అచ్చ తెలుగు పండుగ - అట్లతద్ది

 

 

భారతీయుల ప్రతి పండుగా వారి జీవనవిధానానికి ప్రతీక. అందులో భక్తి ఎంతగా కనిపిస్తుందో, సంస్కృతీ అంతే స్పష్టంగా ఉంటుంది. పైన ఆచారంలా తోచినా ఆరోగ్య రహస్యాలూ ఇమిడి ఉంటాయి. ఒక్క అట్లతద్దిని గమనిస్తే చాలు... ఈ మాటలలో వాస్తవం ఏమిటో తెలిసిపోతుంది.

 

వ్రత కథ

పూర్వం ఒక రాజకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి మంచి భర్తని పొందేందుకుగాను అట్లతద్ది నోముని నోచుకుంది. నోములో భాగంగా ఉపవాసం ఉన్న రాజకుమారి ఆకలికి తాళలేక సాయంవేళకే సొమ్మసిల్లిపోయింది. రాజకుమారి అలా శోషగా పడి ఉండటాన్ని చూడలేని ఆమె సోదరుడు, చంద్రోదయం అయిపోయిందని నమ్మించి ఆమె ఆహారం తీసుకునేలా చేశాడు. కాలక్రమేణా రాజకుమారికీ, ఆమె స్నేహితురాళ్లకీ పెళ్లిళ్ల జరిగాయి. ఆ రోజు నోము నోచుకున్నవారందరికీ మంచి భర్తలు లభించగా... రాజకుమారికి మాత్రం ముసలి భర్తి లభించాడు. అంత శ్రద్ధగా నోము చేసుకున్నా కూడా తనకి ఈడుజోడు కానీ భర్త లభించడం చూసి రాజకుమారి క్రుంగిపోయింది. తన వల్ల పొరపాటు ఎక్కడ జరిగిందంటూ పార్వతీపరమేశ్వరులను వేడుకుంది. అంతట ఆ ఆదిదంపతులు ప్రత్యక్షమై జరిగిన లోపాన్ని వివరించి, ఈసారి ఆ వ్రతాన్ని ఎలాంటి లోపం లేకుండా చేస్తే భర్త యవ్వనవంతుడవుతాడని చెప్పారు. రాజకుమారి మరోమారు శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించడంతో ఆమె భర్తకి యవ్వనం ప్రాప్తించింది. సాక్షాత్తూ ఉమాదేవే ఈ వ్రతం గురించి చెప్పడంతో ఈ వ్రతానికి ‘చంద్రోయ ఉమా వ్రతం’ అన్న పేరు స్థిరపడింది.

 

విధానం

గోరింటాకు- అట్లతద్దికి ముందురోజున ఆడవారంతా కలిసి గోరింటాకుని పెట్టుకుంటారు. సంవత్సరంలో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢమాసం, అట్లతద్ది వంటి సందర్భాలలో గోరింటను తప్పక పెట్టుకోవాలని పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయాకాలాలలో ఉండే వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. అక్టోబరు లేదా నవంబరు మాసాలలో వచ్చే అట్లతద్ది సమయానికి చలికాలం మొదలైపోతుంది. వాతావరణంలో తగినంత వేడి లేకపోవడం వల్ల రకరకాల చర్మవ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండే ఆడవారు నిరంతరం తడిలో ఉండటం వల్ల వారి వేళ్లు, గోళ్లు నాజూకుదనాన్ని కోల్పోవడమే కాకుండా ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉంది. దీనికి విరుగుడు గోరింటాకని ప్రత్యేకించి చెప్పేదేముంది. అయితే గోరింటాకు పెట్టుకున్న పడుచులు కుదరుగా ఉంటారని చెప్పలేం. ఎప్పుడెప్పుడు దానిని కడిగేసుకుందామా అన్న తొందరలో ఉంటారు. బహుశా వారిని అదుపు చేసేందుకే ‘గోరింట ఎంతబాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు’ అని ఊరిస్తారు కాబోసు.

 

చద్దన్నం- అట్లతద్ది ఉదయాన్నేలేచి గోంగూర, పెరుగుతో చద్దన్నం తినడంతో వ్రతం మొదలవుతుంది. సాధారణంగా ఏకాదశి వంటి ఉపవాస సమయాలలో ఉదయం లేదా అంతకు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం మొదలవుతుంది. కానీ అట్లతద్దినాడు ఆడపిల్లలకు బోలెడు పనయ్యే! అందుకని వారు నీరసించి పోకుండా ఉండేందుకు ఈ ఫలహారం ఉపయోగపడుతుంది. పెరుగు కడుపుని చల్లగా ఉంచితే, ఆ పెరుగు వల్ల ఏర్పడే కఫానికి విరుగుడుగానూ, చలి వాతావరణాన్ని తట్టుకునేందుకూ గోంగూర ఉపయోగపడుతుంది.

 

తాంబూలం- ఒకపక్క ఉపవాసం ఉంటూనే తాంబూల సేవనం చేసే ఆచారాన్ని కొంతమంది పాటిస్తారు. దీని వలన ఉపవాసంతో నోరు పొడిబారిపోకుండా ఉంటుంది. పైగా కడుపులో ఆహారం లేకపోతే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. తాంబూలం తలనొప్పికి దివ్యోషధం అంటుంది ప్రాచీన వైద్యం. ఇక తాంబూలానికి ఒంట్లో కొవ్వుని కరిగించే శక్తి కూడా ఉందట. తాంబూలాన్ని విలాసవంతులకు పరిమితమైన అలవాటుగా సమాజం భావిస్తుంటుంది. అలాంటి తాంబూలాన్నీ అట్లతద్ది రోజున ఆడవారంతా నిర్భయంగా వేసుకుంటారు. గోరింటతో ఎర్రగా పండిన చేతులతో, తాంబూలంతో ఎరుపెక్కిన అధరాలతో దేవకన్యలకు తీసిపోకుండా ఉంటారు.

 

ఊయగలూగడం- పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఊయలలూగాలని ఎందుకు అనిపించదు! ఇంట్లో ఆ సౌకర్యం లేకనో, ఉన్నా ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న జంకుతోనో అణకువ పేరుతో తమ కోరికని అణుచుకొని ఉంటారు. అలాంటి కోరికలకు రెక్కలనిచ్చేదే ఊయలూగే సంప్రదాయం. సాధారణంగా ఈ ఊయలలు ఆరుబయటో, తోటలోనో కడుతూ ఉంటారు. రోజంతా ఎలాంటి జంకూ లేకుండా ఊయలలూగుతూ, పాటలు పాడుకుంటూ ఆడవారంతా సంతోషంగా గడిపేస్తారు.

 

అట్లు- అట్లతద్ది సాయంవేళ బియ్యం, మినప్పప్పు పిండితో అట్లు వేసి పదిమంది ముత్తయిదువలకు పదేసి అట్లను వాయినంగా ఇస్తారు. అట్లు కుజునికి ప్రీతికరం అనీ, ఇలా అట్లని దానం చేయడం వల్ల... వివాహానికీ, సంతానానికీ, ఐదోతనానికీ అవరోధాలు కలిగే కుజదోషాలు సమసిపోతాయనీ పెద్దలు చెబుతుంటారు. అదేమో కానీ మినుములు మాత్రం శరీరానికి తగినంత వేడినీ, బలాన్నీ అందిస్తాయి. కన్నె పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు, పెళ్లయినవారు సంతానాన్ని పొందేందుకు తగిన సత్తువని పొందేందుకు, గృహిణులు ఇళ్లలో పనులను చేసుకునేందుకు... మినుముల తగిన బలాన్ని అందిస్తాయి.

 

ఇక అట్లతద్దికి పాడుకునే పాటలు ఇప్పటికీ తెలుగువారి సాహిత్యంలో భాగంగానే ఉన్నాయి. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్, చెమ్మచెక్క చారదేసి మొగ్గ... అట్లు పోయంగా ఆరగించంగా వంటి పాటలని గమనిస్తే ఒకప్పుడు అట్లతద్దిని ఎంత వైభవంగా జరుపుకొనేవారో తెలుస్తుంది. బాల్య వివాహాలు, ప్రసవ సమయంలో తల్లో బిడ్డో చనిపోవాల్సి రావడం, మగవారి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉండటం వంటి సవాలక్ష సమస్యలు ఉన్న కాలంలో... తమకు ఈడైన భర్త రావాలనీ, పండంటి బిడ్డ కలగాలనీ, పసుపుకుంకుమలు క్షేమంగా ఉండాలనీ ఆడవారు కోరుకోవడం సహజమే కదా! ఇక క్షణం తీరికలేక, తీరిక ఉన్నా కట్టుబాట్లను కాదనలేక ఇంట్లోనే మగ్గిపోయేవారు పండుగ పేరుతో హాయిగా ఊయలలూగుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుకుంటూ గడపడం సదవకాశమే కదా! అందుకే భక్తిపరంగానూ, భౌతికంగానూ వారి కోరికను ఈడేర్చే నోము అట్లతద్ది. కాలం మారి పట్టణాలు విస్తరించిపోయి, అట్లతద్ది జరుపుకునే తీరికా, ఓపికా ఇప్పుడు లేకపోయినా... తెలుగువారి సంస్కృతికి దర్పణంగా ఈ పండుగ నిలిచిపోతుంది.

 

 

- నిర్జర.

 


More Others