మన మహర్షులు - పులస్త్య మహర్షి

 


విష్ణుమూర్తి నాభికమలము నుంచి ఉద్భవించిన బ్రహ్మ దేముడు సృష్టి కార్యం చేయటానికి తన శరీరము నుంచి కొంతమందిని సృష్టించాడు. వారినే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. అలాంటి మానస పుత్రులలో పులస్త్యుడు ఒకరు. ఈయన బ్రహ్మదేముడి కుడి చెవి నుంచి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారాయణుడి మీద మక్కువతో నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు.


పులస్త్యుడి భార్య పేరు హవిర్భువ, ఈమె కర్దమ ప్రజాపతి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూపంగా వీరికి అగస్త్య మహర్షి పుడతారు. పెద్ద కుమారుడు అగస్త్యుడు కూడా గొప్ప మహర్షి. అగస్త్యుడు పుట్టాకా పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సులో లీనమైపోతాడు.ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుకి భగ్నం కలిగించటానికే వారిద్దరూ అక్కడికి వచ్చారని అనుకొన్న పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడనుంచి పారిపోతారు.


ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజు కుమార్తె ఇద్విద ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెపుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అభ్యర్దిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి విశ్రవసు అనే కుమారుడు పుడతాడు. ఈ విశ్రవసువే రాక్షసులనందరినీ పుట్టించాడని అంటారు. ఇతని కొడుకులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణక మరియు కుబేరుడు. ఈ  విధంగా చూస్తే పులస్త్యుడు రావణాసురునికి తాతగారు అవుతారన్న మాట.


ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో సత్రయాగం చేస్తున్న సమయంలో అగస్త్యుడు వచ్చి ఆ యాగాన్ని ఆపమని ఆదేశిస్తాడు. అపుడు పరాశరుడు వెంటనే ఆ సత్రయాగాన్ని ఆపుతాడు. ఇది చూసిన పులస్త్యుడు పరాశరుడు అంత కోపంలో ఉండి కూడా యాగాన్ని వెంటనే ఆపినందుకు ఆనందించి వరం కోరుకోమని అంటాడు. దానికి పరాశరుడు తన మనస్సు ఎల్లప్పుడూ వేదపురాణాల మీద ఉండాలని, తను వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దానికి తథాస్తు అంటాడు పులస్త్యుడు.


అలాగే భీష్ముడు ఒకసారి గంగా నదీ తీరంలో పితృకర్మలు చేస్తూ ఉండగా పులస్త్యుడు అక్కడికి వస్తాడు. భీష్ముడు అతనిని భక్తితో పూజిస్తాడు. దానికి సంతసించిన పులస్త్యుడు ఏమైనా సందేహాలుంటే అడగమని అంటాడు. దానికి భీష్ముడు తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాలని చెప్పమని కోరుతాడు. దానికి సమాదానంగా పులస్త్యుడు భీష్మా! గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకుండా  ఉండటం, తక్కువగా తినటం, నిజాలనే మాట్లాడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మంచి పనులనే చేయటం, ఇలాంటివన్నీ చేసేవారు ఎటువంటి తీర్థయాత్రలు చేయకపోయినా దానికి మించిన ఫలితం లబిస్తుందని చెపుతాడు.


ఈ మద్య కాలంలోనే శ్రీలంకలో జరిగిన తవ్వకాలలో 11 అడుగుల ఎత్తు ఉన్న పులస్త్యుని విగ్రహం ఒకటి బయట పడింది. రావణాసురునికి తాతగారైన పులస్త్యుడి విగ్రహం బయటపడటం అక్కడి ప్రజలకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ విధంగా బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడు జీవించినంత కాలం వేదనిష్టా పరాయణుడై, ఎల్లప్పుడూ నారాయణుని స్మరిస్తూ చివరికి అతనిలోనే ఐక్యమైపోతాడు. ఇదండీ పులస్త్యుని చరిత్ర.

 

..కళ్యాణి


More Purana Patralu - Mythological Stories