Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 32


                                6


    కౌరవ పాండవ యుద్ధము నిశ్చితమయ్యెను. ఇరుపక్షములవారును యథోచితములగు సంగర సన్నాహముల సలుపుకొనుచుండిరి. ద్రుపద విరాట ప్రముఖ భూపతులు పాండవుల వైపునను, జయద్రథ భగదత్త సోమదత్తాది భూపాలురు కౌరవుల పక్షమునను తమతమ సేనావాహినులతోఁ గూడి రణక్షేత్రమగు కురుక్షేత్రమునకు వచ్చుచుండిరి. మద్రదేశాధీశ్వరుఁడైన శల్యుడు నకుల సహదేవులకు మేనమామ యగుటచే నొక యక్షౌహిణి సైన్యమును వెంటబెట్టుకొని పాండవుల పక్షమునఁ జేరుటకు వచ్చుచుండెను. మద్ర దేశాధిపతి యాగమన వృత్తాంతమును చారులవలనఁ దెలిసికొని దుర్యోధనుఁడాతఁడు వచ్చు మార్గమును శుభ్రము చేయించి సైన్యములు నివసించి సేద దీర్చుకొనుటకు వీలగు నట్లుగాఁజలివేంద్రములును సత్రములును నేర్పాటు గావించెను. ఎడనెడ వలసిన వస్తు సామగ్రిని సంపాదించుటకై యోగ్యులైన పరిచారికా జనంబులనుంచి తాను ప్రచ్చన్నుడై యుండెను. అప్పుడు మద్రేశ్వరుఁడీ మార్గాయాసాపనోదకములగు నుపచారములకు సంతోషించి "యిట్లు మనకు సమస్త సదుపాయముల సౌకర్యముల నేర్పాటు చేసిన వారెవ్వరో వారి యభీప్సితంబుల దీర్చెదను పిలువుఁ" డని పలికెను. సమయము కొఱకై వేచియున్న కురురాజు శల్యుని దరికేగి "నీ గౌరవము కొఱకై నేనే వీని నన్నింటిని సిద్ధపఱచితి"నని విన్నవించుకొనెను. శల్యుఁడానందముతో రాజును గౌరవించి "నీ వాంఛితం బెఱింగింపుము. దీర్తు" ననిన వెంటనే దుర్యోధనుడు మిక్కిలి యానందించి "మద్రరాజా! కురుపాండవ యుద్ధమున నీవు నాపక్షమున దయచేసి నాకు సాయము చేయవలయు"నని ప్రార్థించెను. సత్యసంధుడగు శల్యుడు మనస్సులో నిష్టము లేకపోయినను మాట తప్పఁజాలక వారికోరిక నంగీకరించెను.
    పై విషయములో దుర్యోధనుఁడు శల్యుఁగోరుకొనుటకుఁ గారణము గలదు. పాండవులలో వీరాధి వీరుఁడైన పార్థునకు శ్రీకృష్ణ సారథ్యము సంప్రాప్తించినది. అర్జునునకు ప్రతివీరుఁడైన రాధేయుని రథము నడుపగల సమర్థుఁడు మద్రరాజు తప్ప మఱియొక్కఁడు లేడని యతఁ డెఱుంగును. కనుకనే మార్గ మధ్యముననె మాయోపాయముతో తన కార్యమును సాధించుకొనెను.
    కురుక్షేత్రమునఁ గురు పాండవ యుద్ధ మారంభమయ్యెను. కౌరవుల పక్షమునఁ బదునొకండక్షౌహిణులును, పాండవుల పక్షమున నేడక్షౌహిణులును పరస్పర జయాభిలాషులై ప్రాణములను లెక్కచేయక పోరసాగిరి.
    మొట్ట మొదట భీష్ముఁడు సర్వసేనాధిపతియై కౌరవ సైన్యములను నడిపించెను. పది దినములు ఘోర సంగ్రామము గావించి చివరకు శంతను తనయుఁడు పాండవ పక్షపాతముచే తన మరణోపాయమును వారల కెఱింగించి యర్జునుని నిశితబాణ పరంపరలచేఁ గొట్టఁబడి శరతల్ప గతుండయ్యెను. భీష్ముఁడు తన్నర్ధరథులలో లెక్కించి యవమానించినాఁడను కష్టముతో భీష్ముండు సేనాపతిగా నున్నంత వఱకు సమరము సలుపనని కర్ణుడు ప్రతినబూనెను.
    గాంగేయుఁడు శరతల్ప గతుండైనాడఁని వినిపూర్వవైరమును మ్రింగుకొని రాధేయుఁడు పితామహుని సందర్శింపఁబోయెను. అట్లు భీష్ముని దరికేగి తదీయ పదకమలములకు ననుస్కరించి "ఆర్యా! నన్ను మన్నింపుడు. నాపై యాగ్రహమును వీడుడు! రణరంగ విహారమునకు నాకనుజ్ఞనిండ"ని ప్రార్థించెను. సురనదీసూనుడు సూర్యసూనుని సమీపమునకుఁ బిలిచి యచ్చటివారినెల్ల నావలకుఁ బొమ్మని పలికి యేకాంతముగా "నాయనా! నీపై నాకేమియుఁ గోపములేదు; నీయాధారము చూచుకొనియే దుర్యోధనుఁడు పాండవులతో యుద్ధమునకు సిద్ధమైనాడు. నీవు లేకున్న కురుపాండవ యుద్ధమేలేదు. కనుకనే నాకు నీపై కినుక. అందులకే నిన్నర్ధరథులలో జేర్చితిని. అదియునుగాక నీవు కుంతీ పుత్రుఁడవుగాని రాధాపుత్రుడవుగావు" అని యేదియో చెప్పఁబోవుచుండ కర్ణుఁడు భక్తిపూర్వకముగ హస్తములు మోడ్చి "పితామహా! ఈ దేవ రహస్యము నాకిదివఱకే తెలిసినది. తమకుఁ బాండవులపైగల పక్షపాతముచే నిట్లు పలికితిరిగాని నేనా యెంగిలికూటి కాసపడి నాజీవితమును రసాభాసము చేసికొని స్వామిద్రోహిని, రాజద్రోహిని, మిత్రద్రోహిని కాజాలను. నాయందు దయయుంచి నాకాజ్ఞ యిం"డని గాంగేయునిచే ననిపించుకొని సంగర రంగమ్మున వీరవిహార మొనర్పసాగెను.
    భీష్ముని యనంతరము కౌరవ సైన్యమునకు ధనురాచార్యుడైన ద్రోణుడు సేనాపతిగా నభిషేకింప బడెను. కొన్ని రోజులు యుద్ధము చేసిన తరువాత బాండవులు కుంభసంభవుని సైతము కపటోపాయమునఁ దుదముట్టించిరి. ద్రోణ వధానంతరము కర్ణుఁడు రారాజుచే నభ్యర్థితుఁడై సర్వసేనాధిపతిగా నభిషిక్తుఁడయ్యెను.
    లోకైక వీరుఁడగు రాధేయుఁడు మహాబల సంపన్నుఁడయ్యును, ననన్య సామాన్య ధనుర్విద్యావిశారదుఁడయ్యును, దివ్య మహిమా సంపన్నుడయ్యును, సంగ్రామ రంగమున స్వశక్తినంతయుఁ చూపజాలకపోయెను. పాప మా వీరుని హృదయము తనకు సంభవించిన దుర్భర దురంత దురదృష్టమును తలఁచుకొని మాటిమాటికిఁ గ్రుంగిపోవుచుండెను. బ్రాహ్మణశాపమును పరశురాముని ధిక్కారమును, పాంచాలి ప్రత్యాఖ్యానమును జ్ఞప్తికి వచ్చినపుడెల్ల నాతని యంతరంగము విషాద వ్యాకుల మగుచుండెను. ఆర్ద్రనేత్రాంచలములతో ననుగుదల్లి కుంతి తనముందు గద్గదకంఠియైపలికిన దీనాలాపములు స్మరించుకొని యాతని చిత్తము చీకాకగు చుండెను. భండనము గావించు నప్పుడు పాండునందనులను దర్శించినంతనే వీరు నా సహోదరులే గదా! యను కారుణ్య భావమాతని బావమును గలంచివైచుచుండెను. పాప మిఁక రాధేయుఁడు రణరంగమున నిరాటంకముగ నిస్సంకోచముగ నెట్లు విజృంభింపగలఁడు.
    అన్నిటికంటె సహజములగు వజ్రమయ కవచకుండలములు గోలుపోవుటచేఁ గర్ణుని దేహపటిమ యొకింతసన్నగిల్లెను. అన్ని విధముల దైవోపహతుఁడగు రాధేయునకు భరింపలేని బాధాకరమై నేఁడు సంగ్రామ రంగమున శల్యసారథ్యముకూడ సంప్రాప్తమయ్యెను.
    శల్యుఁడు పాండవ పక్షపాతి; నకుల సహదేవుల మేనమామ. సంగ్రామమునఁ గర్ణుని నిరుత్సాహ వాక్యములతో నిర్వీర్యునిగావించి నీకు సాయము చేతునని ధర్మజునకు వాగ్దానమొనర్చినాఁడు. ఇఁకనేమి! సమయము లభించినపు డెల్ల సారథిధర్మము సైతము స్మరింపక అతిరథవతంసుడగు నంగరాజును వ్యతిరేక సంభాషణములతో విసిగించి విముఖుని గావించుచుండెను. పార్థుని బాహువిక్రమము బహుభంగుల బ్రశంసించియు, ఘోషయాత్ర గోగ్రహణము మొదలగు సమయములందు రాధేయునకుఁ గలిగిన యపజయములను జ్ఞప్తి కెలయించియు, అర్జునుని హంసయనియు కర్ణుని కాకి యనియుఁ బోల్చి కట్టుకథలు పిట్టకథలు చెప్పియు, శల్యుడు ధర్మజున కిచ్చిన వాగ్దానమును నెరవేర్చుకొనుచుండెను. సారథియే పరపక్ష మవలంబించిన రథికుండెట్లు రణము చేయంగలఁడు?

 Previous Page Next Page