మరణించిన మదాలస మళ్లీ ఎలా పుట్టిందో తెలుసా?


పిల్లలకు అందమైన పేర్లు పెట్టుకోవాలని చాలా తాపత్రయ పడుతుంటాం. ఒక తండ్రి అలాగే తన బిడ్డల కోసం వెతికి వెతికి, ఆలోచించి మరీ మంచి పేర్లు పెట్టాడు. అయితే ఆ పేర్లు విని ఆయన భార్య పక్కున నవ్వింది. అవన్నీ పనికిరాని పేర్లని తేల్చేసింది. ఆత్మ స్వభావానికీ, ఆ పేర్లకూ పొత్తు కుదరడం లేదని తేల్చి చెప్పింది. భారత పురాణ ఇతిహాసాల్లో జ్ఞానమూర్తిగా ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకొన్న ఆ శ్రీ మూర్తి మదాలస జోలపాటలతోనే కన్నబిడ్డలకు ఆత్మతత్త్వాన్ని చల్లగా అందించి, తన కడుపున పుట్టిన పిల్లలు మళ్ళీ గర్భనరకం అనుభవించకూడదని, మహా తత్త్వజ్ఞానులుగా  వాళ్ళను రూపొందించిన ఆదర్శ మూర్తి ఆమె. అలాంటి మదాలస మన తల్లులందరికీ ఆదర్శం కావాలి. 


గంధర్వ రాజైన విశ్వావసు కుమార్తె మదాలస. ఆమె రూపవతి, యౌవనవతి, గుణ వతి. భూలోకంలోని శత్రుజిత్తు మహారాజు కుమారుడైన ఋతధ్వజుణ్ణి ఆమె వివాహమాడింది. ఋతధ్వజుడికి  కువలయాశ్వుడనే పేరు కూడా ఉంది. ఋతధ్వజుడు, మదాలస కొన్నేళ్ళు సుఖంగా సంసారం సాగించారు. అయితే, వారి పట్ల విధి క్రూరంగా వ్యవహరించింది.


వనవాటికల్లో నివసిస్తున్న మహర్షులను కొందరు  రాక్షసులు తీవ్రంగా పీడించసాగారు. ఆ ఋషి పుంగవులను కాపాడాల్సిందిగా శత్రుజిత్తు మహారాజు తన కుమారుడైన ఋతధ్వజుణ్ణి ఆదేశించాడు. దాంతో, ఋతధ్వజుడు ఆ పని మీద వెళ్ళాడు. కాగా, అక్కడ అరణ్యంలో ఓ రాక్షసుడు మారువేషంలో వచ్చి, మోసకారి మాటలతో ఋతధ్వజుణ్ణి అక్కడే ఉండేలా చేసి, తాను రాచనగరుకు వెళ్ళాడు. అక్కడ శత్రుజిత్తు మహారాజును కలిసి, ఆయన కుమారుడైన ఋతధ్వజుడు రాక్షసుల చేతిలో మరణించాడని అబద్ధం చెప్పాడు. భర్త మరణవార్త  వినగానే మహాసాధ్వి మదాలస సైతం ప్రాణాలు విడిచి పెట్టింది. ఋతుధ్వజుని తల్లితండ్రులైన మహారాజు, మహారాణి మాత్రం ఎలాగో గుండె దిటవుచేసుకొని,  దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ప్రయత్నించారు. ఋషులను కాపాడే ప్రయత్నంలో ఋతధ్వజుడు వీరమరణం పొందాడని, భర్త చనిపోయాడని తెలియగానే ప్రాణాలు వదలడం ద్వారా మదాలస పతివ్రతగా నిలిచిపోయిందని వారు తమను తాము సమాధానపరుచుకున్నారు. 


ఇలా ఉండగా, ఋతధ్వజుణ్ణి మోసపుచ్చి అడవిలోనే ఉంచి వచ్చి, అతను మరణించాడంటూ నగరంలో అబద్ధ ప్రచారంచేసిన రాక్షసుడు, తిరిగి అడవికి వెళ్ళాడు. ఋతధ్వజుడు వెళ్ళిపోవడానికి అనుమతినిచ్చాడు. రాచనగరుకు తిరిగి వచ్చిన ఋతధ్వజుడికి జరిగిన కథ తెలిసింది. మదాలస ప్రాణాలు వదిలిపెట్టిందన్న విషయం అతణ్ణి విపరీతంగా బాధించింది. భార్యకు తర్పణం విడిచి, యథావిధిగా ఉత్తర కాలక్రియలు చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ పెళ్ళంటూ చేసుకోకుండా, ధర్మబద్ధంగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు.


 ఋతధ్వజుడి గుణ గణాల కారణంగా నాగలోకానికి చెందిన ఇద్దరు రాకుమారులతో అతనికి స్నేహం కుదిరింది. ఆ ఇద్దరు రాకుమారులూ నాగలోకాధిపతి అయిన అశ్వతరుని కుమారులు. భూలోకానికి తరచూ వస్తూ వెళుతుంటారు. ఆ ఇద్దరు కొడుకుల వల్ల ఋతధ్వజుడి కథ, అతని శీలసంపద గురించి నాగరాజైన అశ్వతరుడు విన్నాడు. జరిగినది తెలుసుకొని చలించిపోయాడు. ఋతధ్వజుడికి ఏదైనా సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. తపస్సుచేసి, ఆపైన పరమశివుణ్ణి ప్రార్థించి, మదాలసకు మళ్ళీ ప్రాణం వచ్చేలా చేశాడు. పరమేశ్వరుడి వరప్రసాదం వల్ల మరణించినప్పటి వయసుతో, పూర్వరూపంతో మదాలస ఇప్పుడు నాగరాజైన అశ్వతరుడికి కుమార్తెగా జన్మించింది. నాగలోకాధిపతి కోరిక మేరకు ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉండేలా పరమ శివుడు అనుగ్రహించాడు. అంతేకాక, యోగశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి, ఆమె మహాయోగిని అయ్యింది.


దాంతో, ఇప్పుడిక మదాలస ప్రతి విషయాన్నీ భిన్నమైన దృక్పథంతో చూడగలుగుతోంది. తనతో సహా సమస్త ప్రపంచమూ మిథ్య అని ఆమె గ్రహించింది. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మజ్ఞానం ఆమెకు సిద్ధించింది.  ఋతధ్వజుణ్ణి రప్పించి, మదాలసను అతనికి అప్పగించాడు నాగలోకాధిపతి. మళ్ళీ బతికివచ్చిన భార్యతో సహా భూలోకానికి తిరిగొచ్చిన ఋతధ్వజుడు సుఖంగా కాలం గడిపాడు. ఇదీ మళ్లీ జన్మించిన మదాలస వృత్తాంతం.

                           ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories