Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 55


    అని పలుకుచున్న మహామంత్రి యాలోచనమున కెంతయు సంతసించి మనుమసిద్ది "అమాత్యశేఖరా! అందులకుఁ దగినవా రెవ్వరో మీరే నిర్ణయింపు" డనివచించెను. సహాయమంత్రియగు "అన్నంభట్టు' రాయభారము గోనిపోవుటకు యోగ్యుఁడని యందరు నేకకంఠముగాఁ బలికిరి.
    అన్నంభట్టు రాయభారము ఖడ్గతిక్కన కేమాత్రము నచ్చలేదు. ఖడ్గమునకు దప్ప కాటమరాజు రాయబారములకు లొంగఁడని యతని నమ్మకము. మదోన్మత్తులై రాజద్రోహముగావించిన కనిగిరి యాదవులపైఁగసి తీర్చుకొనుట యేప్పుడాయని యాతఁడు తొందరపడసాగెను. అయినను సంధి ప్రయత్నములను గాదనలేక కోపమునంతయును దిగమ్రింగి సమయమునకై యెదురు చూచుచుండెను.
    

                                                 4

    మరునాడు కొంతపరివారమును వెంట బెట్టుకొని యన్నంభట్టు రాయవారియై యెర్రగడ్డపాడునకుఁపోయెను. సింహపురినుండి మనుమసిద్ది రాయబారి వచ్చినాఁడని ద్వారపాలకులు కాటమరాజున కేరింగించిరి. "పుల్లరిడబ్బుల కొరకే యీ రాయబార" మనుకొనుచు రాయబారిని లోనికి గొనిరండని కాటమరాజాజ్ఞాపించెను.
    అన్నంభట్టు సభామందిరమును బ్రవేశించెను. కాని రాయబారికి జరుగవలసిన సముచిత సత్కారములేమియు నాయనకు జరుగలేదు. సభలోనివారందరూ నన్నంభట్టును వెక్కిరించుచు వేళాకొళములు చేయసాగిరి. యాదవ సేనానాయకులు కన్ను లెర్రచేసి యయనవైపు చురచుర చూచుచుండిరి. కాటమరాజు నిర్లక్ష్యంగా నన్నంభట్టును వీక్షించుచునొక సామాన్యపీఠముపైఁ గూర్చుండ నియోగించి రాయభారమేమో వినపింపుమని పలికెను.
    అన్నంభట్టు పీఠముపై నాసీనుఁడై గంభీరస్వరముతో నిట్లు ప్రారంభించెను. "కాటమరాజా! మీయదవులు గోవుల మేఁతకై కొన్ని పచ్చిక బీళ్లను మాయోద్ద గుత్తకు తీసికొన్నారు. అందుకీయవలసిన పుల్లరి క్రింద పదివందల బంగారు నాణేముల నిచ్చుటకై యోప్పందము జరిగినది. పై విషయములు మీకు తెలిసియెయుండవచ్చును. సంవత్సరముపొడుగునను పశువులను మేఁపుకొని మీవారు మా కీయవలసిన ధనము నీయకుండ దొంగతనముగా పశువులను దొలుకొని వచ్చిరి. ఇది ద్రోహము ; అధర్మము . మీవారు చేసిన యాకార్యమునకు మా మహారాజు మిక్కిలి కోపించి యున్నాఁడు. నెల్లూరి పురవాసులందఱు మీ కృత్యముల నేవగించుకోనుచున్నారు. కనుక మీరు మీవారుచేసిన తప్పిదమును విచారించి మాకు న్యాయముగా రావలసిన ధనమును వెంటనే చెల్లింపవలయునని యడుగవచ్చినాను. ఇప్పటికైనను మిగిలిపోయినది లేదు ముందు వెనుక లాలోచించుకొని మీ యుద్దేశ్యము వెల్లడింపుండు."
    అన్నంభట్టు వాక్యములు వినుచున్న కోలఁది కాటమరాజు ముఖమండలము జేవురించెను. కోపముచే నాతని పెదవి కంపింపజొచ్చెను. పండ్లు పటపట కొరుకుచు "భట్టూ! మంచి రాయభారము తెచ్చితివి. పుల్లరియేమి? ఇచ్చుటయేమి? అసలు మీ మేఁత మా యావులకు సరిపడలేదు. రోగములచే మా యావులెన్నో మరణించినవి. మాకు సంభవించిన నష్టమునకు మీ కీయవలసిన పుల్లరికిని జెల్లుపోయినది. కనుక నీయవలసినది లేదు; పుచ్చు'కొనవలసినది లేదు. ఈ మాటలు మీ రాజునకుఁ దెల్పుము. మీ సేనానాయకుల పేరు చెప్పి మమ్ము భయపెట్టఁజూచుచున్నావు. కాఁబోలు. మీ మాత్రము మగంటిమి మాకును గలదు. ఇంక మారు మాటాడక వచ్చిన త్రోవను బట్టి పొమ్మని తిరస్కరించి పలికెను.
    అన్నంభట్టు చేయునది లేక మరియొకమాటు మంచి మాటలతోఁ బ్రయత్నింపఁ జూచెను గాని యాదవసేనానులు కత్తులు దూసి మీది కురక వచ్చిరి. ఇఁక లాభము లేదనుకొని "మంచిది ! కాతమరాజా'
! పుణ్యమునకుఁ బోవ పాపమేదురుగా వచ్చినది. నేను బోవుచున్నాను. అన్యాయమునకు ఫల మనుభవింపగలఁరని పలికి యన్నంభట్టు కాతమరాజును వీడ్కొని సింహపురమునకుఁ దిరిగివచ్చెను.
    రాయభారము విఫలమైనదని తెలియుటతోనే తిక్కనామాత్యుఁడు మిక్కిలి చింతించెను. మనుమసిద్ది మహారాజు చేయునది లేక సైన్యములను సంసిద్దము సేయచమూపతుల కాజ్ఞాపించెను. ఇఁక నెల్లూరు సేనానాయకులు మహోత్సములతోఁ దమ ఖడ్గములకుఁ బదును పెట్టుచుండిరి. ఖడ్గ తిక్కన యుద్దమున యాదవబలముపైఁ బడి పటాపంచలు గావించుటకై క్షణములు లెక్కపెట్టుకొనుచుండెను.
    యుద్దము నిశ్చితమైనది. ఉభయ సైన్యములును దమతమ సేనానాయకులతోఁ గలిసి సంసిద్దము లగుచుండెను. మనుమసిద్ది మహీపాలునకు సహాయముగా తిరునామాల తిప్పరాజు, శ్రీకంఠరాజు, పెదవరదరాజు, ఆర్లు'కొండ , అచ్చిరాజు, గయికొండ గంగరాజు, పట్టుకొట బసవరాజు, కాళహస్తి పాపతిమ్మరాజు, దేవముని వెంగళయ్య, ఉదయాద్రి ఉమ్మయ్య మొదలగు యోదాగ్రేసరు లందరు వచ్చిరి. అట్లువచ్చిన మహాసైన్యమున కంతకును "పగవారి గుండెలు బ్రద్దలుచేయు" ఖడ్గతిక్కన సర్వసేనానాయకుఁడయ్యేను. సేనాముఖమున నశ్వారూధుఁడై నిలిచియున్న రణతిక్కన భారతవీరులగు ద్రోణాచార్యుని , నశ్వతార్దమను దలంపునకుఁ దెచ్చుచుండెను.
    విక్రమసింహపుర వీరసైన్యములు యుద్దమునకు సిద్దమైవచ్చున్నవను వార్త వినుటతోడనే కనిగిరి సైన్యములను వెంటనిడికొని కాటమరాజు కదనరంగమునకుఁ గదలివచ్చెను. యాదవుల పక్షమున యుద్దము సేయుటకై పలనాటి పద్మనాయఁడును, పల్లికొండ చల్లపిన్నను నాయఁడును, పాచయ్య నాయఁడును, ముమ్మయ్యనాయఁడును, నచకూళ్ళనాయఁడును, కరియావుల రాజును, భట్టవుల రాజును, దొనకొండ అయితమరాజును, ఉత్తమరాజును మొదలగు వీరాగ్రేసరులందరును సమరరంగమునకు వెడలిరి. ఈ సైన్యమున కంతటికి పిన్నమనాయని మంత్రియు నారాద్య బ్రాహ్మణుడునగు బ్రహ్మరుద్రయ్య నాయకత్వము వహించెను. బ్రహ్మరుద్రయ్య ఖడ్గతిక్కనకు సర్వ విధముల సమానమైన జోడు.
    పాలేటి యొడ్డున నున్న పంచలింగాలకొండ యెద్ద నుభయ సైన్యములకు యుద్దరంగము నీర్ణితమైనది. ఎవరి మట్టుకు వారు తమకే జయము లభింపఁగలదను దృడనిశ్చయంతో నుండిరి. ఖడ్గతిక్కన మాత్రము శత్రు సైన్యమును లక్ష్య పెట్టక నేనొక్కడనే పోయి యాదవులను జయించి రాఁగలనని పలికి కోలఁది సైన్యము మాత్రము వెంటఁబెట్టుకొని మనుమసిద్దినృపాలుని యాజ్ఞవడసి యుద్దరంగమునకు బయలుదేరేను.
    "విజయలక్ష్మి సమేతుఁడవై తిరిగి రమ్మని తండ్రి సిద్దనామత్యుఁడు కుమారు నాశీర్వ]దించెను. "నన్ను వీరమాతను చేయుదువు గాక" యని తల్లి ప్రోలమాంబిక దీవించెను. భార్య చానమ్మ భర్తకు కవచము దొడిగి ఖడ్గమునందించి నొసట తిలకమును బెట్టి సాగనంపెను. పురము నందలి ముత్తయిదువులందరు సౌదాగ్రములనుండి పుష్పవర్షము గురియించిరి. ఖడ్గతిక్కన తన పంచకల్యాణి గుఱ్ఱముపై నెక్కి నిజ సేనాసమేతుఁడై ప్రళయకాలభైరవుని భంగి రణరంగమున కురికెను.

 Previous Page Next Page