Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 51

 

                       తెనుఁగు సీమ
                                        ఖడ్గతిక్కన

                                             1

    అనాఁడు విక్రమసింహపుర మంతయును నవ్యకాంతులతో నయనానందకరముగ విరాజిల్లు'చుండెను. పురజనులందఱు మహోత్సాహాముతో గుంపులు గుంపులుగా రాజమందిరము వైపునకుఁ బోవుచుండిరి. పచ్చపచ్చని మామిడాకు తోరణములతో భవనద్వారములు జయలక్ష్మి నివాసములై విలసిల్లుచుండెను. రాజసభా మంటపమంతయుఁ బ్రేక్షకజన సమూహముతోఁ గిటకిట లాడుచుండేను. విజయదుందుభి ద్వానములు వీనుల విందుగ వినిపించుచుండెను.
    మహాసభామధ్యమున మనుమసిద్దిమహారాజు తళతళమెఱుయుచున్న నానావిధభూషణములను ధరించి మణిమయ సింహాసనముపై నాసీనుఁడై యుండెను. ఎడనెడ సేనానాయకులు, దండనాధులు, సామంతులు, తమతమ యాసనములపై నలరారుచుండిరి. వెనుక భాగమున నంతఃపుర కాంతమణులు యాదోచితస్థానములఁ గూర్చుండియుండిరి.
    మనమసిద్ది మహీకాంతుని ప్రధానామాత్యుఁడును ప్రధాన సేనా నాయకుఁడును నగు సిద్దనామత్యుఁడు మహారాజు ప్రక్కనున్న పచ్చలగద్దియ పై సుపవిష్ణుఁడై యుండెను. సిద్దనామాత్యున కుభయపార్వ్సముల నిరువురు యవకులు సూర్యచంద్రులవలెఁ బ్రకాశించుచుఁ గూర్చుండియుండిరి. ఆ నవయౌవనులిరువురు నేవ్వరైయుందురో!
    మంగళవాద్యములు మ్రోఁగినవి. వందిమాగధుల కైవారములు పూర్తీయైనవి. భట్టారకుల జయజయధ్వనులు మిన్నుమిట్టినవి. వేదవేదాంగవేత్తలగు బ్రాహ్మణోత్తముల స్వస్తివాచనముల ముగిసినవి.
    మహామంత్రి సిద్దనామాత్యుఁడు మెల్లగా లేచి నిలఁబడినాఁడు. మహారాజువైపును, సభాసదులవైపును, సోదరవీక్షణములతో నొక్కమారు చూచి గంభీర కంఠస్వరముతో నీ విధముగ నుపన్యసించినాఁడు.
    "మహామహులారా! సింహపుర నివాసులారా! సహృదయులగు మీరందఱు సభాభవనము నలంకరించి యున్నారు. నేఁడు మీయందఱు సన్నిధానమున నొక చిన్న విషయము విన్నవించుకొనుచున్నాను. నేను పెక్కు సంవత్సరముల నుండి మనుమసిద్దిమహారాజుగారి జనకులగు తిక్కనృపాలునకు మంత్రినై సింహపురరాజ్యలక్ష్మికి నా యోపినంత సేవగావించితిని.
    తేజోవిరాతుఁడగు తిక్కనృపాలుని శౌర్యధైర్యసాహసములు మీ రెఱుంగనివి గావు. ఆ మహారాజు చల్లని పరిపాలనమునఁ గడుపులో చల్ల గదలకుండ మన మెన్నో దినముల సుఖ జీవనము గడిపితిమి. మహావీరుఁడగు తిక్కభూపతి శత్రువ్యూహములను చిన్నాభిన్నమొనరించి రాజరాజచోళనిఁ గాంచీపుర సింహాసనాసేనుంగావించి "చోళసింహాసనస్థాపనాచార్య" బిరుదమును గ్రహించినాఁడు. అంతియకాక, నిరుపమానశక్తి సామర్ధ్యములతో ననేక యుద్దములందు విజయలక్ష్మి నందుకొని యీ విక్రమసింహపురమును ప్రజారంజకముగాఁ బెక్కుదినములు పరిపాలించి తన కూమారరత్నమగు నీ మనమసిద్ది మహీపాలుని సింహాసనాసీనుంజేసి కాలధర్మము నొందినాఁడు.
    నాఁటి నుండి నేఁటి వరకు నీ సింహపుర రాజ్యమునకు నేనే మహామంత్రినై ప్రధాన సేనానాయకుఁడనై రాజకార్యముల నడపించుచుంటిని. నాయనలారా! నేను వృద్దుఁడనైపోతిని. శరీరమున జవసత్వము లుడిగిపోయినవి. మేధాశక్తి క్షీణించిపోయినది. మన మహారాజు చిన్నవాఁడు, సామంతరాజులలో సర్వత్రతిరుగుబాటు సూచనలు కానుపించుచున్నవి. మన పూర్వవిరోధులు సమయమును గనిపెట్టి మన రాజధానిపై దండెత్తి మన రాజ్యమును గబళింపఁ జూచుచున్నారు. ఈ కల్లోల సమయములో మన సామ్రాజ్యనౌకను జాగరూకతతో సుడిగుండములపాలు గాకుండ ముందుకు నడుపుకొని పోఁగలిగిన మహామంత్రియు సేనానాయకుఁడును గావలెను.
    మహాశయులారా! నేనీభారము నిఁక వహింపఁజాలను. ఈ భుజస్కందముల మీఁదివరువును వేఱొకరి భుజస్కంధములపై నుంచి నేను విశ్రాంతి తీసికొనఁగోరుచున్నాను. పై రెండుపదవులకును యోగ్యులైన వీరపురుషులను మీరే నిర్ణయింతురుగాక!"
    ఇట్లు సిద్దనామాత్యుఁడు తన యుపన్యాసమును ముగించి నిజాసనము'పై నాసీనుఁడయ్యెను. సభాసదుల కరతాళధ్వనులు సభా మంటపమంతటఁ బ్రతిద్వనించినవి.
    సభ్యులలో గుసగుసలు బయలుదేరినవి. భాద్యతా యుతములైన యీ మహోత్తమ స్థానములను సక్రమముగా నిర్వహింపఁగల ధీమంతుఁడును, పరాక్రమవంతుఁడును నెవ్వరాయని యొకరి మొగమొకరు చూచుకొనసాగిరి. కొందఱదృష్టులు మనుమసిద్ది మహీపాలుని ముఖమండలముపైఁ బ్రసరించినవి. మరికొందరు సిద్దమాత్యునకిరువైపులఁ బ్రకశించుచున్న వీరకుమారులవైపు చూచుచుఁదమలో నేనేమో సంభాషించుకొనసాగిరి. ఇంక కొందఱు సిద్దనాత్యుఁడేతగినవారిని నిర్ణయించిన బాగుండునని యనుకోనుచుండిరి. ఇంతలో సభ మఱల నిశ్శబ్ధమైనది.
    మనమసిద్దిమహారాజు లేచినాఁడు మహామాత్యునకు', సభాసదులకు ధన్యవాదములపుంచుచు నిట్లు పలికినాఁడు.
    "మహాజనులారా! వింటిరిగదా మహామాత్యుల వారి వాక్యములు. వీరి యనుపమాన సహయ్యముననే , వీరి యద్వితీయమేధాశక్తిచేతనే, వీరి యసాధారణ రాజకార్య చాతుర్యము చేతనే మా తండ్రి గారి రాజ్యము ప్రశాంతముగను, ప్రజాసౌఖ్యదాయకముగను గడిచిపొయినది. అందులకు మహామంత్రులవారికి, వారి కుటుంబమునకు మీ యందఱపక్షమున నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు సమర్పించుచున్నాను. మహామంత్రిగారు సెలవిచ్చిన రెండు స్థానములకును దగినవారిని మీ యందఱ పక్షమున నేనే నిరూపించుచున్నాను. ఇందులకు మీలో నెవ్వరికైనా నభ్యంతరమున్నచో నిస్సందేహముగా తెలుపవచ్చును.
    చూడుడు. సిద్దనామాత్యులవారి సోదరుఁడైన కొమ్మనామాత్ర్యులవారి కుమారుడు తిక్కనయే మహామంత్రి పీఠము నలంకరింప సర్వవిధములఁ దగియున్నాఁడని నా యుద్దేశము. తరువాత, సిద్దనామాత్యులవారి జ్యేష్టనందనుఁడగు ఖడ్గతిక్కన సర్వసేనాధ్యక్షస్థానమునకు సమర్దుఁడని నేను దలంచుచున్నాను. ఈ సోదరులిరువురు నాకుఁ గుడియెడమ భుజములవలె నుండి నేఁటి రాజలోకములోఁ జెలరేఁగుచున్నకల్లోలముల పాలుగాకుండ సింహపురరాజ్య సింహాసనమును సముద్దరింపఁ గల యనుపమానశక్తి సమన్వితులని నాదృడ విశ్వాసము. ఇందులకు మీ యందఱ యంగీకారము నెఱఁంగగోరుచున్నాను."

 Previous Page Next Page