రామేశ్వరం గురించి ఈ రహస్యాలు తెలుసా.!

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన , ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన చారిత్రక ప్రదేశాలలో రామేశ్వరం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దక్షిణ కాశీగా భావించే ఈ పుణ్యక్షేత్రం అనేక అంతుచిక్కని రహస్యాలకు, అద్భుతమైన నిర్మాణ శైలికి , పౌరాణిక గాథలకు నిలయంగా ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం నాలుగు ధామాలలో ఒకటైన రామేశ్వరంలో భగవంతుని దర్శించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ చారిత్రక ప్రాంతం వెనుక దాగి ఉన్న కొన్ని విస్మయకరమైన రహస్యాలు , విశేషాల గురించి వివరంగా తెలుసుకుంటే..
నిర్మాణం..
రామేశ్వరం ఆలయ నిర్మాణం , దాని కారిడార్ల ప్రత్యేకత ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ ఆలయం దాదాపు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో బలమైన రాతి గోడలతో ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని మూడవ కారిడార్ ప్రపంచంలోనే అతి పొడవైన స్తంభాల కారిడార్ గా చరిత్రకెక్కింది. ఇక్కడ సుమారు రెండు వేలకు పైగా అందమైన శిల్పాలతో కూడిన స్తంభాలు ఉంటాయి. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించిన గ్రానైట్ రాళ్లు స్థానికంగా లభించకపోవడం, చుట్టుపక్కల ఎలాంటి పర్వతాలు లేకపోవడం గమనార్హం. ఇవి అంత దూరంలో ఉన్న ప్రాంతాల నుండి పడవల ద్వారా తరలించబడి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తారు.
శివలింగాలు..
ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉండటం మరో ముఖ్యమైన విశేషం. రావణ వధ తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ హత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ శివుడిని పూజించాలనుకుంటాడు. హనుమంతుడు కైలాస పర్వతం నుండి శివలింగాన్ని తీసుకురావడానికి ఆలస్యం కావడంతో, సీతాదేవి సముద్రపు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్టించారు. ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్టించడం జరిగింది. అందుకే ఇక్కడ ప్రధాన గర్భగుడిలో రాముడు పూజించిన ఇసుక లింగంతో పాటు హనుమంతుడు తెచ్చిన లింగం కూడా పూజలందుకుంటాయి.

నీటి కుండాలు..
రామేశ్వరంలో ఉన్న ఇరవై రెండు పవిత్ర కుండాలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆలయ పరిసరాలలో ఉన్న ఈ బావుల నీటితో స్నానం చేయడం వల్ల భక్తుల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతి బావిలోని నీరు భిన్నమైన రుచిని , ప్రత్యేకతను కలిగి ఉండటం మరో వింత.
ఇది కూడా చదవండి పూర్వజన్మ పాపాన్ని తగ్గించుకోవచ్చా..ఇందుకోసం ఏం చేయాలి.!
ధనుష్కోటి..
రామేశ్వరానికి సమీపంలో ఉన్న ధనుష్కోటి ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఒకప్పుడు కళకళలాడిన ఈ ప్రాంతం 1964లో వచ్చిన పెను తుఫాను కారణంగా జలమయమై నేడు నిర్మానుష్యంగా మారింది. అయినప్పటికీ శ్రీరాముడు ఇక్కడే రామసేతువును నిర్మించాడనే చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి.
సముద్రంలో నీటిపై తేలియాడే రాళ్లు ఇక్కడి మరో రహస్యంగా నిలిచాయి. రామసేతు నిర్మాణ సమయంలో వారధి కోసం ఉపయోగించిన ఈ రాళ్లు నీటిలో మునిగిపోకుండా తేలుతుండటం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విషయంగా మారింది. వీటితో పాటు పంచముఖి హనుమాన్ ఆలయం, విల్లురాణి కుండ వంటి ప్రదేశాలు కూడా ఈ ప్రాంతం పవిత్రతను మరింత చాటుతున్నాయి.
సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ ఉప్పు నీరు కాకుండా తియ్యటి నీటిని అందించే విల్లురాణి కుండ రాముని విల్లు కొన నుండి పుట్టిందని భక్తులు విశ్వసిస్తారు. ఇలా ప్రతి అడుగులోనూ ఒక పురాణ గాథను, రహస్యాన్ని దాచుకున్న రామేశ్వరం దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు గోవర్ధన పూజ ఇలా చేస్తే.. మీ పంట పండినట్టే..!





.webp)
