"నేను ధవళేశ్వరం దగ్గర ఉన్నాను. మీరు ఫోన్ తీయకపోతే నేను బయలుదేరి వచ్చేశాను."
వణికిపోయింది అర్చన.
భగవంతుడా! ఏమిటీ పరీక్ష? ఏం చేయాలో తోచలేదు.
"ఇప్పుడు ఏం చెయ్యాలి?" అడిగింది కంగారుగా.
శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడకి అసలే కొత్త. అప్పుడే ఈ సైక్లోన్. అనుభవజ్ఞుడు. కొంచెం అభిమానంగా అన్నాడు. "మీరేం కంగారు పడకండి. నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతనొచ్చే లోపల మీరు రెడీ అవండి. రెస్క్యూ టీమ్ కూడా వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి. సింహాచలం ఉంటాడు. జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని ఓ.కె."
"థాంక్యూ.... థాంక్యూ... మిస్టర్ శ్రీపతీ!" వణుకుతున్న చేత్తో రిసీవర్ పెట్టేసి, అరచేతులు రుద్దుకుని కళ్ళకద్దుకుంది.
ఏడు దాటుతుండగా వచ్చాడు సింహాచలం జీపు తీసుకుని.
అప్పటికే రెడీగా ఉంది అర్చన. మామూలు క్రేప్ సిల్క్ చీర కట్టుకుని, స్వెటర్ వేసుకుంది. తలకి మఫ్లర్ చుట్టుకుని వచ్చి జీపులో కూర్చుంది.
జీపు కదిలింది. అద్దాల కిటికీలోంచి అంతగా తెలియలేదు కానీ, వర్షం కుండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్డెక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదకు వచ్చింది. గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగైనా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయడం లేదేంటి స్వగతంగా అనుకుంటుంటే అన్నాడు సింహాచలం "అడావుడిగా ఉండి ఉంటాడమ్మా. మీరేం కంగారుపడమాకండి. మన సారుకి అలవాటే. ప్రతి ఏడూ ఈ తుఫాను అలవాటై పోయిందండి. ఆరు చాకచక్యంగా చూసుకుంటారు. మీరేం బాధపడబోకండి."
'ఏమో!' అనుకుంది మనసులో పైకి మాత్రం గాంభీర్యం చూపిస్తూ "ప్రాణ నష్టం జరక్కుండా ఉంటే చాలు సింహాచలం" అంది.
"ప్రాణనష్టం జరక్కుండా ఎలా ఉంటాదమ్మా" అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాను తాలూకు వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అతను చెప్తోంటే అర్చన కళ్ళముందు భయానక దృశ్యాలు కదలసాగాయి.
ఇంతలో సెల్ మోగింది.
అక్షయ్ కాలింగ్ అన్న అక్షరాలు చూసి గుండె ఆగినట్లైంది.
"గుడ్ మార్నింగ్ సర్" తడబడుతున్న స్వరంతో చెప్పింది.
"అర్చనగారూ! ఎక్కడున్నారు?"
"ధవళేశ్వరం వెళుతున్నాను."
"ఓ మైగాడ్ నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి. అక్కడి పరిస్థితి నాకు వెంట వెంటనే తెలియచేయండి."
"ఓకె సర్."
"ఓకె."
జీపు సడన్ గా ఆగడంతో ఉలిక్కిపడింది.
వందల మంది జనం హాహాకారాలతో నిండి ఉంది. వరద గోదావరి గర్జిస్తోంది. ఏం జరుగుతోందో ఆమెకేం అర్ధం కాలేదు.
"మేడమ్ దిగుతారా?" అడిగాడు సింహాచలం.
అర్చన తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దిగబోతుంటే సింహాచలం ఒక్క నిమిషం అంటూ టార్చిలైటు ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చి వేశాడు.
జీపు దిగి అడుగులో అడుగువేస్తూ వణుకుతున్న కాళ్ళతో నడుస్తోంటే సడన్ గా కాలు బురదలో ఇరుక్కుంది. కెవ్వుమంది అర్చన.
"జాగ్రత్తగా దిగండి" అంటూ చేయి అందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చేయి అందుకుని అడుగులో వేస్తూ కదిలింది.
* * * * *
ఎప్పుడూ పేపర్లో చదవడం, టీవీలో చూడటం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన బీభత్సాన్ని, గోదావరి ప్రళయతాండవాణ్ణి చూడని అర్చన అక్కడి పరిస్థితి చూసి నిలువెల్లా వకిణిపోయింది. గుట్టలు, గుట్టలుగా పడి ఉన్న శవాలు, ఎటు చూసినా ఆర్తనాదాలు, హాహాకారాలు శోకసముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఇళ్ళు, ఆస్తులు అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకి ఏడుపాగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నఅర్చనని ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు శ్రీపతికి, సింహాచలానికి.
"మేడమ్! ఊరుకోండి. మీరే అలా ఏడిస్తే ఎలా? ఊరుకోండి" అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే పదే చెప్పసాగాడు. అర్చన ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె చేతకావడం లేదు.
అప్పటికే అక్కడికి సర్పంచ్, ఎం.ఆర్.వో., లోకల్ ఎం.ఎల్.ఏ.లు, ఎం.పి.లు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితి గమనిస్తున్నారు. గజ ఈతగాళ్ళు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనని చూడగానే ముందు ఇంత ఆలస్యంగానా వచ్చేది అన్నట్టుగా ఒక చూపు చూశారు ఎం.ఎల్.ఏలు, ఏమ్పిగారు కూడా కాకపోతే కన్నీళ్ళతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు.
అక్షయ్ కుమార్ కి పరిస్థితి వివరిస్తూ, అతని రాకకోసం ఎదురుచూస్తూ శ్రీపతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎం.ఎల్.ఏ. ఈశ్వరరావు ఆమెతో చెపుతున్నాడు. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చన కెందుకో పేపర్లో చదివిన విషయాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడెప్పుడో చదివిన తుఫాను ఎప్పుడొస్తుంది? అనే కథ కూడా గుర్తొచ్చింది. వీళ్ళంతా ఈ పరిస్థితి కోసం ఎదురుచూస్తున్నారా బ్యాంకు అకౌంట్లు నింపుకోడానికి అనుకుంది.
వెంటనే తన ఆలోచన ఎవరన్నా పసిగట్టారేమో అని ఉలిక్కిపడింది. కాస్సేపటికి అక్షయ్ కుమర్ కూడా వచ్చేశాడు. ఎం.పి. అక్షయకుమర్ ఆలస్యంగా రావడం పట్ల ఉగ్రుడయాడు. అతను తను హైదరాబాద్ వెళ్ళానని, వార్త తెలిసిన వెంటనే బయల్దేరి వచ్చానని సంజాయిషీ ఇస్తున్నాడు.
వెంట వెంటనే బాధత కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తూనే సి.ఎస్.గారికి పరిస్థితి సమీక్షించాడు.
ముఖ్యమంత్రి, తదితర మంత్రులంతా సుడిగాలి పర్యటన చేశారు. అప్పటికప్పుడే ఐదుకోట్ల రూపాయల సైక్లోన్ ఫండ్ ప్రకటించారు ముఖ్యమంత్రి బాధితులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాట్లు చేశారు.
అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటేరియట్ ఫోన్ చేసి సి.ఎస్.తో, ఇతరులతో మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్ గా, ఎవరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి అద్భతంగా అనిపించాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనుకుంది.