ఆడవారి సందడి అట్లతద్ది హడావిడి!

పండుగలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే నోములు, వ్రతాలలో  కూడా బోలెడు ఉన్నాయి. పెళ్ళైన వారు చేసుకునేవే కాదు, పెళ్లి కానివారు చేసుకునే పండుగలు, వ్రతాలు, నోములు కూడా ఉన్నాయి, సహజంగా పెళ్లికాని అమ్మాయిలు చేసుకునే పండుగలు, వ్రతాలలో మంచి భర్త దొరకాలని చేసుకునే పండుగలే అధికం. అలాంటి వాటిలో ముఖ్యమైనది, అమ్మాయిలందరూ ఎంతో సందడి చేసేది అట్లతద్ది. "అట్లతద్ధోయ్ ఆరట్లోయ్ ముద్ధపప్పోయ్ మూడట్లోయ్" అనే మాట వినని వారుండరు కదా!! ఈ అట్లతద్ది ఎందుకు జరుపుకుంటారు?? దీని విశేషం ఏంటి?? అసలు ఈ అట్లతద్ది వెనుక కథ ఏంటి?? 

అట్లతద్ది విశేషం ఏంటి?

పెళ్లి కాని అమ్మాయిలు అట్లతద్ది నోము నోచుకుంటే నచ్చినవాడు, మంచివాడు భర్తగా లభిస్తాడు, పెళ్ళైనవాళ్ళు ఈ నోము నోచుకుంటే వారి సంసారజీవితం సంతోషంగా ఉంటుంది. 

అట్లతద్ది ఎప్పుడు?

ఆశ్వయుజ మాసంలో తదియ నాడు అట్లతద్ది నోము నోచుకుంటారు. అందరి దేవుళ్ళకు కొన్ని మాసాలు ఎంతో విశిష్టంగా ఉంటాయి. అలాగే ఆశ్వయుజ మాసం అంతా త్రిమూర్తుల  భార్యలు అయిన లక్ష్మీ, పార్వతీ, సరస్వతి దేవిల కొలువులు ఎక్కువ జరుగుతాయి. 

అట్లతద్ది వెనుక కథ!

పార్వతీ దేవి శివుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని మనసులో బలంగా ఉంచుకుని శివుడే భర్తగా రావాలని ప్రార్థించడం మొదలుపెట్టింది. అన్ని లోకాలు తిరుగుతూ ఉండే నారద మహర్షికి పార్వతీదేవి కోరిక తెలిసింది. ఆయన నేరుగా పార్వతీ దేవి దగ్గరకు వెళ్లి నేను చెప్పిన నోము నోచుకుంటే నువ్వు కోరుకున్నవాడు భర్తగా లభిస్తాడని చెప్పాడు. పార్వతీ దేవి నారద మహర్షి చెప్పినట్టు అట్లతద్ది నోము నోచుకోవడం వల్ల శివుడిని భర్తగా పొందగలిగింది. ఈ కారణం వల్లనే పెళ్లి కాని అమ్మాయిలు అట్లతద్ది చేసుకుంటే పార్వతి దేవిలా తమకు నచ్చినవాడిని భర్తగా పొందుతారు. 

అట్లతద్ది ఎలా జరుపుకుంటారు?

అట్లతద్ది నోమును ఆశ్వయుజ తదియ నాడు జరుపుకుంటారు. ఆరోజు ఆడవారు అందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఉదయాన్నే అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో భోజనం చేస్తారు. ఆ తరువాత రోజు మొత్తం ఏమి తినరు. అట్లతద్ధోయ్ ఆరట్లోయ్ ముద్ధపప్పోయ్ మూడట్లోయ్ అంటూ వీరి పాటలు సాగుతాయి. సాయంత్రం అవ్వగానే గౌరీ పూజ చేసి ఊరి చివరకు వెళ్లి చెరువులో దీపాలు వదులుతారు. అక్కడే చెట్లకు ఊయలలు కట్టుకుని ఊగుతారు. 

అట్ల విషయం ఏమిటి?

అట్లతద్ది నోము నోచుకునేవారు అట్లను వాయనంగా ఇస్తారు. ఆ వాయనంలో పదకొండు  అట్లు, పదకొండు రకాల పండ్లు వుంటాయి. వీటిని వాయనంగా ఇస్తారు. ఈ అట్లకోసం ఉపయోగించే మినుములు కుజునికి ఇస్టమైనవి, బియ్యం చంద్రుడికి ఇస్టమైనవి. ఇవి రెండూ కలిపి చేసిన అట్లను వాయనంలో ఇవ్వడం వలన కుజదోషం ఉంటే అది పోయి పెళ్లి జరుగుతుందని చెబుతారు. అలాగే అట్లు చలువ చేస్తాయి. ఇవి ఋతుక్రమం దోషాలు ఉంటే వాటిని పరిష్కరిస్తాయి. శాస్త్రీయంగానూ, ఆచార విషయంలోనూ ఇదీ అట్ల వెనుక ఉన్న కథ. 

ఇలా అట్లతద్ది రోజు అమ్మాయిలు, ఆడవారు గౌరీదేవిని పూజించి అట్లను వాయనంగా సమర్పిస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆడవారి చేతిలో పండే గోరింటను చూసుకుని కాబోయే భర్త ఎలా ఉంటాడో కూడా చెప్పుకుంటారు. ఏది ఏమైనా అమ్మాయిల సంతోష జీవితంలో అట్లతద్ది నోము ముఖ్యమైన ఘట్టమైంది.

                                     ◆నిశ్శబ్ద.


More Others