సప్తర్షుల ఋషి పంచమి!

భారతీయ తెలుగు పంచాంగంలో తిథుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది ఉంటారు. భారతీయ ఆధ్యాత్మిక, సనాతన ధర్మానికి మహర్షులు మూల స్థంబాల వంటివారు. అలాంటి మహర్షులను తలచుకునే సందర్భమే ఋషి పంచమి.

భాద్రపద మాసంలో చవితి తరువాత వచ్చే పంచమి ఋషి పంచమి అవుతుంది. ఈ ఋషి పంచమి రోజు మహిళలు తమ నెలసరి సమయంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంలో భాగంగా బ్రాహ్మణుడికి నెయ్యి, పంచదార, అరటిపళ్ళు, తాంబూలంలో దక్షిణ ఇస్తారు. అలాగే ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ భోజనం కూడా ఉడికించినవి, కాల్చినవి, నూనె, కారం, పులుపు, ఉప్పు వంటివి జోడించిన ఆహారం కాకుండా పండ్లు తింటే శ్రేయస్కరం అని చెబుతారు. ఇంకా తినాలనుకునే భోజనంలో ధాన్యం, పాలు, పంచదార, పెరుగు, ఉప్పు మొదలైనవి వేసి తయారుచేసిన ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. ఈవిధంగా మహిళలకు తమ నెలసరి సమస్యల తప్పులకు పరిష్కారం సూచించారు. 

ఇకపోతే భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూలస్థంబాలు అయిన మహర్షులలో సప్తర్షుల ప్రాధాన్యత గొప్పది. ఏడుమంది మహర్షులు మనకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు.  ఆ ఏడుమంది ఎవరంటే "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే మహర్షులు. ఋషి పంచమి రోజు ఈ మహర్షులను ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.

దశరథ మహారాజు మాట మీద అరణ్యవాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణులకు "అత్రి మహర్షి" తన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఈయన సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు. అలాగే సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపించినవాడు "భారధ్వజ మహర్షి", తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపస్సు ఫలితాన్ని ధారబోసినవాడు "గౌతమ మహర్షి", రాముడి గురువు "విశ్వామిత్రుడు", రాముడి కులగురువు "వశిష్ఠుడు", విష్ణువు అంశతో అవతరించిన వాడు పరశురాముడు, పరశురాముడి తండ్రి "జమదగ్ని". వామనుడి తండ్రి "కశ్యప మహర్షి". ఇలా సప్తర్షులు రామాయణంలో పరిచయం అవుతారు. అందుకే ఋషి పంచమి రోజు రామాయణం పారాయణ చేస్తే ఎంతో మంచిదని చెబుతారు.

సప్తర్షులను ధ్యానించడానికి శ్లోకాలు ఉన్నాయి.

కశ్యప ఋషి 

కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||

ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి :

అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి :

జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||   

 ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి : 

కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     

ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||


గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    

ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి :

 అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వశిష్ఠ ఋషి : 

శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||    

ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

సప్తర్షులను కలిపి ధ్యానించే శ్లోకం కూడా ఉంది!!

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||

ఈ సప్తర్షులను తప్పక అందరూ స్మరించుకోవాలి.ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే నేటి భారతదేశాన్ని గొప్పగా నిలబెడుతోంది.

                                      ◆నిశ్శబ్ద.


More Others