నాగపంచమి గురించి 10 విశేషాలు

 


శ్రావణమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి సందర్భంగా నాగులను పూజించడం ఆచరంగా వస్తోంది. మన సంప్రదాయాలలో ప్రతి పండుగకీ ఉన్నన్ని విశేషాలూ ఈ నాగపంచమికి కూడా ఉన్నాయి. అవి...

 

- సర్పారాధన అనేది భారతీయులకే ప్రత్యేకమైన ఒక ఆచారం. ఇతర దేశాలలో ఇలాంటి ఆరాధన ఉన్నప్పటికీ వాటన్నింటకీ మాతృక మన దేశమే అని భావించేవారు లేకపోలేదు.

 

- వేదాలలోనూ, గుహ్య సూత్రాలలోనూ సర్పాలను ఆరాధించడం గురించి అనేక మంత్రాలు, వివరణలు ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ సర్పాలను ఆరాధించే పద్ధతులు మారినప్పటికీ ఇప్పటికీ నాగపంచమిని భారతదేశంలోని నలుమూలలా వేర్వేరు రీతులలో, వేర్వేరు పేర్లతో జరుపుకుంటూనే ఉన్నారు.

 

- సర్పాలు మనకంటే ఉన్నతమైన జాతికి చెందినవనీ, ఇప్పటికీ నాగలోకం పేరుతో ఒక గ్రహం ఉన్నదనీ ఒక నమ్మకం. ఆ లోకంలో నివసించే జీవులు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతస్థాయిలో ఉన్నయని అంటారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు శ్రీ ఎం రాసిన ‘Apprenticed to a Himalayan Master’ అనే పుస్తకంలో కనిపిస్తాయి.

 

- నాగలోకం ఉన్నదో లేదోకానీ, నాగపాము స్వరూపం మన కుండలిని పోలి ఉండటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే! మనలోని సహస్రార చక్రం వరకూ ఇడపిండళి నాడులు చుట్టుకుని ఉన్న కుండలిని.... సరిగ్గా పడగ విప్పిన నాగుపాములాగానే తోస్తుంది.

 

- స్థితికారకుడైన విష్ణువుకి జన్మమాసమైన ఈ శ్రావణమాసంలోనే, ఆధ్మాత్మక ఉన్నతిని ప్రసాదించే నాగారాధనను కూడా ఏర్పరచడం యాదృచ్ఛికం ఏమీ కాదు. మనిషి కేవలం బతికేయడం కాదు, ఆధ్యాత్మికంగా మరింత ఎత్తుకి ఎదగాలని నాగపంచమి సూచిస్తోంది.

 

- కేవలం ఆధ్మాత్మిక ఉన్నతినే కాదు, సంసార బాధలని కూడా నాగపూజ ఈడేరుస్తందని నమ్మకం. కుజ, రాహుదోషాలు ఉన్నవారు; వినికిడి సంబంధమైన సమస్యలు ఉన్నవారు; సంతానం లేనివారు... నాగపూజను చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని ఓ ప్రగాఢ విశ్వాసం.

 

- నాగపంచమి రోజున నాగపాము ప్రతిమను చేసి లేదా బొమ్మను చిత్రించి ఆ ప్రతిరూపాన్ని ధూపదీపనైవేద్యాలతో పూజించడం సంప్రదాయం. అలా కాకుండా వాటి పుట్టలో పాలు, గుడ్లు, పసుపు వేయడం కూడా చూస్తున్నదే! అయితే ఇలా పుట్టని నింపేయడం వల్ల పాములను పూజించడం మాట అటుంచి, వాటిని మరింత ఇబ్బంది పెట్టినవారమవుతాం అన్నది పర్యావరణవేత్తల ఆందోళన.

 

- నాగపంచమి వచ్చే నాటికి పొలం పనులు ఉధృతంగా సాగుతూ ఉంటాయి. ఈ కాలంలోనే రైతులకు ఎలుకలు బెడద కూడా మొదలవుతుంది. అనాదిగా ఇలాంటి జీవుల నుంచి పొలాను రక్షిస్తూ వస్తోంది ఆ పాములే. అందుకని వాటికి కృతజ్ఞతగా ఒక్క రోజైనా వాటిని పూజించుకోవడంలో తప్పులేదుగా!

 

- నాగపంచమి రోజున భూమిని దున్నడం, గోతులు తవ్వడం, పలుగూ పారలతో నేలని పెళ్లగించడం, మొక్కలు పీకడం, ఆరుబయట మంటలు వేయడం.... ఇవన్నీ కూడా నిషిద్ధమని చెప్పారు పెద్దలు. ఈ పైన సూచించిన చర్యల వల్ల ఒకోసారి పాముల ప్రాణాలకు నష్టం అని వేరే చెప్పనవరసం లేదు. అంటే కనీసం ఈ ఒక్క రోజైన పాముని చంపడం అనే చర్య నుంచి దూరంగా ఉండేందుకు, అందుకు దారి తీసే పనులను చేయవద్దని పెద్దలు చెప్పారన్నమాట.

 

- పాము అనగానే ఆదిశేషుడు తప్పక గుర్తుకు వస్తాడు. భూభారాన్ని వహించే ఆ విష్ణుమూర్తి భారాన్ని మోస్తున్నవాడే ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుని సేవలకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడుగగా నాగపంచమి రోజున తమ జాతివారిని లోకులు పూజించుకోవాలని కోరుకున్నాడట శేషుడు. అప్పటి నుంచీ శ్రావణశుక్ల పంచమి ‘నాగపంచమి’ పర్వదినంగా మారింది.

 

- నిర్జర.

 


More Others