శంకరజయంతి ప్రత్యేకత

 

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూధర్మం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. అది ప్రమాదంలో ఉన్నప్పుడల్లా ఎవరో ఒక మహనీయుడు ముందుకు వచ్చి అండగా నిలబడటమే కాదు… దాన్ని సంస్కరించి, మరింత బలపరచడం యాదృచ్ఛికం కాదు. ధర్మాన్ని కాపాడేందుకు దైవమే మానుషరూపంలో అవతరించిందని భక్తుల నమ్మకం. అందుకనే వారిని ధర్మరక్షకులుగానే కాకుండా, దైవస్వరూపులుగా కూడా ఆరాధిస్తుంటారు. అలా దివికి దిగి వచ్చినవారే శంకరాచార్యులు.

శంకరాచార్యులు జన్మించిన సంవత్సరం మీద ఏకాభిప్రాయం లేదు. కానీ ఆయన వైశాఖశుద్ధ పంచమినాడు అవతరించారని చెబుతారు. శంకరాచార్యులది అద్భుతమైన జాతకమని పుట్టినప్పుడే తేలిపోయింది. తను పెరిగే కొద్దీ అది స్పష్టమైంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన శంకరునికి, తల్లి ఆర్యాంబ త్వరగా ఉపనయనం చేయించింది. అక్కడి నుంచి శంకరాచార్యుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది. బాలబ్రహ్మచారిగా భిక్షను స్వీకరిస్తూ ఓరోజు శంకరుడు… ఓ పేదరాలి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆమె ఉసిరికాయలు మాత్రమే ఇవ్వగలిగితే, ఆమె భక్తికి మురిసిపోయి ‘కనకధారా స్తోత్రాన్ని’ చెప్పి… ఆ ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించాడు. మరో సందర్భంలో తన తల్లి నదికి వెళ్లలేకపోవడాన్ని గ్రహించి ‘గంగాస్తవం’ జపించి, నదీమార్గాన్నే మళ్లించారు.

శంకరుడు ఎంతటవాడైనా తల్లికి సామాన్యుడే. అందుకే తనకు పెళ్లి చేసి, ఒక ఇంటివాడిగా చూసి ముచ్చట తీర్చుకోవాలనుకుంది ఆ తల్లి. ఓ రోజు మొసలి నోట్లో చిక్కుకున్న దృశ్యాన్ని కల్పించి, ఆమె తన సన్యాసానికి అనుమతి ఇస్తేనే… ఆ మొసలి తనను వదిలిపెడుతుందని షరతు పెడతారు శంకరులు. ఇక చేసేదేమీ లేదు… తన చివరి క్షణాల్లో కనుక, తోడుంటానని మాట ఇస్తే సన్యాసానికి అనుమతి ఇస్తానని చెబుతుంది తల్లి.

తల్లి అనుమతితో సన్యాసిగా మారిన శంకరులు తగిన గురువును వెతుక్కుంటూ… ‘గోవింద భగవత్పాదు’లను చేరుకున్నారు. శంకరుని చూసిన వెంటనే భగవత్పాదులు ‘శంకరశ్శంకర సాక్షాత్‌’ అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా అందించారు. భగవత్పాదుల దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత… దేశాటనానికి బయల్దేరారు శంకరాచార్యులు. వారణాసి, బదరి వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు తనదైన వివరణ (భాష్యం) అందించారు. హిందూధర్మానికి మూలమైన ఈ మూడింటినీ ప్రస్థానత్రయంగా పేర్కొంటారు. అప్పటివరకూ వీటికి ఎవరికి తోచిన వివరణ వారు ఇస్తూ వచ్చారు. అందులో వక్రీకరణలూ, తప్పుడు వ్యాఖ్యానాలూ లేకపోలేదు. తన వివరణతో శంకరులు వాటికి ఓ స్పష్టత అందించారు.

శంకరాచార్యుల సమయానికి దేశంలో విభన్నమైన ఆచారాలు, పద్ధతులూ రాజ్యమేలుతున్నాయి. బౌద్ధం, జైనం వంటి మతాలు కూడా బలపడుతున్నాయి. వాటికి దీటుగా హిందూమతం స్థిరపడేందుకు, సన్యాసాశ్రమానికి సంబంధించి అనేక నియమాలను ఏర్పరిచారు. దేశంలో నాలుగు దిక్కులా నాలుగు మఠాలను స్థాపించారు. ఎక్కడికక్కడ తన వాదనాపటిమతో, పాండిత్యంతో… ప్రజల, పండితుల మనసును ఆకట్టుకుంటూ ముందుకు సాగారు. లెక్కలేనన్ని స్తోత్రాలు, గ్రంథాలు రాశారు. తను వచ్చిన పని పూర్తయింది అన్న నమ్మకంతో 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే శివైక్యం అయ్యారు.

వైశాఖ శుద్ధ పంచమి తిథి ఈ ఏడాది (2021) 16, 17 తేదీలలో వచ్చింది. ఈ రెండు రోజులలో ఎవరి వీలుని బట్టి వారు చేసుకోవచ్చు. శంకరాచార్యుడు కేవలం ఆధ్యాత్మికవేత్తో, పండితుడో, ప్రవచనకారుడో, భాష్యకారుడో మాత్రమే కాదు… గురువు. తన బోధన ద్వారా, రచనల ద్వారా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని అందించినవాడు. గురువు అంటేనే జ్ఞానం అనే వెలుగుతో చీకటిని పారదోలేవాడని అర్థం. భగవంతుని కటాక్షం కలగాన్నా, మోక్షం లభించాలన్నా… అందుకు మార్గం చూపించేవాడు గురువే! అందుకని ఈ రోజున శంకరాచార్యలను మనస్ఫూర్తిగా కొలుచుకుని, ఆయన రాసిన స్త్రోత్రాలను మనకు నచ్చినది చదువుకోవాలి. ఆర్థిక బాధలు తీరాలంటే కనకధారా స్త్రోత్రాన్ని, జ్ఞానం కోసం వివేకచూడామణి, ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రం… ఇలా మన సమస్యలకు అనుగుణంగా వారిని తలుచుకుంటూ, ఆయన రచనలను మననం చేసుకోవాలి.

- మణి.

 


More Purana Patralu - Mythological Stories