మహిళలకు అద్భుత శక్తినిచ్చే కెఫిన్ ఫ్రీ డ్రింక్స్ ఇవే…

నిరంతరం శరీరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ మార్పులు కాలంతో మాత్రమే జరిగేవి కావు. తీసుకునే ఆహారం, తాగే ద్రవపదార్థాలు మొదలైనవాటి వల్ల కూడా మార్పులు జరుగుతాయి. తీసుకునే ఆహారంలో యాంటీ ఏజింగ్ కారకాలు ఎక్కువగా ఉంటే వారు వయసు పెరిగినా యవ్వనంగా ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కాఫీలు, టీలు విరివిగా తీసుకోవడం వల్ల అందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అంతేనా ఇది అలవాటైపోతే వ్యసనంలా మారుతుందని కూడా అంటారు. అందుకే కెఫిన్ కు దూరంగా ఉండాలని, దాన్ని ఓ లిమిట్ లో ఉంచేయాలని చెబుతారు.
మొదట కెఫిన్ ఎందుకు ఎక్కువ తీసుకోకూడదు అంటే…..
కెఫిన్ కార్టిసాల్ స్థాయిలను (ఇది ఒత్తిడి హార్మోన్) పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను పెంచుతుంది. అంతే కాదు ఇది మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది. అడ్రినల్ గ్రంథుల మీద ప్రభావం చూపిస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేయడంలో కెఫిన్ పాత్ర చాలా ఉంటుంది. అందుకే కెఫిన్ కు దూరంగా ఉండాలని చెబుతారు.
మహిళలు వారికి కావలసిన పోషకాలు భర్తీ చేసుకుంటూ కెఫిన్ లేకుండా, శరీరానికి శక్తికి సమకూర్చే డ్రింక్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటి డ్రింక్స్ ఇవే….
సత్తు షర్బత్!!
వినడానికి కాస్త కొత్తగా ఉంటుంది. ఇది బీహార్ రాష్ట్రం ఫెమస్ డ్రింక్. మంచి ఎనర్జీ దీని సొంతం. సత్తు షర్బత్ కోసం ప్రత్యేకంగా శనగపిండిని తయారు చేస్తారు.
దీనికి కావలసినవి:-
1 గ్లాసు నీరు,
2 టేబుల్ స్పూన్లు సత్తు పొడి,
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి,
రుచికి నల్ల ఉప్పు,
1/2 నిమ్మరసం
పుదీనా ఆకులు కొన్ని.
తయారీ విధానం:-
ఒక గ్లాసులో పైవన్నీ వేసి అందులో నిమ్మరసం జతచేసి బాగా కలపాలి. ఇది కాస్త చిక్కగా జావ లాగా ఉంటుంది. మంచి ఎనర్జీ ని అందిస్తుంది.
మ్యాంగో స్మూతీ!!
తక్షణ శక్తిని అందించే మ్యాంగో స్మూతీలో పోషకాలు, ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది క్రీమ్ లాగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కూడా సమృద్ధిగా ఉంటుంది. కొద్ధి సమయంలో తయారు చేసుకోగల మ్యాంగో స్మూతీని ఇష్టపడని వారు ఉండరు.
కావలసినవి:-
మామిడి పండు
పాలు
డ్రై ఫ్రూట్స్
పైవన్నీ కలిపి మిక్సర్ లో స్మూత్ గా గ్రైండ్ చేస్తే మ్యాంగో స్మూతీ సిద్ధం.
కోకొనట్ ఎనర్జీ డ్రింక్!!
సులభంగా ఇంట్లో తయారుచేసే ఎనర్జీ డ్రింక్ ఈ కోకొనట్ డ్రింక్. ఇది అడ్రినల్ వ్యవస్థకు సహకస్తుంది, హార్మోన్ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవక్రియ పనితీరు, రక్తపోటు ఒత్తిడి ప్రతిస్పందనకు దోహదం చేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ లు, విటమిన్ సి, పొటాషియం, సోడియం మరియు ప్రోటీన్ లతో నిండి ఉంటుంది, తక్షణ శక్తి అవసరమైనప్పుడు ఇది ఉత్తమ పరిష్కారం.
కావలసిన పదార్థాలు:-
1/2 కప్పు కొబ్బరి నీరు,
1 స్కూప్ కొల్లాజెన్ పౌడర్ (ఆప్షన్),
చిటికెడు పింక్ హిమాలయన్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్
1/4 టీస్పూన్ టార్టార్ క్రీమ్.
పైవన్నీ ఒక గాజు కంటైనర్లో వేసి షేక్ చెయ్యాలి.
బనానా కర్డ్ షేక్!!
ప్రోటీన్-రిచ్ పదార్థాలతో నిండి ఉన్న ఈ డ్రింక్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. పైగా అరటిపండు అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండు, అంతేనా అన్ని రకాల వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది.
కావలసిన పదార్థాలు:-
పెరుగు,
అరటిపండు,
ఖర్జూరం
ఇతర డ్రై ఫ్రూట్స్
1 టేబుల్ స్పూన్ తేనె.
అన్ని పదార్థాలను మిక్సర్ లో వేసి గ్రైండ్ చెయ్యాలి. ఇది చేసుకోవడం చాలా సులభం.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది, జీర్ణక్రియలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇంకా చర్మానికి చాలా మంచిది. అరటిపండులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, పోషకాల యొక్క పవర్ హౌస్ గా ఇది పిలవబడుతుంది. పొటాషియం మొదలైన వాటికి మంచి మూలం. ఇక డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఉప్పు నీరు!!
వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఉప్పు నీరు శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. రోజులో సాధారణంగా పనులు చేసినప్పుడు, ఏడ్చినప్పుడు, మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు ఖనిజ లవణాలు కోల్పోతు ఉంటాం. అంతే కాకుండా ఒత్తిడి వల్ల సులభంగా క్షీణించే ఖనిజాలలో ఉప్పు కూడా ఒకటి. ఇది అడ్రినల్ గ్రంధి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైనా కాఫీ తాగాలని అనిపించినప్పుడు నీటిలో చిటికెడు ఉప్పు వేసి తాగి పరిశీలించుకుంటే ఆ భావం మారిపోతుంది. అందుకె అప్పుడప్పుడు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగడం మంచిదే.
పైన చెప్పుకున్న అయిదు డ్రింక్స్ కెఫిన్ లేనివి. శరీరానికి గొప్ప శక్తిని అందించేవి. మహిళలు వీటిని తీసుకుంటూ ఉంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.
◆నిశ్శబ్ద.



