ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా..???

 

 

ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త జంటలతో పాటు మరొకటి మనకు గుర్తుకు వస్తుంది. అదే గోరింటాకు. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకు ఇష్టము ఉండదు చెప్పండి? ఎర్రటి చేతులు చూసుకుని మురిసిపోతారు. అలాంటి గోరింటాకు ఎలా పుట్టింది? లాభాలు ఏమిటి? అమ్మవారికి ఎలా ప్రీతిపాత్రం అయింది అనే విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాము. 


గోరింటాకు అసలు పేరు గౌరింటాకు.... గౌరి ఇంటి ఆకు.... గౌరీ దేవి బాల్యములో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయములో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది.


ఈ వింతను చెలులు పర్వత రాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దది అయి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏవిధమైన బాధ కలుగలేదు. పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది.


అప్పుడు పర్వత రాజు ఇక పై స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు మానవలోకములో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు, స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు, కాళ్లకు అందానినిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చి దిద్దుకున్నారు.


అదే సమయములో కుంకుమకు ఒక సందేహము వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీ దేవి తో బాధగా చెప్పగా అప్పుడు గౌరీ దేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి.  వాటిలోని అతి ఉష్ట్నాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి.


ఇక భర్తకు, గోరింటాకుకు కల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పని తీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా, సున్నితంగా, అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ  పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహా భాగ్యము కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణం అయిన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో అలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా అలోచించి ఆదరిస్తే అన్నివిధాలా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. 


నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి, ఈ ఆషాఢ మాసములో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళుతుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసి పోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. 


ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసము వర్షాకాలం.  ఈ కాలములో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్లు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతే కాదు, ఇంతటి అద్భుతమైన, ఆరోగ్యకరమైన, మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్ లతో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా, మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని, వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి. అదండీ, మన గోరింటాకు కథ. మరి ఆషాఢం వచ్చేసింది కదా. మనము గోరింటాకు పెట్టుకుని ఆనందిద్దామా? https://www.youtube.com/watch?v=vU8TRkHmiHc


More Purana Patralu - Mythological Stories