గజ ఈతగాళ్ళు వాళ్ళ అన్వేషణ కొనసాగిస్తున్నారు. మంత్రులు, ఏం.ఎల్.ఏలు, ఎం.పిలు కొంతసేపటికి వెళ్ళిపోయారు. మిగిలినవాళ్ళకి ఎం.ఆర్.వో. వెంకటేశ్వరరావు కాఫీలు ఏర్పాటుచేశాడు. అర్ధరాత్రి వేళ వచ్చి కాఫీ నీళ్ళు కూడా తాగకుండా శ్రమపడుతున్న శ్రీపతి మొదలైనవాళ్ళందరూ కాఫీ తాగగానే కొంచెం సేదతీరారు.
అర్చనకి తల పగిలిపోతోంది. కడుపులో తిప్పేస్తోంది. సడెన్ గా ఏదో అవుతున్నట్టనిపించింది. తల పట్టుకుని నిలబడ్డ అర్చనని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తన ఇంటికి పంపించాడు ఎం.ఆర్.ఓ. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే అక్షయ్ కుమార్ నుంచి ఇతర ప్రాంతాల పర్యటనకు పిలుపు వచ్చింది.
ఎం.ఆర్.వో భార్య "అయ్యో! మీకివన్నీ కొత్తున్నట్టుందండీ. పాపం కొత్తగా వచ్చారట కదా! కంగారు పడకండి. ఆరోగ్యం చూసుకోండి" అంటూ దయగా మాట్లాడింది.
అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అక్షయ్ కుమార్, శ్రీపతి వాళ్ళు అందరూ ఉన్న దగ్గరకు వచ్చింది.
నిర్విరామంగా, ఎలాంటి అలసట లేకుండా ప్రజలని రక్షించడమే తన బాధ్యత అన్నట్టు పనిచేస్తున్న శ్రీపతిని చూసి గవర్నమెంటు ఆఫీసులో పనిచేయరు అనే వాళ్ళని అప్పటికప్పుడు పట్టుకొచ్చి చూపించాలనిపించింది అర్చనకి. ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాడు ఇతను. అర్చన కళ్ళు మళ్ళీ చెమర్చాయి.
అక్కడినుంచి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించడానికిబయల్దేరారు. అర్చన దారి పొడుగునా కనిపిస్తున్న ఘోరం చూడలేక కళ్ళు మూసుకుంది.
సాయంత్రానికి కొంచెం శాంతించింది గోదావరి. కరాళ నృత్యం చేసిన ప్రకృతి కడుపు నిండిన కొండచిలువలా ప్రశాంతంగా ఉంది.
అప్పటిదాకా తుఫాను ప్రాంతాలు పర్యటించి వచ్చన అర్చన, అక్షయ్ కుమార్ పంచాయితీ ఆఫీసులో అందరితో సమావేశమయ్యారు. మిగతా ఆర్.డి.వోలు కూడా వచ్చారు. అందరూ కలిసి తరువాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వెంటనే రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలిచ్చాడు అక్షయ్ కుమార్.
వారం రోజులు ఊపిరి సలపని పనులు మీటింగులు, మీటింగులు హైదరాబాదులో సెక్రటేరియట్ లో మీటింగ్. కలెక్టర్ తో పాటు ఆర్.డి.వోలు, మిగతావాళ్ళు అందరూ కూడా వెళ్లారు. ఆర్ధిక నష్టం అంచనా వేయలేక పోతున్నారు. ప్రాణనష్టం అసలే తెలియడం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు.
అర్చన మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది.
నిద్ర సరిపోడం లేదు. రోజూ మహా అయితే నాలుగ్గంటలు మాత్రం నిద్రపోతోంది.
ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే ఐదారు కప్పుల టీ తాగింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య కాఫీ,టీలతో కడుపు నిండిపోతోంది. వేళకాని వేళలో భోజనం ఒక్కో రోజు బ్రేక్ ఫాస్ట్ చేయడమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటోంది లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది.
"మేడమ్ మీరు వెంటనే రావాల. ఏలేరు దగ్గర మళ్ళీ గండిపడింది. చాలామంది చనిపోయారు."
శ్రీపతి గాభరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చెయ్యి పట్టుకుని పరుగందుకున్నాడు. పరుగెడుతోంది అర్చన. దారినిండా రక్తఆటలు, నిర్జీవంగా పడి ఉన్న జనం, ఒరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదావరి. ప్రతి పాయ దగ్గరా విగతజీవులు.
"ఎవరిది?" అర్చన శ్రీపతి చెయ్యి విదిలించి పరిగెత్తింది. బురదలో మూడేళ్ళ బాబు బోర్లాపడి ఉన్నాడు.
"అయ్యో! ఎవరీ బాబు? ఒంటరిగా పడి ఉన్నాడు. శ్రీపతీ! త్వరగా రండి. ఎవరీ బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడివాడో, తల్లి, తండ్రి ఎవరో చూడండి. పాపం పసివాడు. శ్రీపతీ! మీకే చెప్పేది. బాబు మొహం కనిపించడం లేదు. తిప్పండి వెల్లకిలా తిప్పండి. బాబూ!" కెవ్వున అరిచింది అర్చన.
"మేడమ్ మేడమ్" ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది.
శ్రీపతి, మరి ఇద్దరు స్టాఫ్.
కుర్చీలోనే గాఢనిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కల. భయంకరమైన కల. కుర్చీలో సరిగా కూర్చోబోయింది. చేత కాలేదు. వడలిపోతోంది. ఆమె కుడిచెయ్యి వేళ్ళాడుతోంది. ఎడం చేతి మీంచి చీర చెంగు కిందకి జారుతోంది.
"మేడమ్ ఎలా ఉన్నారు?" శ్రీపతి స్వరంలో కంగారు.
అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు.
ఆమె ఎదురుగా ముగ్గురో, నలుగురో నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన.
ఎవరో అరిచారు. "నారాయణా! మంచినీళ్ళు తీసుకురా త్వరగా. ఎవరినన్నా లేడీస్ ని రమ్మను."
వెంటనే మంచినీళ్ళ గ్లాసుతో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర గబగబా వచ్చి వేళ్ళాడుతోన్న అర్చన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెని సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోంది.
"సార్! మేడమ్ కి ఫీవర్" కంగారుగా అంది చిత్ర.
"అరెరె పదండి. మేడమ్ ని ముందు సోఫాలో కాస్సేపు పడుకోబెడదాం. డాక్టర్ ని పిలుద్దాం. ఇంకెవరినన్నా లేడీస్ ని పిలవండి."
"ఫర్వాలేదు.... తప్పుకోండి, లేడీస్ వల్ల కాదు" శ్రీపతి ధైర్యంగా ముందుకు వచ్చి సుకుమారమైన అర్చనని రెండు చేతులతో ఎత్తి ఆవిడ యాంటీ రూములో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు.
"చిత్రగారూ! డాక్టర్ కి ఫోన్ చేయండి" అంటూ అర్చన చీర కుచ్చిళ్ళు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు.
కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావిడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. నూట మూడు డిగ్రీలుంది జ్వరం.
వెంటనే ఇంజక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది.
శ్రీపతి జేబులోంచి డబ్బులు తీసిచ్చి నారాయణని మెడికల్ షాప్ కి పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు.
అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటన్లు.....తల్లడిల్లిపోయింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందడం లేదని తన డబ్బులు లక్ష రూపాయలు ఖర్చుపెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది.