దాశరథిని చూపే దీపం వాల్మీకి!

 

 

బలం వున్న వాడ్ని చూసి వాడు బతికి వున్నంత కాలమే గౌరవిస్తారు! కాని, డబ్బున్న వాడు దాన, దర్మాలు చే్స్తే నాలుగు కాలాల పాటూ చెప్పుకుంటారు. అదే అధికారం వున్న వాడు జనానికి మంచి చేస్తే పది కాలాల వరకూ స్మరించుకుంటారు! కాని, ఒక మనిషి ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద పుట్టినా ఇప్పటికీ ఆయన గురించి ఎందుకని మాట్లాడుకుంటారు? మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ జాతిపై, ఈ దేశంపై, మొత్తం ప్రపంచంపై అయన ప్రభావం అలాంటిది! అంతటిది! 

 

హిందూ సంప్రదాయం ప్రకారం యుగాలు నాలుగు. ఇప్పుడు మనం నాలుగోదైన కలియుగంలో వున్నాం. 4లక్షల పై చిలుకు ఏళ్లు కలియుగం ప్రమాణం. అందులో 5వేలకు పైగా సంవత్సరాలు ఇప్పుడు పూర్తయ్యాయి. అయితే, కలియుగానికి ముందు 8లక్షల పైచిలుకు ఏళ్లుండే ద్వాపరం నడిచింది. అంతకంటే ముందు త్రేతా యుగం! అంటే త్రేతా యుగంలో రాముడితో పాటూ భూమ్మీద నడయాడిన వాల్మీకి తక్కువలో తక్కువ ఎనిమిది లక్షల ఏళ్ల పురాతనమైన వాడు! ఇంకా కొందరైతే వాల్మీకి పూర్తిగా వేరే మహాయుగంలోని మరో త్రేతా యుగంలో అవతారించాడని కూడా చెబుతారు!

 

నిజంగా వాల్మీకి లక్షల ఏళ్ల పురాతనమైన వాడా? ప్రస్తుతానికైతే సైన్స్ ఆ విషయాన్ని తేల్చే పరిస్థితి లేదు. అలాగని పురాణల్లో చెప్పింది నమ్మేస్తామా? అది కూడా సబబు కాదు. కాని, ఆది కవి అనిపించుకునే వాల్మీకి లక్షల ఏళ్లు పురాతనమైన వాడు కాకపోతే... వేల ఏళ్లు పురాతనమైన వాడు! ఇందులో సందేహం లేదు! అసలు ఆయనతో పాటూ ఈ భూమ్మీద జీవించిన... మరో  భాషలోని మరే కవి మనకు చరిత్రలో కనిపించడు! వాల్మీకి రామాయణ రచనా కాలం నాటికి మిగతా ప్రపంచం అంతా గాఢమైన నిద్రలో వుంది. ఆధునిక చరిత్రకారులు సైతం రామాయణం క్రీస్తు పూర్వమే జనంలోకి వచ్చిందని ఒప్పుకుంటారు. అప్పటి నుంచీ వాల్మీకి వేలాది ఏళ్లుగా భారతదేశాన్ని, భారతీయుల్ని ప్రభావితం చేస్తూనే వున్నాడు. రామాయణం రూపంలో మొత్తం ప్రపంచం పై కూడా తనదైన ముద్ర వేశాడు...

 

వాల్మీకి సంస్కృతంలో వెలువడిన తొలి శ్లోకానికి కారకుడు. ఆయన శోకంతో క్రౌంచ పక్షుల్ని చూసి చెప్పిన రెండు చరణాలే తరువాత శ్లోకం అయ్యాయి. 24వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణం అయ్యాయి. వాల్మీకి రామాయణం పాశ్చాత్యులకి తెలిసిన ఇలియాడ్ అనే అతి పెద్ద గ్రంథం కన్నా నాలుగు రెట్లు పెద్దది! అంతటి ఘనమైన వాంగ్మయం భారతీయుల స్వంతం!మారిపోయిన కాలంతో పాటూ మనుషుల బుద్దులు కూడా వక్రిస్తున్నాయి. అందుకే రాముడ్ని ప్రశ్నించే వారు, రావణుడ్ని గొప్పవాడని నెత్తిన పెట్టుకునే వారు ఎక్కువైపోయారు. వాళ్లందరికి వాల్మీకి రామాయణమే సమాధానం. ఆయన రాముడితో పాటూ, అదే కాలంలో, అదే రామ రాజ్యంలో జీవించే వాడు. తమసా నది తీరంలో వాల్మీకి ఆశ్రమం వుండేది. నిజానికి అరణ్య వాసంలో శ్రీరాముడు ఆయన వద్దకి వచ్చి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాడు. అందుకే, వాల్మీకి రామాయణం మిగతా ఎన్ని రామాయణాలు వున్నా ప్రత్యేకమే. ఎందుకంటే, అది ప్రత్య సాక్షి చూసి చెప్పిన మనోహర కావ్యం!

 

వాల్మీకి రామాయణం ఎంతగా ధర్మ ప్రబోధం చేస్తుందో అంతే గొప్ప సందేశం ఇస్తుంది ఆయన జీవితం. పుట్టుకతో బ్రాహ్మణుడైన వాల్మీకి కాలక్రమంలో బోయలతో కలిసిపోతాడు. తన ఆచారం, సంప్రదాయం అన్నీ వదిలి వేటా, దోపీడీలతో కాలం వెళ్లదీస్తుంటాడు. ఒకనాడు సప్తర్షులు అటుగా వెడుతుంటే వార్ని అడ్డగిస్తాడు. ఇక్కడ సప్తర్షులు కాకుండా నారదుడు అని కూడా కొన్ని పాఠాంతరాలు వున్నాయి. ఏది ఏమైనా వాల్మీకి మహర్షి అనుగ్రహం చేత రామ నామ ఉపదేశం పొందుతాడు. ఆయన చేస్తోన్న పాపాలు అతని భార్యా, పిల్లలు పంచుకోరని గ్రహించిన వెంటనే వాల్మీకిలో పరివర్తనం, పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు సప్తర్షులు లేదా నారదుడు ఇచ్చిన రామ మంత్రం జపిస్తూ వేలాది ఏళ్లు సమాధిగతుడు అయిపోతాడు. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఆ పుట్టల్లోంచి మళ్లీ బయటకొచ్చినప్పుడే రత్నాకరుడు కాస్తా వాల్మీకి అవుతాడు. సంస్కృతంలో వల్మీకం అంటే పుట్ట! 

 

ఒక దొంగగా వుండి రామ నామంతో తనని తాను శుద్ధి చేసుకుని రత్నాకరుడు కాస్తా వాల్మీకి అయ్యాడు. ఈ కథలో ఎంతో గొప్ప ఆశావాదం కనిపిస్తుంది. మనం ఎంత దారుణంగా సంసారంలో మునిగిపోయినా దేవుడి నామాన్ని పట్టుకుని పైకి లేవ వచ్చు! అంతే కాదు, రామ మంత్రం జపించి యావత్ రామాయణాన్నే రాయగల బ్రహ్మర్షి అవ్వొచ్చు! ఇదీ వాల్మీకి జీవితం అందించే సందేశం... 

 

వాల్మీకి తన జీవిత కాలంలో రామాయణం అనే యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అది ఇప్పటికీ నడుస్తూనే వుంది. ఎక్కడో ఒక దగ్గర వాల్మీకి రామాయణ పారాయణ, ప్రవచనం జరగకుండా అసలు వుంటుందా? అందుకే, ఈ విశ్వంలో శ్రీరాముడు , శ్రీమద్రామాయణం వున్నంత కాలం వాల్మీకి కూడా వుంటూనే వుంటాడు! ఎందుకంటే, వాల్మీకి ఒకప్పుడు పుట్టి, చచ్చిపోయే మామూలు మనిషి కాదు... రూపం దాల్చిన రామభక్తే వాల్మీకి! కాబట్టి రామభక్తి భూమిపై వున్నంత కాలం వాల్మీకి వుంటూనే వుంటాడు....  

 


More Purana Patralu - Mythological Stories