Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 33


    ఒకప్పుడు కర్ణుఁడు ధర్మజ, నకుల, సహదేవులపైఁదలపడి తీక్ష్ణశరముల వారిని నొప్పించు చుండుటగని శల్యుఁడు రాధేయుని రథమును వేరొక తావునకుఁ గొనిపోయి పాండవులను రక్షించెను. దేవేంద్రదత్తమగు "శక్తి" యను నాయుధమును భీమనందనుఁడగు ఘటోత్కచునిపైఁ బ్రయోగింపఁ బురికొల్పి పార్థునకుఁ బ్రాణభయము లేకుండఁ జేసెను. సరిగా సంధించిన దానిని గుఱిదప్పినదని యసత్యమాడి కర్ణుని సర్పశరమ్మును వమ్ము గావించెను. శల్యుఁడిట్లు మనశ్శల్యమైతన్ను బాధించుచుండినను, విశ్వాస ద్రోహము చేసినను ధీరోదాత్తుఁడైన కర్ణుఁడు వానిప్రలాపములను బెడచెవినిబెట్టి పాండవ సైన్యమును నిజభుజా విక్రమాటోపమునఁ బరాభూతము నొనర్చుచు సంగ్రామ రంగమునం దెదురులేక విహరించెను.
    ఆనాఁడు రణరంగ మతి భయంకరముగ నుండెను. ఈనాఁటితో కురుపాండవ యుద్ధ "మటో యిటో" తేలిపోవలయునని తలపోయుచుండిరి. కర్ణుఁడు దుర్నిరీక్ష తేజోవిశేషముచేఁ బ్రళయకాల వైశ్వానరునివలెఁ బ్రకాశించుచు పాండవ బలంబులను మల మల మాడ్చుచుండెను. ముందు కూర్చుండి ముకుందుఁడు గుఱ్ఱముల నదల్చుచుండ గాండీవ ధారియై పాండవమధ్యముఁడు రాధేయునిపైఁ గవిసెను. కాని మహోజ్జ్వల దివ్యతేజఃపరంపరలతో దేదీప్యమానముగ వెలుఁగుచున్న కర్ణుని ముఖముచూచి పార్థుఁడు సమీపింపఁజాలకపోయెను. "బ్రతికియుండిన సమయము చూచుకొని జయము గాంచవచ్చును. మాధవా! రథము త్రిప్పు"మని మిట్టమధ్యాహ్నపు మార్తాండుని భంగి మండుచున్న చండాంశు నందను కనుబ్రామి రణభూమి నుండి రథము తరలించుకొని మరలిపోయెను.
    రెండు మూడు పర్యాయములు అర్జునేతరులగు పాండవులు తన బారి బడినను కర్ణుఁడు వారిని పట్టుకొని యవమానించి పంపెనేకాని మాతృ వాక్య పరిపాలకుఁడగుటచే సంహరింపలేదు. బ్రాహ్మణ శాపమున రథచక్రము క్రుంగిపోవుననియు, భార్గవుని శాపమున బ్రహ్మాస్త్రము సమయమునకు స్ఫురింపదనియు, నతనికి సందేహముగనే యుండెను. ఐనను ఖాండవదహన సమయమున సంప్రాప్తమైన నాగాస్త్రమును, దేవేంద్రుఁడిచ్చిన శక్తియును నర్జునుని సంహరించి తనకు జయశ్రీ కూర్పఁగలవని కర్ణుఁడు నమ్మియుండెను. కాని శల్యుని విశ్వాసద్రోహముచే నీ రెండును వ్యర్తమైపోయెను.
    చిట్టచివరకు రణమధ్యమున రాధేయుని రథచక్రము ధరణిలో గ్రుంగసాగెను. అప్పుడాతఁడు చేయునదిలేక పార్థునితో "అర్జునా! క్షణమాత్రము శరప్రయోగము నిలుపుము దైవ దుర్విపాకమునఁగ్రుంగియున్న నారథాంగమును పైకెత్తు కొనువఱకు యుద్ధము సేయకుము. నేలపై నున్న నన్ను రథముపైనున్న నీవు కొట్టుట రణధర్మము కాదు" అని పలికి రథచక్రమును భుజమున నానిపైకి లేవనెత్తబోయెను. సమస్త సముద్ర పర్వతారణ్య సమేతమగు భూమియంతయు నాలుగంగుళములు పైకి లేచినది గాని రథచక్రము మాత్రము రవ్వంతయుఁ గదలలేదు. అట్టి క్లిష్టదశలో నున్న కర్ణునిపై శ్రీకృష్ణప్రేరితుఁడై యర్జునుఁడు రణధర్మమునైనఁ దలంపక వాడి బాణములఁ ప్రయోగించెను. తుట్టతుదకు బార్థుఁడు భయంకరమగు నొక నిశితశిలీముఖముచే రాధేయుని నిహతుని గావించెను.
    మహాభారత యుద్ధము సమాప్తమయ్యెను. కౌరవ సైన్యము లన్నియుఁదమ రాజగు దుర్యోధనునితో రణభూమికి బలియైపోయెను. పాండవులను జయలక్ష్మి వారించెను. యుద్ధానంతరమున గంగానదిలో రెండు పక్షములలో మరణించిన బంధువులకుఁ బాండవులు తిలతర్పణముల నొసంగు చుండిరి. కుంతీదేవి శీఘ్రగమనంబునఁ గుమారులను సమీపించి "అందఱకు దర్పణముల విడిచితిరా!" యని ప్రశ్నించెను. "అందఱకు విడిచినా మమ్మా" యని ధర్మజుఁడు పలికెను. "మఱియొక్కరికి గూడ మీరు తిలతర్పణము నర్పింపవలయు"నని కుంతీదేవి గద్గదకంఠియై పలికెను. "వారి నామమేమో చెప్పిన నట్లే గావింతు" మని భీముఁడనెను.
    "కర్ణుడు" అని కుంతీదేవి గొంతెత్తి విలపించెను.
    "కర్ణుఁడా! అతఁడు సూతపుత్రుఁడు. అతనికేమి మేము తిలతర్పణ మిచ్చుట మేమి?" యని యర్జునుడు విస్మయముతోఁ బ్రశ్నించెను.
    "కాదుతండ్రీ! కర్ణుఁడు కౌంతేయుఁడే! ధర్మజుని వలె భీమునివలె అర్జునుని వలె కర్ణుఁడు కౌంతేయుఁడే" అని యామె విలపించుచుఁ బలికెను. పాండవులు చకితులైరి.


                                              * * * *

 Previous Page Next Page