Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 5

   
    నాగమణి పళ్లు బిగించింది. నిజమే. జి.కె. ఎంత కర్కోటకుడో ఆమెకి తెలుసు. నిజంగానే అతను తనను చంపి పడేసినా దిక్కుండదు.

    అడిగేందుకు తనకు శక్తి చాలదు.

    ఆమె మనసు మొద్దుబారిపోతోంది.

    జి.కె. రాక్షసలీలలు తలచుకుంటుంటేనే వెన్నులోంచి చలిపుడుతుంది. ముఖంపైన చెమట......

    నిస్త్రాణంగా మంచం దగ్గరికి నడిచింది నాగమణి.

    బొడ్డులోపల కాలిన మంట చురచురలాడుతోంది.

    ఊరడించే వారు లేరు. జాలితో చేరదేసేవాళ్ళు లేరు.

    తన జీవితంపైన తనకే రోత పుడుతోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ధైర్యం చేసి పారిపోవటానికి భయంకరమైన పేదరికంలో వున్న తల్లీ తండ్రీ...... జులాయిలా తిరిగే అన్న.

    చిన్నతనంనుంచి పేదరికపు కబంథ హస్తాల్లో నలిగిపోయిన జీవితం తనేం పాపం చేసిందని దేవుడిలాంటి బ్రతుకిచ్చాడు.

    ఒక కోటీశ్వరుడికి రెండవ భార్య

    "అమ్మగారూ!" అంటూ నౌకర్లు ప్రేమగా, అభిమానంగా చూస్తారు. కానీ జి.కె. ముందు నోరెత్తలేని నిర్భాగ్యులు వారు.

    నవలల్లో చెప్పే కథలు విని కలలు కనేది. పేదరికాన్ని మరచిపోయి నవలల్లో చెప్పే రాజకుమారుడి గురించి కలలు కన్నది. శతకోటి సూర్యప్రభ సమాన తేజస్సుతో వెలిగిపోయే రాకుమారుని బిగి కౌగిలిలో నలిగిపోవాలనుకుంది. పంచకళ్యాణి గుర్రంపైన ఆకాశ హర్మ్యాలలో విహరించాలని ఉబలాటపడింది.

    నిజానికి విలాసవంతమైన జీవితమే!

    కానీ సుఖమేదీ?

    రాజకుమారుడు కావాలనుకుంది. కానీ రాక్షసుడిపాలిటబడింది తను.

    జి.కె. అనే రాక్షసుడి పైశాచికానందంతో ఆడుకొని హింసించే ఓ అందమైన బొమ్మ.

    తనకి విముక్తి లేదా!

    భోరుమని ఏడుస్తోంది నాగమణి.

    ఈ బాధలు భరించాల్సిందే.

    పేదరికంలోని బాధని చవిచూచి కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని ఆశపడింది. ఎప్పుడూ ఏడుపే! సుఖం తెలీదు.

    దేవుడు తన నుదుట ఏడుపే రాసాడు.

    ఈ బాధలు ఎంతకాలం అన్నదే ప్రశ్న.

    డబ్బు విరివిగా లేకపోయినా ఉన్నంతలో నీట్ గా వెళ్ళేది కాలేజికి.

    తను అందంగానే వుంటుంది. చాలా మంది స్టూడెంట్స్ తన వెంటపడ్డారు, ప్రేమలేఖలు వ్రాశారు.

    "బేబీడాల్" అని నిక్ నేమ్ పెట్టారు తన బాబ్ హెయిర్ చూసి.

    తను అవేమీ పట్టించుకోలేదు.

    పేదవాని కోపం పెదవికి చేటు.

    ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేయలేదు ఎవ్వరిమీదా..... ఎప్పుడూ.

    కారణం తెలుసు, తన వెనుక చేయూత నివ్వగల బలం ఎవ్వరికీ లేదు.

    తండ్రి త్రాగుబోతు.

    అన్న జులాయి, ఏదో కంపెనీలో మెకానిక్.

    తల్లి అసమర్దురాలు. ఆమెవల్ల ఏదీ కాదు.

    అందుకే కాలేజీలో ఏం జరిగినా ఇంట్లో చెప్పేది కాదు.

 Previous Page Next Page