కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....3

కూడల సంగమం, కర్ణాటకా

 

                                                                                                                               

మహారాష్ట్రలో పుట్టిన కృష్ణమ్మ పరుగులు తీస్తూ, దోవలో కనబడ్డ చిన్న నదులను తన ప్రవాహంలో కలుపుకుంటూ కర్ణాటక రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. 

 

మన పూర్వులు నదులు పుట్టిన ప్రాంతాలే కాదు, వేరే నదులతో కలిసే ప్రదేశాలు కూడా అత్యంత పవిత్రమైనవిగా భావించారు.  అందుకనే నదుల సంగమ ప్రదేశాలలో కూడా ప్రజలు పుణ్య స్నానాలనాచరిస్తూ వుంటారు.   నదీ సంగమ స్ధానాలలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి.  పూర్వము ఇలా నదీ సంగమ ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించిన రాజులలో బాదామీ చాళుక్యులను ప్రముఖంగా చెప్పుకోవాలి.

 

 

క్రీ.శ. 5 వ శతాబ్దమునుండి 8 వ శతాబ్దము వరకు బాదామీ చాళుక్యులు వేలాది ఆలయాలను నిర్మింపచేశారు.  కృష్ణానది ప్రవహించే ప్రాంతాలలోను, సంగమ స్ధానాలలో కూడా వీరు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ మనము దర్శించవచ్చు.  వీటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం లోని కూడలి సంగమేశ్వరాలయం.

 

నదీ, సముద్ర సంగమ స్ధలంలాగానే, ఉపనదీ, నదీ సంగమ స్ధలాలుకూడా అత్యంత ప్రాధాన్యత కల ప్రదేశాలే.  ఈ ప్రదేశాలలో చేసే స్నాన, జప, పూజల వంటి సకల కార్యక్రమాలు విశేష ఫలితాలనిస్తాయి.  ఈ కారణం వల్లనేనేమో చాళుక్యులు సంగమ ప్రదేశాలలో అనేక ఆలయాలు నిర్మించారు.  ఇవ్వన్నీ శివాలయాలే కావటం కూడా విశేషమే.

 

 

కర్ణాటక రాష్ట్రంలో ఘటప్రభ కృష్ణానదిలో కలిసే కూడల సంగమంలోనీ, తెలంగాణా రాష్ట్రంలో తుంగభద్ర కృష్ణానదిలో కలిసే కూడవల్లిలోనూ వీరు నిర్మించిన ఆలయాలు చాలా ప్రసిధ్ధి చెందాయి.  ప్రస్తుతం కూడల సంగమం గురించి.

 

 

సంగమేశ్వరాలయం, కూడల సంగమం,  కర్ణాటకా

మలప్రభా నది కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో నిర్మింపబడిన ఆలయం సంగమేశ్వరాలయం.  రెండు నదుల కూడలి, సంగమ ప్రదేశంలో వున్నది కనుక దీనిని కూడల సంగమేశ్వరాలయంగా (సంగమనాధ అని కూడా అంటారు) వ్యవహరిస్తారు.  ఇది కర్ణాటకా రాష్ట్రంలో బాగల్ కోట జిల్లాలో ఆల్మట్టి డాంకి 15 కి.మీ. ల దూరంలో వున్నది.  దూర తీరాలవరకూ కనిపించే పరిశుభ్రమైన మలప్రభ, కృష్ణానదుల నీటిమీదనుంచి వచ్చే చల్లటిగాలిలో ఇక్కడ ఎంత సేపైనా గడపవచ్చు.  మలప్రభ ఇక్కడ కృష్ణానదిలో కలిసి, తూర్పు దిశగా శ్రీశైలం వైపు పయనిస్తాయి.

 

ఐక్యమంటపం

సంగమేశ్వరాలయం ఎదురుగా వున్న చిన్న ఆలయమే ఐక్య మంటపం.  అసలు మొదటి శివాలయం ఇదేనని, ఇక్కడే శివుడు స్వయంభువుడని, లింగాయత్ (వీర శైవం) స్ధాపించిన బసవన్న ఇక్కడే ఆ స్వయంభూ శివుడిలో ఐక్కమయ్యాడని అంటారు.  అందుకే దీని పేరు ఐక్య మంటపం.

 

 

బసవన్న ఇక్కడే 12వ శతాబ్దంలో జన్మించాడు.  ఈయన లింగయిటిజమ్ (వీర శైవ మతం) స్ధాపకుడు, ప్రచారకుడు.  కొందరు ఆయనని గురువనుకుంటే, కొందరు ఈశ్వరుని ప్రధమ సేవకుడైన నందీశ్వరుడి అవతారమంటారు.  ఈయన సంఘ సంస్కర్త కూడా.  ఆ కాలంలో వున్న కుల  వ్యవస్ధకి వ్యతిరేకంగా పోరాడి కుల మత ప్రసక్తి లేని వీర శైవాన్ని ప్రవేశ పెట్టి, ప్రచారం చేశాడు.

 

బసవన్న ఇక్కడ పుట్టి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే కాలచూర్య అనే రాజు దగ్గర మంత్రిగా  వ్యవహరించాడు.  ఆ సమయంలో కుల మతాలకతీతంగా ఆయన స్ధాపించిన ఆధ్యాత్మిక సంస్ధ .. అనుభవ మంటప ..  చాలామందిని ఆకర్షించటంతో చాలామంది ప్రజలు దానిలో చేరారు.  వీరందరికీ ఇది అత్యంత పుణ్య క్షేత్రం.

 

 

సంగమేశ్వరాలయానికి ఎదురుగా వున్న ఐక్య మంటప నదిలో వున్నది.  అక్కడే స్వయంభూ శివలింగం, బసవన్న సమాధి వున్నాయి.  నది నీరు వాటిని తాకకుండా, నీటి వల్ల వీటికి  ఏ విధమైన నష్టమూ లేకుండా వీటి చుట్టూ పటిష్టమయిన దిగుడు బావి లాగా నిర్మించారు.  భక్తులు ఈ మెట్ల ద్వారా కిందకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు.

 

రేపు తెలంగాణాలోని ఆలయం గురించి.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Krishna Pushkaralu