విజయంలో అయినా, అపజయంలో అయినా.. మనసుకు ఊరట ఇచ్చే భగవద్గీత శ్లోకాలు ఇవి..!
.webp)
జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, గెలుపు ఓటములు, ఆందోళనలు మనిషి మనసును తరచూ అశాంతికి గురిచేస్తుంటాయి. ఏ చిన్న సమస్య ఎదురైనా సరే, మనసు తలకిందులై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి ప్రతికూల సమయాల్లో మనిషికి నిజమైన సాంత్వనను, ధైర్యాన్ని అందించే శక్తి ఆధ్యాత్మికతకు, ముఖ్యంగా భగవద్గీత బోధనలకు ఉంది. మన హిందూ సంస్కృతిలో భగవద్గీతను చాలా గొప్ప గ్రంథంగా భావిస్తారు. ఇందులో చెప్పిన ప్రతీ ఒక్క శ్లోకం మానవ జీవితానికి సరైన దారి చూపుతుంది. ముఖ్యంగా జీవితంలో గెలుపొందినప్పుడు పొంగిపోకుండా, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన కొన్ని శక్తివంతమైన శ్లోకాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఆ శ్లోకాల సారాన్ని , వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను వివరంగా తెలుసుకుంటే..
మన జీవితంలో ఎప్పుడూ ఒకేలాంటి పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది, మరికొన్ని సార్లు తీవ్రమైన నిరాశ ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతూ
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ్ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో.. "ఓ అర్జునా! యోగంలో స్థిరపడి , సుఖదుఃఖాలలో సమతుల్యంగా ఉంటూ, మమకారాన్ని విడిచిపెట్టి నీ కర్తవ్యాలను నిర్వర్తించు, ఎందుకంటే మనో సమతుల్యతే యోగం." అని చెబుతాడు.
అంటే.. మోహాన్ని విడిచిపెట్టి, విజయం అపజయం అనే రెండింటిలోనూ ఒకేలాంటి భావంతో ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించాడు. ఏ పని చేస్తున్నప్పుడైనా దాని ఫలితం మీదనే పూర్తిగా దృష్టి పెట్టకుండా, కేవలం మన ధర్మాన్ని నిస్వార్థంగా నిర్వర్తించడమే ముఖ్యం. పని విజయవంతమైనప్పుడు గర్వం తలకెక్కకూడదు, ఒకవేళ అనుకున్న ఫలితం రాకపోతే కుంగిపోకూడదు. ఈ రకమైన సమతుల్యతనే గీతలో యోగంగా అభివర్ణించారు. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
.webp)
ఇది కూడా చదవండి ఆదిశంకరాచార్యులు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాలు.. !
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపేపభ్యో మోక్షయిష్యామి మా సుచః॥
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, "కర్మల గర్వాన్ని అంతా వదిలిపెట్టి, నాకు శరణాగతి పొందు. నేను నిన్ను సకల పాపాల నుండి విముక్తి చేస్తాను, దుఃఖించకు." అని అంటాడు.
జీవితంలో ఎన్నో రకాల భయాలు, అనిశ్చితులు వెంటాడుతుంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన మనిషిని నిద్రపోనివ్వదు. ఇలాంటి సమయాల్లో మనిషికి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను చేకూర్చే మరో మహత్తర సందేశం భగవద్గీతలో కనిపిస్తుంది. జీవితంలో అన్ని రకాల అహంకారాలను, భయాలను విడిచిపెట్టి ఆ సర్వేశ్వరునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని శ్రీకృష్ణుడు బోధించారు. ఎప్పుడైతే మనిషి తన కష్టాలను, ఆందోళనలను దేవుడికి అంకితం చేసి ప్రశాంతంగా ఉంటాడో, స్వతహాగా అతని మనసులోని సకల భయాలు తొలగిపోతాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం కలుగుతుంది. గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించి బాధపడటం లేదా రేపటి భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం వల్ల వర్తమానాన్ని కోల్పోతాం. దానికి బదులుగా మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేస్తూ, అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగడమే నిజమైన జీవిత రహస్యం.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు కటక్ ఛంఢీ మాత ఆలయ రహస్యాలు తెలుసా.!






