Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 19


    ప్రతాపుఁడు సోదరుని లేవదీసెను. అన్నదమ్ములిరువురు నానంద భాష్పములతో నాలింగన మొనర్చుకొనిరి. ఆ గాఢాశ్లేషములో నా సోదరుల హృదయము లైక్యమయ్యెను.


                                               6


    అది మొగలు చక్రవర్తి 'అక్బరు' కొలువుకూటము. అక్బరు సార్వభౌముఁడు సింహాసనమునధిరోహించియుండెను. మంత్రులు - సామంతులు - సరదారులు - రాజపుత్రవీరులు సభ నలంకరించియుండిరి. మహాకవి 'పృథ్వీసింహుఁ' డొక యాసనముపైఁ గూర్చుండి యుండెను.
    ఇంతలో నొక ద్వారపాలకుఁడరుదెంచి 'మహాప్రభూ! మహారాణా ప్రతాపసింహుని దూత యొకఁడు ద్వారముకడ వేచియున్నాఁ'డనెను.
    'ఏమి! ప్రతాపుని దూతయా? ప్రతాపుఁడు దూత నంపినాఁడా? మహారాణా ప్రతాపుఁడే' యను వాక్యములతో సభ యంతయుఁ బ్రతిధ్వనించెను.
    చక్రవర్తి యత్యాశ్చర్యము నందెను.
    రాజపుత్ర సరదారు లొకరి మొగ మొకరు చూచుకొనిరి.
    సార్వభౌముని యాజ్ఞానుసారము రాజపుత్రదూత నుచిత గౌరవముతోఁ బ్రవేశపెట్టిరి.
    'సార్వభౌమా! ఇదిగో ప్రతాపుని లేఖ' యని యా దూత దానిని చక్రవర్తి కిచ్చెను.
    'మహాకవీ! పృథ్వీసింహా! ఈ లేఖఁ జదువు' మని యక్బరు సార్వభౌముఁడు దానిని పృథ్వీసింహునకిచ్చెను.
    పృథ్వీసింహున కొడ లెల్లఁ జెమ్మటలు గ్రమ్మెను.
    అతఁడు లేఖ నందుకొని యిట్లు చదివెను. 'అక్బరు సార్వభౌమా! నేను నీ చక్రవర్తిత్వమున కంగీకరించితిని. ఆరు మాసములు విశ్రాంతి నీయఁ బ్రార్థన'
    విచార మగ్నుఁడైన పృథ్వీసింహుఁడు గుండె బిగఁబట్టుకొని కొంతవడి యోచించెను. అతఁడు 'అక్బరు చక్రవర్తిని గొల్చు చుండెనేకాని ప్రతాపునియెడ గాఢాభిమానము గలవాఁడు. అతనికేదో యూహ స్ఫురించెను. తోడనే వంచుకొనిన దల నెత్తెను. అక్బరు సార్వభౌముఁడు ప్రసన్నుఁడై యుండెను. సార్వభౌముని నోటినుండి యీ మాట లూడిపడెను.
    "ప్రతాపసింహా! ఈ నాటికి మా చక్రవర్తి నామమన్వర్థమైనది."
    "పొరపాటు, ఢిల్లీశ్వరా! ఇది మహారాణా ప్రతాపుని స్వహస్తలిఖితము గాదు. ప్రతాపుఁడెన్నఁడును పరులకుఁబాదాక్రాంతుఁడు గాఁడు - కాలేఁడు కాఁబోఁడు" అని పృథ్వీ సింహుఁడనెను.
    "కవిరాజా! ఏమంటివి? ప్రతాపుని దూత - ప్రతాపుని లేఖ- నిస్సందేహముగా నాతనిదే!"
    "కాదు ప్రభూ! దీనిని శత్రువు లెవరో సృష్టించినారు. ఇది నిస్సంశయముగా వంచన. దీనినిఁ బ్రతాపుఁడు లిఖింప లేదు."
    "సత్యమా? కవీంద్రా!" యనుచు నక్బరు వెల వెలఁ బోయెను.
    చక్రవర్తి యాదేశానుసారమునాఁటికి సభ ముగింపఁ బడెను; కాని పృథ్వీసింహుఁడు మాత్రము కదలలేదు. అతని నోటినుండి యప్రత్నముగా నీ మాటలు వెలువడెను:
    "హా! మహారాణా! ఎంత పనిఁ జేయఁ దలంచితివి? ఏకైక స్వతంత్ర భారత వీర కేసరివి. నీవుకూడ అక్బరునకు 'దాసోహ'మ్మన నెంచితివా? మాతృదేశ గౌరవమును విస్మరించితివా!!"


                             7


    ఆరావళీ పర్వత ప్రాంతారణ్యముల మహారాణా ప్రతాపసింహుఁడు మంత్రిసామంతాద్యనుచర వర్గముతో సమావేశమై యుండెను.
    అంతలో నొక రాజభటుఁ డేతెంచి యతనికి వందన మాచరించి 'మహారాణా! ఇదిగో! మహాకవి పృథ్వీసింహుఁడు తమకీ లేఖ నందఁజేయ నానతి యొసంగినా'డని యొక లేఖ నిచ్చెను. ప్రతాపుఁడు లేఖఁ దెఱచి యిట్లు చదివెను:
    "మహారాణా ప్రతాపసింహునకు నమస్సులు. వైరి గజసింహా! ప్రతాప సింహా! భారత భాగ్య విధాతా! నీవు సత్యధర్మ పరాయణుఁడవు - స్వాతంత్ర్య దేవతవు - కర్తవ్యదీక్షా దక్షుడవు - దిగంత విశ్రాంత యశస్కుఁడవు. భారత స్వాతంత్ర్య వైభవము నీ చేతులయం దున్నది. నిన్నుఁ జూచుకొని నీ స్వేచ్చాజీవిత యాత్రలఁ దలంచుకొని మేము తలలెత్తుకొని తిరుగఁగలగు చున్నాము. మే మెట్లైనను భ్రష్టులమై పోయినాము; కాని మారాజ పుత్రుడు సర్వ సర్వంసహా భర్తను సరకుగొనక స్వతంత్రుఁడై యుండెనని మాకదే యఖండ గౌరవముగా నున్నది. మాకదే యవ్యయానందముగా నున్నది. భారతభూమి కాశా జ్యోతులరగు మీరు మొగలు చక్రవర్తితో సంధిఁజేసికొన నెంచిరను విషయమును వినిన మమ్ము మేము విశ్వసింప లేకున్నాము. అద్వితీయ బాహుబాలశాలివై - అకుంఠిత దేశభక్త్యావేశుఁడవై - ఆత్మగౌరవ రక్షా దక్షుఁడవైన నీవు పర దాస్యమున కృంగీకృతిఁ బ్రకటించు చున్నావా? మహారాణా! నశించిపోయిన స్వాతంత్ర్య బీజములఁ దిరిగి మా మనః క్షేత్రములయందు మొలక లెత్తింపఁజేయు మహా నాయకుఁడవు నీవొక్కఁడవే యని నమ్మియుంటిమే. ఇంతదనుక ప్రచండ మార్తాండ తేజుఁడవై మాతృ దేశమును రక్షించితివే. నేఁడేల భారతదేశమును పాపపంకమునఁ ద్రోయఁ బూనితివి? మహారాణా! నీ వొక్కఁడవే స్వతంత్ర భారత స్థాపకుఁడవు. దౌర్బల్యము - అపజయము ఒక్కొక్కప్పుడు హృదయము నాక్రమింపవచ్చును. అంత మాత్రము చేతనే కింకర్తవ్యతా విమూఢుఁడవైపోవుట న్యాయమా? అపజయము విజయమునకు సోపానము వంటిది. ధైర్యము వహింపుము! ఉజ్జ్వల స్వతంత్రభావములు హృదయమున నిల్పుకొని దేశగౌరవము నిలఁబెట్టుము. ముందంజ వేయుము. 'విజయశ్రీ' వరించు సమయము మించిపోలేదు. లెమ్ము. వీర భారతస్వతంత్ర యోధుఁడవై విజృంభింపుము. నీ ధీరోదాత్తత్వమును లోకమున కెఱుక పఱుపుము. వీర శిరోమణీ! విజయీభవ!
                                                                                  ఇట్లు
                                                                           విశ్వాసపాత్రుడు
                                                                           పృథ్వీసింహుఁడు"
    రాణాప్రతాపుఁడుత్తేజితుఁడయ్యెను. అయోమయస్థితిలోఁ జేసిన దానికి పశ్చాత్తాపపడెను.
    "సలుంబ్రాధీశా! ఇంతకు మనము తిరిగి బలముల సమకూర్చుటకుఁ దగుధనము గావలెనుగదా! అది యెచట నుండి వచ్చును" అని మంత్రిని బ్రశ్నించెను.
    ఆయేడు - మేవాడ దేశస్వాతంత్ర్యోత్సవములఁ దిలకింప వచ్చిన 'భామాసాహి' చివ్వున లేచి "మహారాణా! ధనమున కెమి౧ ఇప్పుడే మీకుఁ గావలసినన్ని లక్షల సువర్ణ ఖండములఁ గైకొనుఁడు. పంపుదును. మేరు యథేచ్చగా వినియోగించుకొని 'మాతృదేశ' గౌరవమును రక్షింపుఁ"డనెను.
    సభలో 'మహారాణా ప్రతాపునకు జై' - 'మేవాడ దేశమాతకు జై' యను జయ జయ ధ్వనులు చెలరేగెను.    


                            8


    'భారతీ! భారతీ!'
    'అన్నా! అన్నా!'
    అమరసింహుని పిలుపు విని భారతి పరువెత్తుకొని వచ్చెను.
    'భారతీ! నేఁడు స్వాతంత్ర్య దినోత్సవము. మన రాజపుత్రసైనికులు నాయనగారి యాధిపత్యమున నప్రతిహతముగా పురోగమించి, మిగిలిన యెనుబదిమూఁడు దుర్గములను స్వాధీన పరచుకొనినారు. అక్బరు చేయునది లేక నాయనగారితో సంధి చేసికొనినాఁడు. రమ్ము, మేవాడ రాజసభకు పోవుద'మని అమరసింహుఁడు, కుమారి భారతిని వెంటఁబెట్టుకొని సభాస్థలి కరిగెను.
    అచట విజయ దుందుభులు మ్రోగుచుండెను. పుష్ప వర్షము కురియుచుండెను.
    ఆనంద డోలికలలో నుఱ్ఱూతలూగుచు రాజపుత్రులందరు 'భారత స్వాతంత్ర్యోద్యమమును' గనులపండువుగాఁ దిలకించుచుండిరి.
    'మహారాణా ప్రతాపసింహునకు జై'యను జయ జయ నినాదములు మిన్నంటెను.
    ఆ స్వతంత్రభాను దీప్తులే నేఁటి మన స్వతంత్ర భారతమునకు మహోత్తేజకరములు - సంతోషసంధాయకములు.
    'నమస్తే భారతమాతా!' యనుచు కుమారి భారతి సంతోషాతిశయముతో గంతులు వైచెను.


                        * * * *

 Previous Page Next Page