Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 28


    ఇట్లు కర్ణుడు మహాదాతయై తన భవనము ముందు దానగంట నొకదానినిఁ గట్టించెను. యాచకుఁ డెవఁడేని వచ్చి యాగంటను మ్రోగించిన వెంటనేవచ్చి యతని కోరికల తీర్చుచుండెను. రారాజగు దుర్యోధను డది చూచి తన సామంతరాజే యంతటి కీర్తి సంపాదించుచుండఁ దానేల యూరకుండ వలయునని తన మేడముందును నొక గంటను గట్టించి కర్ణుని విధముగనే దానము లొనర్పసాగెను.
    ఒక దినమున నొకానొక బ్రాహ్మణుడు వచ్చి తానొక మహాయజ్ఞము చేయుదుననియు దానికిఁ గావలసిన వంట చెఱకు దయచేయవలయుననియు, యజ్ఞారంభ సమయమున స్వయముగ వచ్చి యా కలపను బట్టించుకొని పోయెదననియు కర్ణుని బ్రార్థించెను. రాధేయుఁడు "సరే" యని వాగ్దాన మొసఁగిన పిమ్మట విప్రుఁడు దుర్యోధనుని వద్దకు బోయి పై విధమున విన్నవించుకొని యాతనిచే సైతము వాగ్ధానము నందుకొని వెడలిపోయెను.
    వర్షాకాలము వచ్చెను. ఎడతెరపిలేని జడివానలు మెండుకొనియెను. ఆ ముసురులోఁ బొయ్యిక్రిందికి లేక జనులు పలురీతుల బాధలు పడుచుండిరి. తైలసిక్తములగు వస్త్రాదులతో వంటలు గావించుకొనుచుండిరి. కట్టియలు కఱవై పోయెను. అట్టియెడఁ బూర్వపు బ్రాహ్మణుఁడు తిరిగివచ్చి దుర్యోధనుని కడకేగి మున్ను వాగ్దానము గావించిన వంట చెఱకు నర్థించెను దుర్యోధనుఁ డెంత గొప్పరాజైనను సమయముగాని సమయమున నన్నిబండ్ల కలప నెచ్చట నుండి కొని రాగలఁడు! అందుచే బ్రాహ్మణుని కసరి మఱియొక మాటు రమ్మని పంపివేసెను. అనంతరము ధరణీసురుఁడు కర్ణుని గృహమున కరిగి పూర్వపు వాగ్దానము నెరవేర్పవలయునని యభ్యర్థించెను. రారాజుకే సాధ్యముకాని కార్యము సామంత రాజుకు సాధ్యమగునా? కాని వదాన్య శిరోమణియగు రాధేయుఁడు వ్రతభంగ మెట్లాచరించును? అతఁడు కొంచెము కాల మాలోచించి తన దివ్య సౌధముల వైపు గనుంగొని కర్తవ్యమును నిర్ణయించుకొనెను. వెనువెంటనే భవనముల కాధారములగు దూలములకు బదులుగా బాణముల నమర్చి యాకలపను దీయించి వందలకొలది బండ్ల కెత్తించి వర్ష ధారలకుఁ దడియకుండ పైన మైనపు గుడ్డల గప్పించి బ్రాహ్మణుని వెంటఁబంపించెను. బ్రాహ్మణుడా బండ్లను దోలించుకొని దుర్యోధనుని సౌధము ముందుగాఁ బోవుచుండ దుర్యోధనుఁడు మేడపైనుండి యిది యంతయుఁ జూచి జరిగిన వృత్తాంతమును దెలిసికొని రాధేయుని యనుపమాన సాహసౌదార్యములకు నక్కజమంది ద్వారమున దానగంట కట్టుట కొక్క కర్ణుడే తగినవాఁడని తన గంటను దీయించి వేసెను.
    ఈ విధముగఁ కర్ణుని వదాన్యతను జాటు కథానిక లెన్నియో యున్నవి. కర్ణుని యౌదార్యము చిన్నలు పెద్దలు నాటిజను లాబాలగోపాలము వేనోళ్ళఁ బ్రశంసించుచుండిరి. తోడి రాజులకు సూతపుత్రుని యశోవైభవము కన్నుల గట్టుచుండెను.
    దుర్యోధనుఁడు కర్ణునివంటి యుత్తమోత్తమ పురుషునితో మైత్రి లభించినందులకు మిక్కిలిగఁ బొంగిపోవు చుండెను. భవిష్య ద్రణాంగణమునఁ బాండవ మధ్యముఁ డగు పార్థుని రాధేయుఁడు తప్పక జయించునని రారాజు మాటిమాటికిఁ దలంచుకొని సంతుష్టాంత రంగుడగుచుండెను.
    ద్రౌపదీ వివాహానంతరము పాండవులు లక్షాగృహమున భస్మముకాక బ్రతికియున్నారని మహారాజగు ధృతరాష్ట్రుడు తెలిసికొని లోకాపవాదమునకు భయపడి తమ్ముని పుత్రులను బిలిపించి యర్ధరాజ్యము నిచ్చి ఇంద్రప్రస్థ పురమును రాజధానిగాఁ జేసి ధర్మరాజునకుఁ బట్టాభిషేక మాచరించెను.
    పాండవులింద్రప్రవస్థపురమున సుఖముగా నుండునెడ నొక్కనాఁడు ఫల్గునుఁ డగ్నిదేవునిచేఁ బ్రార్థింప బడి ఖాండవవన దహనమునకు సాయము నొనర్చుచుండెను. ఆ సమయమునఁ దక్షకుని తనయుఁడగు నశ్వసేనుడను నాగ్బ రాజు మంటలోనుండి తప్పించుకొని పారిపోవుచుండుటఁ జూచి యర్జునుఁడు తన గాండీవముతో మోది వానినిఁ బరాభవింపగా నా సర్పము పగబట్టి యజ్ఞున ప్రతిద్వంద్వియగు కర్ణుని యంతికమునకుఁ బోయి శరణుజొచ్చి సంగరసమయమునఁ దన్ను నాగాస్త్రముగా నుపయోగించి ప్రయోగింపు మనియు నట్లు చేసిన నర్జునునిఁ దప్పక సంహరింప గలవనియు విన్నవించుకొనెను. అది మొదలు కర్ణుడు ఫల్గునుని వధించుటకై యా నాగాలాజును తన యస్త్రాగారమున నుంచి భక్తి గౌరవములతోఁ బూజలు గావించుచుండెను.
    ఒకానొక పర్యాయము కళింగదేశములోని రాజపురాధీశ్వరుడైన చిత్రాంగదుని పుత్రిక శుభాంగి యనునామె స్వయంవరము జరుగుచుండెను. మహారాజులనేకులు వచ్చిరి. కర్ణుని వెంటబెట్టుకొని దుర్యోధనుఁడు కూడ స్వయంవర మహోత్సవమున కరిగెను. ఆ సందర్భములో దుర్యోధనునకును మిగిలిన రాజులకును సంగ్రామము సంభవించెను. మహా వీరులగు జరాసంధాది భూపతులందఱు శుభాంగిని స్యందనముపై నిడుకొని పోవుచున్న సుయోధనునిఁజుట్టు ముట్టిరి. కర్ణుఁడు తన భుజబలమును ప్రకటించి రాజులనెల్ల జెల్లా చెద రొనర్చి తన మిత్రుఁడగు దుర్యోధనునకు సంతోషము గలిగించెను. ఆ సంగ్రామములోఁ గర్ణునకు జరాసంధుడోడిపోయి వేరొక సమయమున రాధేయుని ద్వంద్వ యుద్ధమున కాహ్వానించెను. కర్ణ జరా సంధు లిరువురు గొంతదనుకఁ బోరి రథములు దిగి శరశరాస నములఁ బరిత్యజించి ముష్టి యుద్ధమున కారంభించిరి. అందు సహజ కవచ కుండలాభి రాముఁడగు జరాసంధుని యంగసంధి భేదిల్లునట్లుకఠోర ముష్టి ఘాతముల నొప్పించెను. జరాసంధుఁడు తన శరీర సంధిని భేదించిన మహావీరుఁ డగు కర్ణుని పరాక్రమమునకు సంతుష్టుఁడై వానితో వైరము చాలించి మాలినీ పట్టణమును గానుకగా బహూకరించెను.
    పాండవ లింద్రప్రస్థమును బరిపాలించుచు రాజసూయ మను మహాయజ్ఞమును గావించిరి. అందు భీమార్జున నకులసహదేవులు నలుగురును శ్రీకృష్ణ సాహాయ్యముతో సలిపిన దిగ్విజయమునకు దుర్యోధనుఁడు తనలోఁ దాను మిక్కిలి యసూయ పడఁజొచ్చెను. తరువాత తన మేమమామయగు శకుని సాయముతోఁ బాండు నందనులను దురోదరమున నోడించి యడవులకుఁ బంపెను. కాని వారు సల్పిన దిగ్విజయమును దలంచుకొని, మఱియు వారొనర్చిన రాజసూయమును స్మరించుకొని, రారాజు హృదయము బాధపడసాగెను. అప్పుడు కర్ణుఁడు వారు నలువురు కలిపి చేసిన దిగ్విజయమును నేడొక్కఁడనే గావించి నీస్వాంతమునకు సంతోషము గూర్తునని దుర్యోధనునకు వాగ్దాన మొనర్చి దిగ్విజయునకు బయలుదేరెను. ప్రప్రథమముననే మహాబలసంపన్నుఁడును, పాంచాల దేశాధీశ్వరుడునగు ద్రుపదునిపై దండెత్తి యోడించి ధనకనకరత్న రాసులను గాప్పములుగా గైకొని, భగదత్తుని ప్రాగ్జ్యోతిష నగరముపై దాడిచేసి విజితుని గావించి పన్నులు గ్రహించెను.

 Previous Page Next Page