మీకూ స్ట్రాబెర్రీ లెగ్స్ ఉన్నాయా?? ఇదిగో పరిష్కారం!
.webp)
స్ట్రాబెర్రి లెగ్స్ అంటే అదేదో స్ట్రాబెర్రి ఫ్రూట్ లాగా ఎర్రగా, అదే ఆకారం లో కాళ్ళు ఉంటాయని కాదు. స్ట్రాబెర్రి పండుకు పైన ఉన్నట్టుగా చిన్న చిన్న మచ్చల్లాంటి మొటిమలు కాళ్ళ చర్మం మీద చోటు చేసుకుంటాయి. ఇవి దురద పెడుతూ చాలా చికాకు కలిగిస్తాయి కూడా. ముఖ్యంగా కాస్త మోకాలి వరకు లేదా ఇంకా పైకి ఉన్న దుస్తులు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సమస్య ఉన్నవాళ్ళు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది అంటే....
చర్మం కండిషన్ సరిగ్గా లేనప్పుడు లేదా అవాంఛిత రోమాలు తొలగించడానికి ఉపయోగించే రేజర్ సరైనది కానప్పుడు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ స్ట్రాబెర్రీ లెగ్స్ చోటు చేసుకుంటాయి. ఇంకా ఈ సమస్య రావడానికి కొన్ని కారణాలు ఏమిటంటే….
జెనిటిక్స్ ఈ సమస్యకు కారణం అవుతుంది. ఇది ఆటోసోమల్ డామినెంట్ తో సంబంధం కలిగి ఉండవచ్చు. ఆ కారణంగా ఈ సమస్య వస్తుంది.
ఊబకాయం అనేది ఇలాంటి సమస్యకు కారణం అవుతుంది. ఈ స్ట్రాబెర్రీ లెగ్స్ సమస్యను సైన్స్ పరంగా కెరాటోసిస్ పిలారిస్ అని అంటారు. ఇది శరీర పరిమాణం పెరగడాన్ని బట్టి ఎదురవుతుంది. లావుగా ఉన్నవారిలో ఈ సమస్య ఎదురవ్వడం గమనించవచ్చు.
PCOD అనేది మహిళల్లో సాధారణంగా కనబడుతున్న సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. దీనివల్ల ఈ సమస్య ఎదురవుతుంది.
చర్మ తత్వాన్ని బట్టి కూడా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వారిలో తొందరగా వాతావరణానికి మార్పులు చోటుచేసుకుంటాయి. చలికి పుట్టే దురద వాటి నుండి రాషెస్ రావడం మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు.
మధుమేహం ఉన్నవారిలో చర్మం తొందరగా ప్రభావానికి గురవుతుంది. ఇది కోలుకోవడం కూడా కాస్త కష్టమే. దీని వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మహిళలు రెగులర్ గా ఫాలో అయ్యే స్కిన్ కేర్ లో భాగం వాక్సింగ్. ఈ వాక్సింగ్ వల్ల ఈ సమస్య రావడం, వచ్చిన వాళ్లకు దాని ప్రభావం పెరగడం జరుగుతుంది.
ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలు!!
స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు నీటిలో తడవకూడదు. అలాగే స్నానానికి ఉపయోగించే సోప్ లేదా బాడీ వాష్ వంటివి గాఢత ఎక్కువ ఉన్నవి ఉపయోగించకూడదు. అతి చల్లని లేదా అతి వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. చర్మాన్ని రబ్ చేయడం, గట్టిగా రుద్దడం, సున్నితత్వం కోల్పోయేలా స్క్రబ్ చేయడం, ఫ్యూమిస్ స్టోన్ వాడటం మానుకోవాలి.
స్నానం తరువాత శరీరాన్ని మెత్తని పొడి బట్టతో తుడుచుకోవాలి. చర్మం మీద తేమ ఇంకా ఉన్నట్టే మాశ్చరైజర్ లాంటివి ఉపయోగించకూడదు.
చుట్టూ వాతావరణాన్ని పొడిగా కాకుండా తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉంటేనే చర్మం వాతావరణ ప్రభావానికి గురవ్వదు.
చర్మానికి అసౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవడం ఆపాలి. అలాగే అవాంఛిత రోమాలు తొలగించడానికి ఆరోగ్యమైన పద్ధతులు ఉపయోగించాలి. మెత్తగా ఉండే నూలు దుస్తులు వాడటం మంచిది. వాతావరణానికి తగ్గట్టుగా చర్మ రక్షణ పాటించాలి.
చర్మ తత్వాలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు సరిపడవు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలర్జీలను కొనితెచ్చుకుంటే సమస్యను వెంటబెట్టుకొచ్చినట్టే.
పైవన్నీ పాటిస్తే మహిళలను చికాకు పెట్టే స్ట్రాబెర్రీ లెగ్స్ మటుమాయం అవుతాయి.
◆నిశ్శబ్ద.



