ప్రబంధ పరమేశ్వరుడు
కలువలు పూచినట్లు- చిరుగాలులు చల్లగ వీచినట్లు - తీ
వలు తల లూచినట్లు - పసిపాపలు చేతులు చాచినట్లు - క్రొ
వ్వలపులు లేచినట్లు - చెలువల్ చెలువంబుగ చూచినట్లు - ఆ
త్మలు పెనవైచినట్లు - కవితల్ రచియింతు రహో మహాకవుల్!!
అట్టి మహా కవీశ్వరుల కగ్రనరుండయి పాకనాటిలో
పుట్టినవాని, భారతము పూర్తీయొనర్ప కరాన గంటమున్
బట్టినవాని, ఔచితికి పట్టము గట్టినవాని పారమున్
ముట్టినవాని "నేఱ్ఱన" నమోఘవచస్కుని సంస్తుతించెదన్.
చల్లగ - మెల్లమెల్లగ- ప్రసన్నశరన్నదిలాగు సాగుచున్,
మల్లెలతోటలో మలయమారుత మట్టు లుయాల లూగుచున్,
పిల్లనగ్రోవి పాట కరణిన్ మదిలో చెలరేగుచున్, జగం
బెల్లెడ నెఱ్ఱనార్య! విహరించును నీ కవితా విలాసముల్!!
"పంచదశ శతాధిక" సము
దంచిత పద్యములు వ్రాసి "తద్రచనయ గా
వించిన" నీ త్యాగము తిల
కించిన రసజగతి నేటికిన్ పులకించున్.
"వెన్నవలె ' మెత్తనైనది
"పోన్నవలేన్" జంపు సొంపు పొలుపు గలదియున్;
"పెన్నవలె" పొంగునది; ఎ
ఱ్ఱన్నా! నీ తెలుగు - సురుచిరమ్మై వెలుగున్.
నన్నయభట్ట తిక్కకవినాధుల మధ్య సువర్ణపీఠి గొ
ల్వున్న మహీనుపర్వుడు మహోదయు డెవ్వరయా! వెలింగెలే
కన్నులలో ప్రశాంతియును, గంటములో నమృతస్రవంతి; ఎ
ఱ్ఱన్నయే! మార్పు నీ ఘను దారణ్యమునే ఒక పూలతోటగా.
"స్పురదరుణాంశురాగ "రసశోభలు నెన్నుదుటన్ నటింపగా;
శరదుదయెందు చంద్రికల స్వచ్చత చూపుల ప్రస్పుటింపగా,
కరమున గంటమూని కలకందల అచ్చులు వోయువాని, మీ
రెరుగరటే! ప్రబంధ పరమేశ్వరులే! మన శంభుదాసులే!!
అభ్యుదయ సంక్రాంతి
కసురుకోకుండ డాక్టర్లు పేషంట్లను
గారవించిననాడు 'ఆరోగ్య సంక్రాంతి."
స్టూడెంట్లు వాచర్ల చొక్కాలపై సిరా
చల్లకుండిన అది "చల్లని సంక్రాంతి."
అత్తవారింటిలో కొత్తల్లునకు శివ
మ్మెట్టకుండిన అది "మెత్తని సంక్రాంతి."
హాస్టళ్ళలోని విద్యార్ధులు చక్కగా
చదివి ప్యాసైన అది 'చైతన్య సంక్రాంతి."
వృద్ద హీరోలు నవీన హీరోలకు
అవకాశ మిచ్చిన అది 'చిత్ర సంక్రాంతి."
ఉన్నతోద్యోగులు చిన్న గుమాస్తాల
వేటాడకున్న అది "విలువైన సంక్రాంతి."
రసహీనమగు చచ్చురచనకు రచయితల్
స్వస్త్రి చెప్పిన అది "సాహిత్య సంక్రాంతి."
కోటీశ్వరుల కొడుకులు బీదపిల్లల
ప్రీతి పెండ్లాండ అది 'జాతీయ సంక్రాంతి."
శిష్యరత్నాలు దేశిక సువర్ణాలతో
అన్యోన్యమున్న అది "ఆదర్శ సంక్రాంతి."
ముంగిళ్ళ రంగురంగుల రంగవల్లికల్
చెంగలించిన అది "బంగారు సంక్రాంతి."
మకరరాశి సువర్ణమయ సూర్యకిరణాలు
దెసల ప్రసరింప అది 'సిసలైన సంక్రాంతి."
యువశక్తి యుగశక్తి నవనవోన్మేషమై
పొంగులెత్తిన అది "పొంగళ్ళ సంక్రాంతి."
గుమ్మడిపూలతో గొబ్బిళ్ళ వాకిళ్ళ
శోభిల్లుచున్న అది "సౌభాగ్య సంక్రాంతి."
వరకట్న రాక్షసిన్ నరికి ముక్కలు చేసి
అగ్ని కాహుతి చేయ అది "భోగి సంక్రాంతి."
అరసాలు విరసాలు సరసాలు ఏకమై
కలిసి కాంతులు చిమ్మ అది "వెలుగు సంక్రాంతి."
మధురమగు మన తెలుగు అధికారభావయై
అవఘళించిన అదే 'అభ్యుదయ సంక్రాంతి."
అష్టావధాని
రాక్షసంబగు "నిషేధాక్షరి ' యొక వంక
కొక్కిరాయి "సమస్య" యొక్క వంక
"వ్యస్తాక్షరీ' కళాప్రస్తార మొక వంక
చిక్కని "వర్ణన" మ్మొక్కవంక
"అప్రస్తుత ప్రసం "గాఖ్యాన మొకవంక
"లెక్కల పూ "ముల్కు లోక్కవంక
పట్టు పట్టు "పురాణపాఠన" మ్మొకవంక
నొక్కు "దత్తపదీయ" మొక్కవంక
'అష్ట భార్యల "తో "కృష్ణు" నట్లు నీవు
అష్టకష్టాలు పడి జయ మ్మందినావు;
రమ్య సాహిత్య నవరస రాజధాని!
ఆశుకవితా ప్రధాని! అష్టావధాని!!
మాం పాతు మహేశ్వరీ
"బాలా!" పర్వతవర్దనీ! భగవతీ! బాలార్కకోటిప్రభూ!
కళ్యాణీ! నిఖిలేశ్వరీ! శుభకరీ! గౌరీ! శివా! పార్వతీ!
సర్వజ్ఞా! సకలాగమాంత వినుతా! సౌభాగ్యసంవత్ర్పరా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
శ్రీమాతా! "లలితా!" ప్రసన్నవదనా! శ్రీ రాజారాజేశ్వరీ!
విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవితపదా! విశ్వేశ్వరీ! శాంభవీ!
కారుణ్యామృతవాహినీ! రసమయీ! కైవల్యసంధాయినీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
హ్రీంకారీ! త్రిపురేశ్వరీ! సుఖకరీ! మా "తాన్నపూర్ణేశ్వరీ!"
ఈశానీ! నవరత్న నూపురయుతా! హేమంబరోద్భాసినీ!
శ్యామా! హైమవతీ! సతీ! గుణవతీ! శ్రీ చక్రసంచారిణీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
'ఆశ్వారూడ విహారిణీ!" విజయునీ! కేయూరహారోజ్జలా!
శర్వాణీ! శశిసూర్యవహ్నినయనా! సౌభాగ్యసంజీవనీ!
దేవీ! జ్ఞానమయీ! చరాచరమయీ! తేజోమయీ! చిన్మయీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
"మాతంగీ! " శుకలాలినీ! మధుమతీ! మాణిక్యవీణాధరీ!
మహేంద్రాశ్మ సమానకాంతి కలితా! వాగ్దేవతా సేవితా!
తారానాధ కళాకలాపమకుటా! సంగీత సమ్మోదితా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
వాత్సల్యామృతవర్షిణీ! గుణమణీ! "వాగ్వాదినీ!" హ్లాదినీ!
శబ్దబ్రహ్మమయీ! త్రిలోకజననీ! సౌందర్యమందాకినీ!
రాకా చంద్ర సహస్త్ర చారువదనా! రాజీవ మధ్యస్థితా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!