భారతీయ ఆధ్యాత్మికతలో శారీరక దృఢత్వ ప్రాధాన్యత!

ప్రతి మనిషిలో బాల్యం నుంచీ 'అహంకారం' అనేది అంతర్గతంగా ఉంటుంది. ఊపిరిలో ఊపిరై, రక్తంలో రక్తమై, శరీరం అణువణువునా ఈ అహంకారం నెలకొని ఉంటుంది. దాంతో ఏమీ తెలియకున్నా అన్నీ తనకే తెలుసన్న భావన కలుగుతుంది. తాను సాధించలేనిదేదీ లేదన్న అభిప్రాయం ఉంటుంది. అందరూ తనని అపురూపంగా, గొప్పవాడిలా చూస్తారన్న నమ్మకం ఉంటుంది. ఈ భావనలు పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ ఉంటాయి. బాల్యం నుండి పిల్లవాడితో సహా ఎదిగి పెద్దవవుతాయి. ఇటువంటి భావనలకు బాల్యంలోనే కళ్ళెం వేసి నియంత్రించకుంటే, పెరిగి పెద్దయిన తరువాత వ్యక్తిత్వ పరంగా ఆహాంకారం చాలా ప్రమాద స్థాయికి చేరుతుంది.  వ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేయగలుగుతాయి. వ్యక్తినే కాదు, సమాజంపై కూడా అత్యంత ప్రభావం చూపిస్తాయా భావనలు.

అహంకారాన్ని సంపూర్ణంగా అణిచేయటం అంతిమలక్ష్యం. కానీ ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. ఒక్క రోజులో తగ్గించేయటమూ కుదరదు. కాబట్టి ఆరంభం నుంచీ నియంత్రణలో ఉంచే ప్రయత్నాలు చేస్తూండాలి. వ్యక్తిపై భారతీయ ధర్మం విధించే విధ్యుక్తధర్మాలు, బోధించే అంశాలు ఆరంభం నుంచీ అహంకారాన్ని అదుపులో ఉంచుతాయి. తద్వారా ఉద్విగ్నతపై పట్టు సాధించే వీలు కల్పిస్తాయి.

'అప్యాయస్తు మమాగాణి నాణదక్షు, శ్రోక్రమధో జలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకలోద నిరాకరణ మస్త్యనిరాకరణం మే అస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్ ధర్మాస్తే మయి సస్తు తే 'మయి సన్తు'

ఇది విద్యార్థులు వల్లె వేసే శాంతిపాఠం. "నా అవయవాలు, సర్వేంద్రియాలు శక్తిమంతమవ్వాలి. ఈ సృష్టిసర్వం బ్రహ్మమయం. నేను బ్రహ్మాన్ని ఎన్నడూ నిరాకరించకూడదు. బ్రహ్మ నన్నెడూ నిరాకరించకూడదు. అసలు నిరాకరణా అన్న ఆలోచనే ఉండకూడదు. కనీసం నా వైపు నుంచి ఎటువంటి నిరాకరణ ఉండకూడదు. ఉపనిషత్తు ప్రకారం వ్యక్తికి ఉండవలసిన సద్గుణాలన్నీ నాలో ఉండాలి. నేను ఆత్మ పైనే ధ్యానమగ్నుణ్ని కావాలి" ఇదీ ఆ శాంతి పాఠం యొక్క అర్థం. 

ఇక్కడ భారతీయతత్త్వచింతనలో భౌతిక, ఆధ్యాత్మికాల మధ్య సమన్వయ సాధన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

వ్యక్తి బలంగా ఎదగాలి. అవయవాలు, ఇంద్రియాలు శక్తిమయం కావాలి. ఈ ఆలోచన పసితనం నుంచే కలిగిస్తున్నామన్నమాట. ప్రస్తుతం మనం బాల్యంలో శారీరక పరిశ్రమపై దృష్టి పెట్టం. వ్యాయామానికి ప్రాధాన్యాన్నివ్వం, చదువు, మార్కుల పైనే దృష్టి. ఆటలాడి పిల్లవాడు డబ్బు సంపాదించేయాలన్న ఆశ ఉన్నా, హోమ్ వర్క్ పాఠాలు బట్టీ పట్టటమే ప్రధానాంశం. దానికి తోడు జీవితంలోని ఉద్విగ్నత, రకరకాల అనారోగ్యకరమైన తిండి పదార్థాలు బాల్యంలోనే వ్యక్తిని శారీరకంగా బలహీనం చేస్తున్నాయి. అంటే ఏదైతే అవయవాలు, ఇంద్రియాలు బలంగా, శక్తిమంతమవ్వాలి అన్న ఆలోచన ఉందో ఆ ఆలోచన మనం ఇవ్వకముందే జలహీనం అయిపోతున్నా మన్నమాట.

ఇందుకు భిన్నంగా ఊహ తెలిసినప్పటి నుంచీ శక్తిమంతుడుగా ఎదగాలన్న ఆలోచన పిల్లలలో కల్పించాలి. రోజూ ఉదయం లేవగానే తాను శారీరకంగా దృఢంగా ఎదగాలి అన్న ఆలోచన పసితనం నుంచీ వ్యక్తిలో స్థిరపడిందంటే, అతడి దృష్టి ఆ వైపు మళ్ళుతుంది. ఒకవేళ ప్రకృతి అతనిపై ఎటువంటి పరిమితులు విధించినా వాటిని మించాలన్న పట్టుదల కలుగుతుంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఆరంభం నుంచీ శారీరకస్వస్థతను సాధించాలన్న ఆలోచన బీజాన్ని వ్యక్తిలో నాటటం. ఇది భారతీయ అధ్యాత్మికతలో భారతీయ వ్యక్తిత్వ వికాశంలో ఒక ప్రధానాంశం.

                                       ◆నిశ్శబ్ద.

 


More Aacharalu