Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 48


    విశాలమగు నా గోపుర ద్వారమునుండియే మేము లోనికిఁ బ్రవేశించితిమి. లోపలఁ గొన్ని వందలమందికి వసతి గల పెద్ద యవరణ మున్నది. కుడియెడమ వైపుల నాద్వారమున కెదురుగ రెండు పెద్ద మంటపములున్నవి. ఆ గోపురమున కెదురుగ నింకొక చిన్న గోపురము గనుపించింది. దానిలో నుండి నడిచి మరియొక యావరణములోనికిఁ బోయితిమి. తూర్పు పడమర గోడల నానుకొని విశాలమంటపపంక్తు లిరువైపుల వెలయుచున్నవి. శ్రీవిరూపాక్షస్వామి వారి యాలయము కన్నులపండువు గావించినది. ఆ యవరణములేనే భువనేశ్వరిదేవి యాలయము గలదు. ధ్వజస్తంభమును, శ్రీకృష్ణదేవరాయల శాసన స్తంభమును దర్శించి స్వామివారి యాలయములోనికిఁ బోయితిమి. ఆలయము ముందున్న ముఖ మంటపము నయనానందకర మగు నందచందములతో నలరారుచున్నది. అందు పై భాగము నందలి శిల్పములకు వేసిన రంగులు నేఁటికిని జెక్కు చెదరకున్నవి. ఈ రంగుల యందమును గాంచిన నానాఁటి శిల్పవరేన్యులకళాచాతురి యెట్టిదో స్పష్టమగును. ఆలయంతర్భాగమున నంది నిలబడియున్నది. నిలిచియున్న నందీశ్వరుని మే మెచ్చటను జూచియుండలేదు. గర్భాలయమందు యాత్రికులు పరస్పరము త్రోసికొనకుండ నినుపకమ్ముల తలు పోకటి గలదు. మాకు స్వామి దర్శనమైనది.  లింగాకారము దాదాపోక "అడుగు" ఎత్తున్నది. స్వామి వారికి నిత్య నైవేద్య దీపారాధనములు జరుగుచున్నవి! స్వయంభువ మగు నా లింగమూర్తిని సందర్శించినప్పుడు బ్రతి యాత్రుకుని యంతరంగమందును భక్తీ తరంగములు పొంగకమానవు. మేమందఱము కన్నులు మూసికొని భక్తీ తత్సర్యముతో స్వామికి నమస్కరించితిమి. మా శాస్త్రి మాత్రము సంస్కృత శ్లోకము లేవేవో పఠించినాఁడు. ఇంతలో నర్చకుడు వచ్చి ప్రసాదము పెట్టినాఁడు. మేము ప్రసాదము నందుకొని భువనేశ్వరీ దేవాలయమును దర్శించితిమి. ఆ యాలయ ద్వారబంధము నల్లరాతితోఁ జేయబడియున్నది. దాని యందలి శిల్పవైభవము వర్ణనాతీతము. చిత్రకారుడు కుంచియతోఁ గగితముపైఁ జిత్రించినట్లు, ఆనాఁటి శిల్పి తన యులితో నల్లరాతిపై నా శిల్పము చెక్కినాఁడు. ఆ కఠిన పాషాణ మా కళాకారుని హస్తముల మైనపు ముద్దగా మారిపొయినది.
    విరూపాక్షస్వామికి "పంపానది" యను నామాంతరము గలదు.  తుంగభద్రానదిని గూడ "పంపానది" యని పిలిచెదరు. కన్నడములో దీనిని "హంపానది" యందురు. అట్లే యీ స్వామిని హంపాపతి యని పిలుతురు. ఈ కారణముననే యీ స్థలమునకు "హంపీ" యను ప్రసిద్ది వచ్చినది కర్ణాటక భాషలో 'ప' యను నక్షరమును "హ" గానుచ్చరింతురు.
    విరూపాక్షాలయము నుండి దక్షిణముగా నూరు గజముల దూరములో నున్న "గణేశాలయము" ను  జూడబోయితిమి;  అందలి విగ్రహము చాలా గొప్పది. దాదాపు ముప్పది యడుగుల యెత్తున్నది. ఐదారు గజముల వెడల్పున్నది. ఈ విగ్రహమింత పెద్దది గనుకనే పరిహసార్ధము దీనికి "శాశివకల్లు గణేశ విగ్రహ" మని పేరు వచ్చినదట. అనఁగా నావ గింజంత రాతితో జేయఁడిన గణేశవిగ్రహమని యర్ధము. ఈ విగ్రహమునకు వామహాస్తమును, తొండమును ఖండితములై యున్నవి. విఘ్నేశ్వరునకు వాహన మగు నెలుక విగ్రహమునకుఁ గ్రింది భాగమున లేదు. ప్రత్యేకముగా నొక రాతిపై జెక్కబడి యున్నది.
    గణేశ విగ్రహమును జూచిన యనంతర మచ్చటి కల్లంత దూరములో నున్న "కృష్ణస్వామి దేవాలయము"ను గాంచబోయితిమి. అందు గోపుర ద్వారములు శిధిలావస్థయందున్నవి. గర్భాలయములోని కేగితిమి. కాని మూలవిరాట్టు లేదు. ఏమయిపోయినదో! ఆ విగ్రహ మెంత యందమైనదో! శ్రీకృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయయాత్రకు వెడలిన సందర్భమున "నుదయగిరి" కోటలో నొక దేవాలయమందున్న జగన్మోహాన మగు నీ కృష్ణవిగ్రహమును విజయచిహ్నముగాఁ గొనివచ్చి యద్దాని నిచ్చటఁ బ్రతిష్టించి యీ దేవాలయమును నిర్మించినాడట. రాయల వారి హృదయము నాకర్షించిన యా శిల్పసౌందర్యమే సమ్మెట పెట్టునకు బలియైపోయినదో! దేవాలయమందలి యొక శాసనమును జదివి మా యాచార్యులు క్రీ.శ. 1513 సంవత్సరమున నిధి నిర్మింపఁబడినట్లు  చెప్పినాడు. గోపురము మీద నేమేమో బొమ్మలు నిర్మింపబడియున్నవి. ఏదియో సైన్య మెచ్చటికో పోవుచున్నట్లున్నది. ఆ శిల్పములో జీవశక్తి తొణికిసలాడుచున్నది. దేవాలయ ముఖ మంటపము గూడ మిక్కిలి యాకర్శణీయముగనున్నది. రాతితో చెక్కబడిన యేనుఁగులు హంసలు మొదలగునవి గలవు గాని చాల భాగ మన్నియు శిధిలీకృతములై పోయినవి.  ఆలయమునకు దక్షిణముగ నొక కట్టడమును జూచినాము. అది ధాన్యపు కొట్టుగావచ్చునని యాచార్యులు వారు సెలవిచ్చినారు. గోపురమునకు నెదురుగ నున్న శిధిలమందిరపంక్తులను జూపించి యిదియే పూర్వకాలమునాఁటి "కృష్ణాపుర"మని చెప్పినారు.
    కృష్ణాస్వామి దేవాలయమును వదలి దానికి కొలది దూరమందున్న "యుగ్రనరసింహ విగ్రహమును" దర్శించితిమి. ఇదియును గణేశ విగ్రహమువలెనె మిక్కిలి పెద్దదిగా నున్నది. పేరునకుఁదగినట్లే విగ్రహము మిక్కిలి భయము గొల్పుచున్నది. చాలా భాగము చెడగోట్టబడినది. నరసింహస్వామి యాదిశేషుని పడగలమీదఁ గూర్చుండియున్నట్లు చెక్కబడి యున్నది. స్వామివారి యంక భాగముపై లక్ష్మీదేవి విగ్రహము గూడ నున్నట్లు తోచుచున్నది. శిధిలమైన భాగము పోగా నమ్మవారి కుడిచేయి యందలి కొంతభాగము మాత్రమయ్యవారి వక్షస్థలముపై గన్పించుచున్నది. ఈ నరసింహ విగ్రహము దాదాపుగా నేడేనిమిది గజముల యేత్తున్నది.
    అచటి నుండి కొంచె ముత్తరముగా నున్న "శివాలయము"ను జూడఁబోతిమి. దేవాలయమంత లింగ మున్నది. లింగమునకుఁ దగినట్లే పానవట్టము కూడ నున్నది. ఆ మహా శివలింగముచుట్టు వలయము మూడు గజము లుండవచ్చును. ఎత్తు నాలుగు గజము లుండును. గుడి యంతరము లింగమే యావరించియున్నది. చిత్రమేమన పానపట్టమును లింగమును నొకేశిలలోఁ జెక్కబడినవి. తుంగభాద్రానదిలో నుండి యేకనీటి కాలువ యా దేవాలయములోని కమర్పఁబడియుండెను. ఆ నీటిలో లింగము క్రింద భాగమంతయును మునిగియుండెను. దేవుని పేరు తెలియలేదు.
    అచ్చటికి సమీపమున "చంద్రశేఖరాలయ" మున్నది. అందు నేటికిని స్వామికిఁ బూజులు జరుగుతున్నవి. తరువాత రాచనగరు దర్శించబోయితిమి. త్రోవలో రెండు పెద్ద బండలున్నవి. అవి "అక్కా చెల్లెండ్ర గుండ్ల "ట మాకు కుడివైపుగా నున్న పాతాళశివాలయములోనికి బోయి చూచితిమి. ఒక మూల పగులగొట్టిన విగ్రహములు కనిపించినవి. తరువాత "చాకలి దాని మెడ" గాంచితిమి. తరువాత మాకు "మంత్రి గారి కచేరిసావడి" కనిపించింది. కాని దాని మీద సూచక ఫలకము మాత్రము "మహమ్మదీయ మసీదు" అని వ్రాయబడియున్నది.
    ఆ పిమ్మట రాయల "టంకశాల" దర్శించితిమి. లోని భవన మంతయు పడిపోయింది. ప్రాకారములు మాత్రము నిల్చియున్నవి. ఆ ప్రక్కనే రాయల "సభాగార" మున్నది. అది పూర్తిగా నేలమట్టమైపోయియున్నది. మెట్లకు రెండు ప్రక్కల చక్కని యేనుఁగులు చెక్కబడి యున్నవి. మనుచరిత్రమందు పెద్దనచే వర్ణింపఁబడిన "భువనవిజయ" మనురాయలవారి సభాగార మిదియే గాఁబోలు.

 Previous Page Next Page