గోరింటాకు పెట్టుకుంటే ఎందుకు మంచిది అంటారంటే !

ఔషధీయుక్త సౌందర్య సాధనమైన  గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు.గోరింటాకుని మగ వాళ్ళు కూడా వాడుతారు. దీని రంగు శాశ్వతంగా ఉంటుంది. శరీరంలో ఉన్న అధిక మైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. గోరింటాకుని చక్కగా ముద్దగా రుబ్బి,అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ పెట్టుకుంటే శరీరంలోని వేడినంతా లాగేసి, అవి ఎర్రబడతాయి. దాన్నే పండట మంటారు. శరీర తత్త్వాన్ననుసరించి లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు  రంగు వరకు పండుతుంది. ఈ రంగు ప్రేమ గాఢతని తీవ్రతని తెలియ చేస్తుందంటారు. 

 

తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే  మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు. ఇది సంప్రదాయం పేరుతో ఏర్పాటుచేసిన వ్యాధి నివారణ కార్యక్రమం. ఆ విధంగా చెప్పకపోతే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకుంటారా? గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. ఒక వేళ వస్తే తగ్గిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరి ఒండ్రు పోస్తే ఆ వేలికి గోరింటాకు పెడతారు. పోతుంది. వెనకటి రోజుల్లో పాద సౌందర్య పోషణ [పెడిక్యూర్], హస్త సౌందర్య పోషణ [మెనిక్యూర్] అని సౌందర్య శాలల వెంట తిరగటానికి తీరిక, ఓపిక, ఆర్థిక స్తోమతు లేకపోయినా, అన్నీ పనులు తామే చేసుకున్నా వారి చేతులు మృదువుగానే ఉండటానికి ఈ సహజమైన, ప్రకృతి సిద్ధమైన సామాగ్రిని ఉపయోగించటమే కారణం అని ఎంతో మంది అంగీకరించిన మాట. పనిలో పనిగా గోళ్ళని పగడాల్లాగా మెరిసేట్టు చేస్తుంది. గోళ్ళ రంగుల కోసం వందలు వేలు వెచ్చించాల్సిన పని లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ [సైడ్ ఎఫెక్ట్స్] ఉండవు. పిల్లలు తెల్లగా పుట్టాలని  గోరింటాకుని  తింటారు కొన్నిసంప్రదాయాలవారు.

గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. ఒకసారి జుట్టుకి గోరింటాకు రంగు పడితే ఒక పట్టాన పోదు. తగ్గదు కూడా! అంతే కాదు. అది సహజమైన  మంచి కండిషనర్ గా పని చేస్తుంది. గోరింటాకు పెడితే జుట్టు మెత్తగా పట్టు కుచ్చు లాగా ఉండి, నిగనిగా మెరుస్తుంది. కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి వంటివి ఉపయోగించాలంటే కూడా గోరింటాకు బేస్ లాగా పనిచేస్తుంది. ఇది ఆడవారికి మాత్రమే పరిమితం కాదు సుమా! ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ జుట్టుకి గోరింటాకు పెట్టుకుంటున్నారు. గడ్డానికి కూడా పెట్టుకుంటున్నారంటే  గోరింటాకు విలువని ఎంత బాగా గుర్తించారో  అర్థం చేసుకోవచ్చు.

గోరింటాకు ముద్దని తయారు చేయటమే ఒక కళ. ఆకుతో పాటు మరెన్నింటినో  చేర్చుతారు ఆయా సందర్భాల కనుగుణంగా బాగా పండుతాయని. ఇప్పుడు గోరింటాకు ముద్దని తయారుచేసే పని లేదు. సిద్ధంగా  అన్నీ చోట్లా లభిస్తోంది. గోరింటాకు పెట్టటం ఒకకళగా పరిగణించబడుతోంది ఈనాడు. దాని కోసం శిక్షణాసంస్థలు కూడా వెలిశాయి. అరచేతులకే కాక చేతుల వెనుక భాగాలు, ముంజేతుల నుండి మోచేతుల వరకు కూడా రకరకాల జిలుగులతో గోరింటాకుని అలంకరించుకుంటున్నారు.  ఇంకా, మెడ, భుజాలు కూడా ‘మెహింది’ పెట్టించు కోవటం ఒక ‘ఫాషన్’ అయింది. పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగ మెహెంది పెట్టేవారిని నియమించుకుంటున్నారు. ఉత్తర దేశం వారి పెళ్లి వేడుకల్లో  మెహెందికి ఒక రోజు కేటాయిస్తారు. పెళ్లి కూతురి చేతులకి   గోరింటాకు పెట్టటం ఒక గౌరవంగా పరిగణించ బడుతుంది. ఇప్పుడు ప్రతి శుభ కార్యంలోను గోరింటాకు పెట్టటం ఒక ఆనవాయితీగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పసుపు తర్వాత అంతగా ఆడవారి జీవితంతో పెనవేసుకు పోయింది గోరింటాకు.

...Dr Anantha Lakshmi
 


More Enduku-Emiti