వారాహీ! వరదాయినీ! సురనుతా! వైడూర్య భూషాంచితా!
శ్రీ విద్యా! విజయా! జయా! గిరిసుతా! క్షేమంకరీ! శాంకరీ!
హేమాభా! ప్రియదర్శనా! సునయనా! కామేశ్వరీ! భైరవీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
కల్యాణెైక పరంపరా! సుమధరా! కాళీ! భవానీ! "పరా!"
పశ్యంతీ! ప్రియవైఖరీ! శశికళా! శ్రీ మంజులా! మాధ్యమా!
కామాక్షి! కరుణాకటాక్ష లహరీ! కాత్యాయనీ! భారతీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
కొమారీ! "భువనేశ్వారీ!' శుభకరీ! సర్వార్ధ సంపత్కరీ!
పంచక్రోశ పరీతపూత విజయశ్రీ వాటికాదీశ్వరీ!
రంగస్మంగళ కృష్ణవేణీ తటినీతీరే సదా సంస్థితా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
విజయాభి రామము
ఆలింపుము బీదల మొర;
లాలింపుము కష్టజీవులన్; ధర్మముగా
పాలింపుము; కూళల సా
తాళింపుము గుణలలామ! తారకరామా!
శిక్షింపుము మారీచులు;
రక్షింపుము ప్రజల ; రామరాజ్యశ్రీకై
వీక్షింపుము; దొరవై ఆ
ధ్యక్షింపుము హృదయసీమ, తారకరామా!
గర్జింపుము సింహము వలె;
నిర్జింపుము దుర్జనులను; నిశ్చల విజయ
మ్మర్జింపుము; వెలిగింపుము
దర్జాగా తెలుగుసీమ, తారకరామా!
సృజియింపుము నవశకమును;
భజియింపుము వేంకటేశ పదపద్మములన్;
యజియింపుము శాంత్యర్ధము;
త్యజియింపుము స్వార్ధపరుల, తారకరామా!
ఖండింపుము మత మౌడ్యము;
పండింపుము తెలుగుతల్లి భాగ్యము; దెసలన్
నిండింపుము సుఖశాంతులు ;
దండింపుము డుండగీంద్ర, తారకరామా!
అందింపుము అభ్యుదయము;
చిందింపుము వెలుగు; ప్రజల చిత్తములోనన్'
స్పందింపుము; రిపుగణ మ
ధ్యందిన మార్తాండధామ! తారకరామా!
తెలిగింపుము సంస్కృతమును;
వెలిగింపుము భారతమున విజయశ్రీలన్;
కలిగింపుము సమ్మోదము;
దళితజన సుఖైకకామ! తారకరామా!
రాముడవై సజ్జనులకు;
భీముడవై దుర్జనులకు , పృద్వివికి శ్రేయః
కాముడవై , తులసీదళ
దాముడవై పరిమళించు తారకరామా!
అభినవ శ్రీకృష్ణుండటే!
అభినవ శ్రీరాము డటవె! అభినవ రాయ
ప్రభుడటే! అయన పాలన
అభయంబటే! ఆరుకోట్ల ఆంధ్రావళికిన్!!
ఆ కందము ద్వారమునకు
స్త్రీ కందము కట్టు బొట్టు క్షమయున్;
మా కందము మీ కందము;
మాకందము వోలె చైత్రమాసమ్మునకున్.
శ్రీనాధసుకవి
ఆజాను దీర్ఘ బాహాదండములు వోని
సమ సమర్ధ సమాన సౌష్టవంబు
అమరేంద్ర గందేభగమన సన్నిభమైన
ధీరగంభీర సంస్కారశైలి
సంపుల్ల కమలలోచన దీధితుల లీల
సరసభావార్ధ ప్రసారరీతి
మిసిమి బంగారు కాశ్మీర శాలువ మాడ్కి
ప్రసరించు శబ్ద సౌభాగ్య గరిమ
నిక్కముగ నిన్ను బోలిన నీదు కవిత
నిండు గౌరవ మందే మన్నీల సభల
సాహితీ క్షేత్ర మందు నీ సాటి నీవె
సకల గుణసాంద్ర! శ్రీనాధ సుకవి చంద్ర!
పుట్టిన భారతదేశం మట్టికి గౌరవము తెండి
బుజములలో జిగి తగ్గెను; ప్రొద్దు పడమటకు మ్రోగ్గెను;
వృద్దులమే, ఐనా - కటిబద్దులమే త్యాగానికి,
వృద్దులమే కాకుంటే క్రుద్దులమై సంగర స
న్నద్దులమై ప్రళయకాల రుద్రుల మయ్యేవాళ్ళం!!
అందలేని నిరుపేదల కండలు కొరికే రక్కసి
గూండా మూకలపై పిడుగులు కురిపించే వాళ్ళం!!
అభ్యుదయం మార్గంలో అడుగడుగున అడ్డుతగులు
మ్రుక్కుడి తోడేళ్ళ తలలు ప్రక్కలు చేసేవాళ్ళం!!
నేటి క్లిష్టసమయంలో నెత్తిమీద నుండే ముప్పు!
గ్రుడ్లు మిటకరించి యిపుడు కూర్చుండుట పెద్ద తప్పు!
కోరమీసములు త్రిప్పే కోడె వయసులో విన్నది
నాడు నేర్చుకొన్నది ఈనాడు గుర్తు వస్తున్నది
"చెడ్డ ఎచట కనపడ్డా నడ్డి విరుగగొట్టం" దని
"స్వార్ధపరాయణుల దురాశకు గోరి కట్టం" డని
నాడు నేర్చుకొన్నది ఈనాడు గుర్తువస్తున్నది.
"చెడ్డ ఎచట కనపడ్డా నడ్డి విరుగగోట్టం "డని
"స్వార్ధపరాయణుల దురాశకు గోరి కట్టం "డని
నాడు నేర్చుకొన్నది ఈనాడు గుర్తు వస్తున్నది.
సత్యాహింసలపై ఆసక్తి చప్పబడిపోయెను
గాంధీ మార్గంపై ఆకాంక్ష సన్నగిల్లిపోయెను
గాంధీ శిష్యులొకరినొకరు కన్నులురిమి చూస్తుంటే
జుట్టూ జుట్టూ పట్టుక కొట్టాడుక చస్తుంటే
అట్టడుగున పడి గిలగిల కొట్టుకునే నిరుపేదకు
గౌరవ మేటులుండును? మరి కాలే కడుపెటు నిండును?
ఈ క్లిష్టపరిస్తితిలో ఇపుడేమిటి చెయ్యటం
మతిమాలిన అవినీతులమంచిది విడిచేయ్యటం
శాంతి పాఠములు నములుచు సకిలించే చింబోతుల
చంచలించు ఈ కోతుల మంచిది విడిచేయ్యటం
నవయుగ సంగ్రామానికి నవయుగ సంక్షేమానికి
నవ చైతన్యానికి మానవయుగ నిర్మాణానికి
అవతరించవలె మళ్ళీ నవనాయకు డేవ్వడెని
జగతికనులు జిగేల్ మనగ జయధ్వజం చేతబూని.
పదవులనే కొండలెక్కి పరవశించి కదను త్రొక్కి
వదరి వదరి కాలుజారి చదికిలబడినట్టి వారి
జాలిపుట్టి చెవులపట్టి సాగదీసి లేవదీసి
బుద్ది చెప్పగల దిట్టలు పుట్టవలెను వందలేసి -
ఈ బాబులు తమ డాబులు కికనైనా స్వస్తి చెప్పి
బడాయిలు కట్టిపెట్టి పగటి వేషములును విప్పి
నిజాయితిగ నిలబడితే ప్రజాహితము తలపడితే
దిక్కులేని జనం కొరకు తిండి దొరుకు కొంతవరకు
బండ పల్లవింపదు - పాషండుల గుండె ద్రవింపదు-
స్వార్ధపరుల కది పండుగ - సామాన్యుల కిది దండుగ-
ఈనాటి మహాసమరం - ఈ యిరుపక్షాల మధ్య
దీనహీన మానవు లిటు - తెగ బలసిన దానవు లటు
రగులుకొనే క్రోధాగ్నిని భగభగమని మండిస్తాం
దిగంతముల నిండిస్తాం జగతి ప్రగతి సాధిస్తాం
వయసు పండినా గాంధీవలెనె నిర్భయుల మిపుడు
ఒక్కొక్క వృద్దుడు మాలో ఒక్కొక్క భీష్మాచార్యుడు
జలజల మని జాలువారు చల్లని సెలయేటి గట్టు
చిక్కని నీడలు చిందే చెరువు పక్క మఱ్ఱిచెటు
జన సమ్మర్ధంతో కూడిన పెద్ద చతువృధాలు
అంధకార బంధురమ్ములైన నిర్జన స్థలాలు.
పచ్చని పచ్చిక పరువులు పరుచుకొన్న ఉపవనాలు
కన్నుల పండువుగ పండి కదలుచున్న జొన్నచేలు
అటూ ఇటూ ఎటు చూచిన అన్నిచోట్ల ఘాతకులే
తొలుతటి సౌహార్దం గొంతుక నొక్కు కిరాతకులే
ఎంతటి వృద్దులమైనా అంత నిరీహులము కాము
ఘోర హత్యలను చూస్తూ ఊరక కూర్చుండలేము
ఆత్మార్పణ మొకటే ఇపు దవసరమైన ప్రణాళిక
తరుణుల కంటే అది పెద్దలకే కాదా తేలిక?
యువదీరులు అధికారం ఒడిలోనే పుట్టినారు
బాధ్యత ఎరుగని పదవులు పాపం చేపట్టినారు
నీతిపాఠములు జగతికి నేర్ప మొదలు పెట్టినారు
నిరంకుశత్వానికి వన్నెల పాగా చుట్టినారు
కావున నా పల్కులు ఆకర్ణింపుదు వీనులార
గద్దెలపై మిద్దెలపై కాంక్షలేని పెద్దలారా!
బాపూజీ బాటల్లో పయనించిన భ్రాతలారా!
శాంతి సమరనేతలార! సత్యాగ్రహ దూతలారా!
స్వార్ధరహిత బుద్దులార! సామరస్యసిద్దులార!
త్యాగానికి వెలైనది వేగంగా రండి రండి!!
అమ్మ మిమ్ము రమ్మన్నది! ఆయుధాలు చేకొనండి!
పుట్టిన భారతదేశం మట్టికి గౌరవము తెండి!!