రాక్షసుడికంటె భయంకరంగా హింస పెడుతున్న ఆ త్రాష్టుడి నుండి..... తప్పించుకోవాలనే ప్రయత్నం......
కాళ్లు చేతులూ అతని ఆధీనంలో వున్నాయి. ఏం చేయటానికి తోచటంలేదు.
కొన్ని సెకన్ల వ్యవధిలో.... ముఖంమీదో, పెదవులమీదో సిగరెట్ చుర్రుమంటుంది.
ఈ రాక్షసక్రీడని ప్రతిఘటించలేని నిస్సహాయత
ఒకటే మార్గం!
తప్పే కావచ్చు.
కానీ హింసనుంచి తప్పించుకోవడానికి అదే మార్గం!
"థూ!" అతని ముఖంపైన ఊసింది.
ఉలిక్కిపడ్డాడు జి.కె. క్రోధంతో అతని కళ్ళు ఎర్రబడినయ్.
చేత్తో ముఖాన్ని తుడుచుకోబోయాడు. ఆ వ్యవధిలో నాగమణి కాలుతో అతన్ని ఓ తన్ను తన్నింది.
మంచంమీంచి క్రింద పడ్డాడు జి.కె. క్షణం ఆలస్యం చేయకుండా మంచంపైనుంచి కిందకి దుమికి బయటకి పరుగెత్తింది.
అంత అవమానం జరిగితే జి.కె. సహించడు. చంపేస్తాడు. అనుమానం ఎంతో, కోపం కూడా అంతే ఆయనకి.
"రాస్కెల్!" పళ్ళు పట పట కొరుకుతూ ఆమెవెంట పడ్డాడు. ఆమె మేడ మెట్లు గబగబా దిగి ఓ గదిలోదూరి తలుపులు మూసేసుకుంది.
కాలిన చోటల్లా మండిపోతోంది, ఆమెకి ఏడుపొస్తోంది.
అతనంటే జుగుప్స.
ఏవగింపు.
ఎన్నాళ్లిలా! బతికినన్నాళ్ళూ ఈ హింస తప్పదా!
జి.కె. కిందకు వచ్చి తలుపు బాదటం మొదలు పెట్టాడు.
"తలుపు తీయవే!" అరిచాడు.
ఆమె రొప్పుతోంది.
తలుపు తీస్తే చంపేస్తాడు. మొగుడి మొండితనం, కోపం, కసి ఎటువంటిదో ఆమెకు తెలుసు.
ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తోంది.
లేకపోతే ఏదైనా బండతో వాని నెత్తిమీద బాదాలనిపిస్తోంది. ఇలాంటివాడితో కలిసి బ్రతకడం ఎంత కష్టమో ఆమెకి తెలుసు. చెంపపై నించి కన్నీరు ఆమె గుండెలపైకి జారుతోంది.
తలుపుల్ని గట్టిగా బాదుతున్నాడు. చూడబోతే తలుపుల్ని పగులగొట్టేలా వున్నాడు.
పనివాళ్ళేం చేస్తున్నారూ? వాళ్ళెవరూ తనని రక్షించరు ఆయనంటే భయం. పనిలోంచి తీసేస్తాడు. లేకపోతే వాళ్ళనీ కొట్టి పీడిస్తాడు. ఎదురు తిరగలేని బలహీనులు.
ఆయాసంతో ఎగసిపడుతున్న సమున్నత వక్షోజాలపై చేతులు వేసుకొని క్షణంపాటు కళ్ళు మూసుకొంది నాగమణి.
"బ్లడ్ షీట్! నీ అంతు చూస్తాను" అరిచాడు జి.కె.
నాగమణి ఉద్రేకంతో అంది "నేనేం తప్పు చేశాను. మీ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు నన్నిలా హింసలు పెడుతున్నారు. నన్ను నేను ఎంత సరిపెట్టుకుంటున్నా, రెచ్చగొట్టి, హింసించి మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నేను సహించను."
"ఏం చేస్తావే?"
"పోలీస్ రిపోర్ట్ ఇస్తాను."
ఆ మాట విని జి.కె. పెళ్లున నవ్వాడు. "పోలీస్ రిపోర్టా?! అక్కడ నీ రంకు మొగుళ్ళెవరున్నారే పోలీసాఫీసర్లలో. నా నీడను చూసి జడుసుకుంటారు పోలీసులు. నిన్ను నేను నడిరోడ్డుమీద చంపినా పోలీసులు రారు."
"ఆ సంగతి నాకూ తెలుసు. మీ దొంగ వ్యాపారాలకి చేయూతనిచ్చి లంచం పుచ్చుకొనే పోలీసులు నాకు న్యాయం చేయరని తెలుసు. అది నా ప్రాధమిక చర్య మాత్రమే అవుతుంది. నేనుగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి వెళ్ళి నన్ను హెరాస్ చేస్తున్నారని రిపోర్టు చేస్తాను!" అంది ఆవేశంతో నాగమణి.
"చేసుకోవే బేవకూఫ్! నీ కెవ్వరూ సాయపడరు. ఈ జి.కె. శాసనం, శిలాశాసనం. కొమ్ములు తిరిగిన వాళ్ళని లోపల వేయించాను. కావాలనుకున్న రౌడీలని వీధుల్లో తిరిగేలా చేస్తాను. నీలాంటి గడ్డిపువ్వులు నాకో లెక్కలోకి రావు" అంటూ అరిచాడు జి.కె.