తిరుమలలో కొప్పెర అంటే ఏమిటి?

 

కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం.  తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు.  తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెరవాళ్ళని, వాళ్ళు నివశించే పల్లెకు "కొప్పెరవాండ్ల పల్లి'' అనే పేరు వచ్చిందంటారు. శ్రీనివాసా మంగాపురం వెళ్ళేదారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది.

 

Special Article on Lord Venkateswara swamy Koppera the Hundi the Devotees offer Money and Jewellery

హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును "పరకామణి'' అంటారు.ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని "తోకముల్లె'' అని అంటారు.  కొప్పెరలో మనడబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.

 

 


More Venkateswara Swamy