కటక్ ఛంఢీ మాత ఆలయ రహస్యాలు తెలుసా.!

ఒడిశా రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో కటక్ చండీ మాత ఆలయం ఒకటి. మహానది ఒడ్డున ఉన్న కటక్ నగరానికి ఈ అమ్మవారే అధిష్టాన దేవత. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు, విచిత్రమైన నమ్మకాలు , విశిష్టమైన సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
అమ్మవారి ఆవిర్భావం..
అమ్మవారి విగ్రహం బయటపడిన విధానం వెనుక ఒక గొప్ప రహస్యం ప్రచారంలో ఉంది. పూర్వం కటక్ రాజా సంస్థానంలో గజపతి మహారాజు వద్ద హంసదేవ్ పండా అనే పురోహితుడు లేదా పూజారి ఉండేవారు. ఒక రోజు ఆయన పశువులను మేపుతూ నిద్రపోయిన సమయంలో అమ్మవారు ఆయన స్వప్నంలో ప్రత్యక్షమయ్యారట. తాను ఒక నిర్దిష్ట స్థలంలో భూమి లోపల ఉన్నానని, తనను బయటకు తీసి పూజలు చేయమని ఆదేశించారట. మరుసటి రోజు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అమ్మవారి విగ్రహంతో పాటు మహిమాన్వితమైన వస్తువులు లభించాయని, ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
దసరా వైభవం..
ఈ ఆలయంలో జరిగే దసరా లేదా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తే, కటక్ చండీ ఆలయంలో మాత్రం పదహారు రోజుల పాటు అనగా షోడశ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ పదహారు రోజులు అమ్మవారిని ప్రతిరోజూ ఒక్కో రూపంలో అలంకరిస్తారు. భువనేశ్వరి, శైలపుత్రి, కాళరాత్రి, మహాగౌరి, ఛిన్నమస్తా వంటి విభిన్న అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని ఈ విభిన్న రూపాల్లో దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
.webp)
సంధ్యా హారతి..
ఆలయ ప్రాంగణంలో ఉన్న సాంప్రదాయాలు కూడా ఎంతో నియమనిష్టలతో కూడుకుని ఉంటాయి. ఇక్కడ నిర్వహించే పూజా విధానాలు తంత్ర మరియు వైదిక పద్ధతుల సమ్మేళనంగా ఉంటాయి. అమ్మవారికి సమర్పించే భోగ్ లేదా ప్రసాదం తయారీలో చాలా శుచి శుద్ధతలను పాటిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే సంధ్యా హారతి సమయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. ఆ సమయంలో వచ్చే ధ్వనులు, మంత్రోచ్ఛారణలు ప్రతికూల శక్తులను పారద్రోలుతాయని నమ్మకం.
ఇది కూడా చదవండి నవగ్రహ దోషాలకు పరిష్కారం చూపే శైవ క్షేత్రం..!
కటక్ కు రక్షణ..
కటక్ నగరం ఎన్ని ఒడిదొడుకులకు గురైనా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా నగరానికి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకపోవడానికి అమ్మవారి కటాక్షమే కారణమని స్థానికులు విశ్వసిస్తారు. కటక్ నగర సరిహద్దులను కాపాడే గ్రామదేవతగా, భక్తుల ఇష్టదైవంగా చండీ మాత వెలుగొందుతోంది. అందుకే ప్రశాంతతను, అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని కోరుకునే భక్తులు నిత్యం ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుంటారు.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు గోవర్ధన పూజ ఇలా చేస్తే.. మీ పంట పండినట్టే..!
నెట్టికంటి ఆంజనేయస్వామి.. ఈ క్షేత్ర రహస్యం, ఇక్కడి స్వామి ఎలా వెలిశారు తెలుసుకోండి..!






