలు
    చెక్కివేసిననాడే చక్కనైన ఉగాది  

    దొంగనక్కల దొంగ తోడేళ్ళ తోకలు
    కత్తిరించిననాడే క్రొత్త క్రొత్త ఉగాది

    బడిలోన, కన్నమ్మ ఒడిలోన, గుడిలోన
    మడిలోన, అనందపడిన పసిడి ఉగాది
    
    "మాది మే" మను స్వార్ధ భేదబుద్ది తొలంగి
    "మనది మన" మను బుద్ది గనిన మేలి ఉగాది

    నగ్న నాట్యాల సందర్శనార్ధము ప్రజల్
    పరువు లిడకున్న మన పరువు నిలుపు ఉగాది
    
    తొలుత చదివిన కవుల్ దులుపుకొని పోకుండ
    తుదిదాక కూర్చుండుటది గౌరవ ఉగాది
    
    నిరుపేద వేడికన్నీరు పన్నీరుగా
    మర్పగల్గిన లోకమాన్యమైన ఉగాది

    పూరిండ్లు సౌధాల పొరుగున తలయెత్తి
    నిలుచున్న అనాడే నిక్కమైన ఉగాది
    
    రామరాజ్యము ప్రజాక్షేమ రాజ్యమ్ముగా
    నిలువగల్గిననాడే విలువగల్గు ఉగాది
    
    విద్వాంసులన్ గౌరవించి కళాలక్ష్మి
    నాట్యమాడిన నాడే సవ్యమైన ఉగాది
    
    కోటీశ్వరులు కోటగుమ్మాలు తెరచి క్షు
    ధార్తుల వ్యధమాన్ప నదియె మేటి ఉగాది

    భావిపౌరులు బాలబాలిక లేకమై
    ముందు కడుగిడునాడే ముద్దు లొలుకు ఉగాది

    ఐకమత్యముతోడ లోకమంతా కలిసి
    ఏకకుటుంబమౌటే కమ్మని ఉగాది
    
    మానవత్వము రూపుమాపు పాకీవృత్తి
    అంతమగునాడే ప్రశాంతమైన ఉగాది
    
    అన్ని జాతులవారు అన్నదమ్ముల మంచు
    నడుచుటే ముందునకు "నవయుగాది ఉగాది"

    ఒళ్లు మైకము వదలి ఫైళ్ళు ముందుకు కదలి
    ముళ్ళు విప్పిన అదే ముచ్చటైన ఉగాది
    
    నవరసాలమూలపై కవికోకిలలు రాగ
    మాలపనము సేయ అది వసంత ఉగాది
    
    సత్యంబు శాంత్యహింసల గూడి నిలువెల్ల
    పల్లవించిన అదే మల్లెపూల ఉగాది
    
    ఆరుకోట్ల తెలుంగు లన్నదమ్ముల మంచు
    ముందడుగు వేయుటయే అందమైన ఉగాది
    
    అదియె తెలుగు ఉగాది అదియె వెలుగు ఉగాది
    అచ్చమైన ఉగాది మచ్చలేని ఉగాది.

            
                                   రాయలసీమ

    రాణా ప్రతాప శౌర్యస్ఫూర్తి గీర్తించు
        కవిరాజశేఖరు గంటమునకు

    ధ్వనులీన శివభారతమున గంటలు గొట్టు
        అల మహాకవి గడియారమునకు
    
    శతవధాన కవిత్వ సౌభాగ్యమూర్తులై
        పొల్చు సరస్వతీ పుత్రుకులకు
    
    సరస సాహిత్య సంపత్తుల మార్మోగు
        భారతీ మంజు మంజీరములకు

    స్థానమై, సంపదకు సన్నిధానమై, "ప్ర
    ధానమై, సాహితికి పెన్నిధానమయ్యె;
    కడప మండలలక్ష్మి వక్షస్స్థలాన
    ముద్దులొలుకు కాసులపేరు! ప్రొద్దుటూరు!

    ప్రొద్దుటూరు గనంగ నేప్రొద్దు "ప్రొద్దు
    పోడిచినట్లుండు" నవనవాభ్యుదయ మగుచు;
    చెలువు మీరెడి సరసుల చెల్మి, హసిత
    లసిత విక్రసిత ముఖకమలముల కల్మి
    
    అల్ల శ్రీదేవి గజ్జెలు ఘల్లు మనగ
    కాలు మోపిన బంగారు గడప కడప!
    నిత్యకల్యాణి యగు వాణి నిదుర లెవ
    సడలి చెదరిన పువ్వుల పడక కడప!

    ఆ యెడ అష్ట'దిగ్గజ మహాకవిచంద్రుల భాగ్యసీమయౌ
    రాయలసీమ నిండ కవిరత్నములే! మరి వారి లోపలన్
    నాయక రత్నముల్ కనుగొనన్ "జనమంచి" 'అనంత కృష్ణ" "నా
    రాయణ" "కట్టమంచి" "గడియారము" "వావిలి " "రాజశేఖరుల్."

 Previous Page Next Page