Home » Bhakti Content » Aacharalu » గోవర్ధన పూజ ఇలా చేస్తే.. మీ పంట పండినట్టే..!

గోవర్ధన పూజ ఇలా చేస్తే.. మీ పంట పండినట్టే..!

​హిందూ సంప్రదాయంలో దీపావళి మరుసటి రోజు వచ్చే కార్తీక శుద్ధ  పాడ్యమి నాడు గోవర్ధన పూజకు చాలా  ప్రాధాన్యం ఉంది. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ గోవర్ధన పూజను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, సకల శుభాలు కలుగుతాయని చాటి చెప్పాడు.  పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు. గోవులను , గోవర్ధన పర్వతాన్ని పూజించడం వెనుక విశేషమైన ఆధ్యాత్మిక, ప్రాకృతిక రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు గోవర్ధన పూజను ఏ విధంగా చేయాలి, దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాలను   వివరంగా తెలుసుకుంటే..

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తాడు? దీని వెనుక కథ ఏమిటి? 

గోకులంలో ప్రతి సంవత్సరం ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరుతూ దేవతలకు రాజైన  ఇంద్రుడిని పూజించేందుకు పెద్ద ఎత్తున యాగాన్ని ఏర్పాటుచేసేవారు. అయితే బాలకృష్ణుడు తన తండ్రి నందుడితో , గోపాలకులతో మాట్లాడుతూ.. "మనకు వర్షం, గడ్డి, జీవనాధారాన్ని ఇచ్చేది ఇంద్రుడు మాత్రమే కాదు, మన పశువులను మేపుతూ, ఔషధాలను, ఆహారాన్ని ఇచ్చే గోవర్ధన పర్వతాన్ని, గోవులను , ప్రకృతిని మనం పూజించాలి.  అని చెప్పాడు. కృష్ణుడి మాటలు విని సమంజసమే అనుకున్నారు గోకులవాసులు. వారందరూ  ఇంద్రయాగాన్ని నిలిపివేసి, గోవర్ధన పర్వతానికి పూజలు నిర్వహించారు.

​ఇంద్రుడి ఆగ్రహం - భయంకర తుఫాను..

తనకు సమర్పించాల్సిన పూజలను ఆపివేయడంతో ఇంద్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కృష్ణుడిని ఒక సామాన్య బాలుడిగా భావించి, గోకులాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో సంవర్తకం అనే ప్రాణాంతక మేఘాలను పంపి, గోకులంపై భయంకరమైన వర్షం, రాళ్ల వాన కురిపించాడు. ఈ అకాల ప్రళయంతో గోపాలురు, గోవులు, సమస్త ప్రాణులు భయంతో వణికిపోయాయి.

​చిటికెన వేలిపై గోవర్ధన గిరి ఎత్తడం..

దీనితో శ్రీకృష్ణుడు గోకులవాసులను, పశువులను కాపాడటానికి గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికెన వేలిపై ఎత్తాడు. ఆ పర్వతం ఒక పెద్ద గొడుగులా మారి గోకులంలో ఉన్న ప్రతి ఒక్కరికీ, పశుపక్ష్యాదులకు ఆశ్రయాన్ని ఇచ్చింది. కృష్ణుడు ఏకధాటిగా ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఆ పర్వతాన్ని అలాగే ఎత్తి పట్టుకున్నాడు.

​ఇంద్రుడి అహంకార భంగం: 

ఎంత వర్షం కురిపించినా గోకులానికి చిన్న హాని కూడా కలగకపోవడంతో ఇంద్రుడికి శ్రీకృష్ణుడి అసలు తత్త్వం అర్థమైంది. ఆయన పరమాత్మ అని తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని, కృష్ణుడి పాదాలపై పడి క్షమాపణలు వేడుకున్నాడు. అనంతరం వర్షాన్ని నిలిపివేసి,  శ్రీకృష్ణుడికి అభిషేకం జరిపి, ఆయనకు 'గోవిందుడు'  అంటే గోవులను, జీవులను రక్షించేవాడు అనే నామాన్ని ఇచ్చాడు. 

ఇది కూడా చదవండి   మహానంది క్షేత్రం గురించి చాలా మందికి తెలియని రహస్యాలివి..!

గోవర్ధన పూజ ఉద్దేశం..

​మనం నివసించే పరిసరాలను, ప్రకృతిని, మనకు ఆహారాన్ని అందించే గోవులను పూజించడమే గోవర్ధన పూజ అసలు ఉద్దేశం. సాధారణంగా ఈ పండుగ రోజున ఆవు పేడతో గోవర్ధన పర్వత ఆకారాన్ని తయారు చేసి, దానిని అందంగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆవు పేడ పవిత్రతకు ప్రతీకగా నిలుస్తుంది. గోవు నుంచి లభించే ప్రతీది మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే గోవులను పూజించడం ద్వారా సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

పూజా విధానం..

​గోవర్ధన గిరి పూజ రోజు..  పూజా విధానాన్ని ఆచరించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా ఇల్లును శుభ్రం చేసుకుని, వాకిట అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవు పేడతో గోవర్ధన రూపాన్ని లేదా చిన్న పర్వతాకార ప్రతిమను తయారు చేయాలి. దాని చుట్టూ పూలతో, రంగురంగుల వస్తువులతో అలంకరించాలి. ఈ పూజలో గోవులకు విశేష స్థానం ఉంటుంది కాబట్టి, గోవులను కూడా శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించి పూజించాలి.

నైవేద్యాలు..

​గోవర్ధన పూజ రోజున భక్తులు భగవంతునికి వివిధ రకాల పిండి వంటలు, నైవేద్యాలను సమర్పిస్తారు. ముఖ్యంగా  అన్నకూట సమర్పణ ఈ పూజలో చాలా ముఖ్యం. వివిధ రకాల ధాన్యాలు, కూరగాయలు, తీపి పదార్ధాలతో కూడిన వంటకాలను స్వామివారికి నివేదిస్తారు. గోవర్ధన పర్వతాన్ని పూజించిన తర్వాత, ఆ ప్రతిమ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

పూజా ఫలం..

​గోవర్ధన గిరి పూజను చేయడం వల్ల ఇంట ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని, రైతులకు పంటలు బాగా పండుతాయని, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని విశ్వాసం. ప్రకృతిని తల్లిలా భావించి పూజించడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గోవులను రక్షించడం, ప్రకృతిని గౌరవించడం మన సనాతన ధర్మం నేర్పిన గొప్ప పాఠం. ఈ గోవర్ధన పూజను సరైన నియమాలతో ఆచరిస్తే శ్రీకృష్ణుని , గోమాత కృపకు పాత్రులు కావచ్చు.

                                                                                                                                              *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు    శివుడికి జిల్లేడు పువ్వులంటే ఎందుకంత ఇష్టం..!

                                  భాగవత పురాణం పారాయణం చేయడం వల్ల జరిగే అద్భుతాలు..!

 

Govardhan Puja: Perform These Rituals to Invite Prosperity and Good Fortune!

google-ad-img