Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 5

 

    "అవి తప్ప ఇతర వస్తువులేవీ దొరకలేదు" ఎ.ఎస్.పి అతని ముఖంలోకి పరిశీలనగా చూచాడు.
    భూమిలోకి కృంగిపోయినట్లుగా కనిపించాడు జయసింహ. అతని ముఖం వాలిపోయింది. కన్నులు చెమరించాయి. దుఃఖం వల్ల పెదవులు వొణుకుతున్నాయి.
    "యూ సి యంగ్ మాన్! భయపడకుండా నువ్వేం పోగొట్టుకున్నావో చెప్పు. వీలయితే వాటిని గురించి మరికొంత శ్రద్ధ తీసుకుంటాను. నువ్వు నమ్ముకున్న అదృష్టం కలిసొస్తే అవి దొరుకుతాయేమో!?"
    విక్రమ్ అతని వంక జాలిగా చూచాడు.
    జయసింహ పాతాళంలోకి చొచ్చుకుపోయి వున్నాడు.
    అతని ఆశలన్నీ నిరాశలయినాయి. చివరి క్షణంలో ఆశలు అడుగంటాయి.
    చెప్పుకునేందుకు ప్రపంచంలో ఎవరున్నారు.
    "సర్! భాగ్యవల్లి బంపర్ లాటరీ టికెట్ లాకర్ లో దాచాను" తన సర్వస్వాన్ని కోల్పోయిన కంఠ స్వరంతో చెప్పాడు.
    "మీలాంటి వాళ్ళు అనవలసిన మాటలేనా యివి?" అన్నాడు నవ్వుతూ.
    "సర్! నా అవసరం తీర్చుకునేందుకు అదొక్కటే మిగిలి ఉన్న దారి. ప్రయత్నించటం మానవ లక్షణం కదా!
    ఆకలికి తట్టుకోలేని ఓ కుర్రాడు రొట్టె ముక్క దొంగిలిస్తే అది చట్టరీత్యా నేరం! ప్రపంచంలోని మురికినంతా ఆసహ్యన్నంతా భరించి బిడ్డల కడుపు నింపాలని ఓ మాతృ మూర్తి వ్యభిచారం చేసిందనుకోండి అది నేరం జైల్లో పెడతారు.
    కాని దురాశా పరులుగా సోమరులుగా మార్చి జాతి అభ్యుదయానికి ఆటంకం కలిగించే లాటరీ టికెట్ కొనటం చితరిత్యా నేరం కాదు. ప్రభుత్వమే స్వయంగా లాటరీ టికెట్ లు ముద్రిస్తోంది. అడ్వర్టైజ్ మెంట్ల చేస్తోంది.
    గాంధీ సిద్దాంతాలు అందరూ వల్లిస్తారు.
    కాంట్రాక్టుల్ని బహిరంగంగా వేలం వేస్తారు. గెజిట్లో ప్రకటిస్తారు.
    ఆదాయం కోసం అనేక ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి.
    నాకు అర్జంటుగా అయిదు లక్షలు కావాలి. అందుకే లాటరీ టికెట్ ఒకటి కొన్నాను. తప్పంటారా?"
    "ఆశించటం తప్పు కాదు. అందుకోసం చట్టరీత్యా ప్రయత్నించటమూ తప్పు కాదు. కాని లాటరిలో పది లక్షలు నీకే వస్తాయని నమ్మకం ఏమిటి?"
    "చెప్పాను కదా! ఇది నా చివరి ప్రయత్నం"
    "మీకు అర్జంటుగా అంత డబ్బు కావాలా?"
    "అవును కావాలి ఆశ తీరిపోయింది "
    "నువ్వు బాంక్ లో డిపాజిట్ చేసి ఉండవలసింది"
    "ఫలితాలు వచ్చాక చేద్దామనుకున్నాను"
    "బ్యాంకు నష్ట పరిహారం చెల్లించదా?"
    "ఆ విషయం నేనింకా తెలుసుకోలేదు సర్!"
    'అయితే ఒకసారి బ్యాంకు మేనేజర్ని కలవండి. మీకు డబ్బుతో అంత అవసరం ఏమిటి?"
    "ఒక్క ప్రశ్నకూ నేను సమాధానం చెప్పలేను సర్! ఎక్స్ క్యూజ్ మీ! నాతొ మాట్లాడేందుకు ఎక్కువ సమయం లేదన్నారు. కాని మీరే మాటలు పెంచుతున్నారు.
    థాంక్యూ ఫర్ యువర్ కైండ్ కో ఆపరేషన్! "థాంక్యూ అండ్ నమస్తే!"
    ఇంక ఎటువంటి మాటలకు అవకాశం లేకుండా లేచి నిలబడ్డాడు జయసింహ!
    "ముక్కుకు సూటిగా పోయి ముఖం గోడ కేసే గుద్దుకునే రకం మనిషి"
    నవ్వుకుంటూ చేయి అందించాడు విక్రమ్!
    జయసింహ బయట బడ్డాడు.
    నేరుగా శ్రీవన దుర్గాంబ ఏజన్సీస్ దగ్గరకు పోయాడు. కౌంటర్ లో కూర్చుని ఉన్న కోటిలింగం అందంగా నవ్వాడు.
    "టిక్కెట్లు కావాలా సార్! సిరీస్ కి ఒకటి చొప్పున ఇయ్యండి. మీ పెట్టుబడికి హామీ! సౌభాగ్యవల్లి మీ జీవితానికి పురోగామి" అన్నాడు టికెట్స్ బంచ్ వంక చూపుతూ!
    "కోటిలింగం ఓ టికెట్ కొన్నాను. పోయిందోయ్" అన్నాడు జయసింహ.
    "ఇంకా నాలుగు తియ్యండి సార్! ఈసారి అదృష్టం మిమ్మల్ని నడిపించవచ్చు." అన్నాడు కోరిలింగం లాటరీ భాషలో! జయసింహా జేబులు వెతికాడు. ఒక్క రూపాయి కూడా లేదు.
    
        
                                    3


    ఉదయం ఆరు గంటలయింది!
    చాలా మంది ఇంకా మంచాల మీంచి లేవలేదు. పేవ్ మెంటు మీద పడుకున్న వాళ్ళు, చెట్టు కింద చాపలు పరుచుకున్న వాళ్ళు నులకమంచాల మీద శయనించిన వాళ్ళు , దూది పరుపుల వాళ్ళు ఫోం బెడ్ ల వాళ్ళు ఏ.సి రూంల వాళ్ళూ అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కలలు కంటున్నారు.
    కష్టపడి పనిచేయటం మానేసి ఒక్కొక్క పౌరుడు కంటున్నా ఓ కల ఈ దేశాన్ని ఎంతో కొంత దిశ మార్చుతుంది. ఆ సంగతి చాల మందికి జ్ఞాపకం వుండదు.
    భాద్యత కలిగిన వాళ్ళు కూడా మీరు కష్ట పడకుండా ఆ సౌకర్యాలు చేస్తాం -- ఇవి చేస్తాం . రాయితీలు ఇస్తాం. సబ్సీడీలు యిస్తాం అప్పులిచ్చి తీర్చాలసిన అవసరం లేకుండా చేస్తాం అంటారు. కాని కష్టపడి పని చేయటం ఆధునిక అవసరాలకి తగిన నాగరికత అని వాళ్ళకి గుర్తుచేయరు.
    డబ్బు సంపాదించే వాళ్ళు రాత్రింబవళ్ళు నిద్ర పోరు!
    ఉదయం ఆరుగంటలకే చెవులు చిల్లులు పడేలా మైకులోంచి మాటలు ప్రవహిస్తున్నాయి.
    "కొనండి సార్! లక్కి లాటరీ! సౌభాగ్యవల్లి మీ వాకిలి దగ్గరకు వచ్చి పిలుస్తోంది. రేపే డ్రా! చివరి అవకాశం!
    కొద్ది మొత్తంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఒక్క రూపాయికి పది లక్షలు మీ స్వంతం చేసుకోండి!
    అదృష్టం ఎవర్ని వరిస్తోందో! సౌభాగ్యవల్లి ఎవరి మెడలో పూల హారం వేస్తుందో! ఆ అదృష్టవంతులు మీరే ఎందుక్కాకూడదు? కొనండి సార్! ఒక్క రూపాయికే ! పది లక్షలు!
    ఒక్కొక్క రూపాయి! మీ పాపాయికి జడ పిన్ను, మీ అమ్మాయికి రిబ్బన్ , మీ బాబుకి బిస్కెట్ పాకెట్ ఏ ఒక్కింటికి రాదు సార్!
    ఒకే ఒక్క రూపాయి! ఏక్ రుపయా! ఒన్ రూపీ!
    మీ అమ్మాయిని ఇంగ్లీషు మీడియం కాన్వెంటులో చేర్చాలనుకుంటున్నారా?
    మీ అబ్బాయిని యింజనీరింగ్ చెయ్యాలనుకుంటున్నారా?
    మీరు విమానంలో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా?
    కారుల్లో క్లబ్బులకి తిరగాలనుకుంటున్నారా?
    బంగ్లా లో ఉండాలనుకుంటున్నారా?
    మెడ నిండా నగలు పెట్టుకోవాలనుకుంటున్నారా?
    అన్నింటికీ ఒకటే అవకాశం! బంగారు బాట! ఒక రూపాయి!
    అపురూపమైన--
    అద్భుతమైన --
    ఆనందకరమయిన - అందరికీ అందని సౌభాగ్యవల్లి సౌభాగ్యబంపరు లాటరీ! కొనండి బాబూ!
    టికెట్లు కొద్దిగానే ఉన్నాయి. అయిపోతున్నాయి. తొందరపడండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి" తెరచిన నోరు ముయ్యకుండా ఊదర కొట్టేస్తున్నాడు తెల్లవారకుండానే!

 Previous Page Next Page