కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు- 13

హంసలదీవి 

 

 

పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వతాల్లో  మహాబలేశ్వర్ (మహారాష్ట్ర) లో పుట్టిన కృష్ణానదిదాదాపు 1400 కి.మీ.లు ప్రయాణం చేసి గుంటూరు జిల్లాలోని పులిగడ్డ చేరుతుంది.   ఇక్కడ కృష్ణ రెండు పాయలుగా చీలటంవల్ల ఏర్పడిన ద్వీపం దివిసీమ.  మూడోవైపు సముద్రమే.  మా నాన్నగారి ఇంటి పేరు పులిగడ్డ.  అందుకే ఆ పేరు అంటే నాకు చాలా అభిమానం.  ఆ ఊరు లోపలకి వెళ్ళి చూడలేదు కానీ అటునుంచి వస్తున్నప్పుడు ఆగి కృష్ణ కాలువ అందాలు తనివితీరా చూసి, ఊరు పేరున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఫోటో తీయించుకున్నాను. రెండవ పాయ పిట్టల్లంక, పెద కళ్ళేపల్లి వగైరాలు దాటుకుంటూ హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుది.

 

కృష్ణానది సాగరుణ్ణి  చేరే ఈ అత్యంత సుందర ప్రదేశంలో దేవతలచే నిర్మింపబడిన శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం వుంది.  అంతేకాదు, మహర్షుల, దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగిన ప్రదేశం ఇది.  పెద్దలనూ, పిన్నలనూ ఒకేలాగా ఆకర్షించే ప్రదేశమిది.  దేవతలచే కట్టబడిన ఆలయ దర్శనానికి పెద్దవాళ్ళు ఎంత సంబర పడతారో, సముద్రంలో ఆడుకోవటానికీ, సముద్రం ఒడ్డున కెరటాలతో పోటీపడుతూ కారులో తిరగటానికీ పిన్నలు అంతే సరదా పడతారు.  

 

 

కృష్ణానదీ  విశేషాలు

ముందు ఇక్కడి కృష్ణా నదీ విశేషాలు చెప్పుకుందాం.  పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు.  గంగానది, పాపం, వీళ్ళందరి పాపాలతో అపవిత్రమైంది.  ఆ పాపాలనుంచి విముక్తికై ఆవిడ మహావిష్ణువుని ప్రార్ధించింది.  అప్పడాయన, పాపాత్ముల పాపాల మూలంగా నువ్వు నల్లగా మారి పోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ వుండు.  ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు.  గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది.  వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది.  అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కధ.

 

పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది.  ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.  పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు.  మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా.  పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం కట్టి పూజలు చెయ్యసాగారు.  

 

 

అక్కడ  చాలామంది మహర్షులు, పరమ హంసలు  తపస్సు చేసుకుంటూ వుండేవారు.  అందుకని కూడా హంసల దీవి అనే పేరు.  వాళ్ళు అక్కడ ఒక యజ్ఞం చేయాలని శౌనకాది మహర్షులను ఆహ్వానించారు.  వారందరూ వచ్చారు.   ఆ యజ్ఞాన్ని చూడటానికి ప్రజలు  ఎక్కడెక్కడినుండో రాసాగారు.   గోదావరి తీరాన నివసించే కవశుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది. ఆయన బ్రాహ్మణ మహర్షికీ, శూద్ర జాతి స్త్రీకి జన్మించినవాడు.    గొప్ప తపస్సంపన్నుడు.  అనేకమంది శిష్యులకు మోక్ష మార్గాన్ని బోధించేవాడు.  కొందరు శిష్యులను వెంటబెట్టుకుని యజ్ఞం చూడటానికి వెళ్ళాడు.  ఈయన వెళ్ళిన సమయంలో యజ్ఞం జరిగేచోట పెద్దలెవరూ లేరు.  శిష్యులు కొందరు కార్యక్రమ నిర్వహణలో నిమగ్నులయి వున్నారు. వాళ్ళు కవశ మహర్షిని చూడగానే వేద మంత్రోఛ్ఛారణ ఆపేసి కుల భ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమయినదని అనేక విధాల దూషించి, అగౌరవ పరచారు.  కవశుని శిష్యులు కోపంతో వారించబోగా, కవశుడు వాళ్ళని అడ్డుకుని, అక్కడి మునులకు క్షమాపణ చెప్పి, దేవతలు నిర్మించిన వేణు గోపాలస్వామి ఆలయం ముందు నిలిచి విచారిస్తూ, కృష్ణ స్తోత్రాలు చేయటం మొదలు పెట్టాడు.  అప్పుడు జరిగిన విచిత్రమిది.  నిర్మలంగా ప్రవహిస్తున్నకృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది.  ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలయి ఒక చీలిక  ఉధృతంగా బయల్దేరి కళ్ళేపల్లి మీదుగా హంసలదీవి వచ్చి వేణు గోపాలస్వామి పాదాలను తాకి, కవశ మహర్షి చుట్టూ తిరిగి యజ్ఞ వాటికని ముంచెత్తింది.  యజ్ఞకుండాలు నీటితో నిండిపోయాయి.  ఋత్విక్కులు నీటిలో కొట్టుకుపోయారు.  

 

 

భయంకరమైన ఈ అకాల ప్రళయానికి కారణం శౌనకాది మహర్షులు దివ్య దృష్టితో చూసి కవశ మహర్షికి జరిగిన అవమానంవల్ల ఇది జరిగిందని గ్రహించి కవశుని దగ్గరకు పరుగున వెళ్ళి క్షమించమని వేడుకున్నారు.  ఆయన,  క్షమించటానికి నేనెవరిని  నా అవమానం చెప్పుకుని కృష్ణుడి దగ్గర బాధపడ్డాను.  దానికి ఆ దేవదేవుని పేరుతోనే వున్న ఈ నదీమ తల్లి వచ్చి నన్ను వూరడించింది.  మీరు ఆ కృష్ణుణ్ణి, నదీమతల్లిని ప్రార్ధించండి అన్నాడు. తర్వాత వీరి ప్రార్ధనలు విన్న కృష్ణమ్మ శాంతించింది. కవశ మహర్షి కోరిక మీద అక్కడ సాగరంలో కలిసింది.  అప్పడు కవశ మహర్షి ఈ స్ధలం చాలా పవిత్రమైనది.  ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళయినా ఈ సాగర సంగమంలో స్నానం చేసి  ఇక్కడ వేణు గోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారు అని చెప్తుండగానే ఒక కాకి ఆ సంగమంలో స్నానం చేసి హంసలా మారి, వేణు గోపాలునికి ప్రదక్షిణలు చేసింది.  ఇది చూసిన వారంతా అక్కడ స్నానం చేసి, వేణు గోపాలుని దర్శించి, కవశ మహర్షికి ప్రణమిల్లారు. 

 

 

ఆగండాగండి. ఈ కధ చదివి అర్జంటుగా స్నానం చెయ్యటానికి ఎక్కడ పడితే అక్కడ నీటిలో దిగద్దు.  ఇక్కడ కొన్ని ప్రదేశాలు ప్రమాద భరితాలు.  అందుకనే మన పాపాలు పోయినా పోకపోయినా నిర్ణీత ప్రదేశాల్లోనే స్నానం చేయండి. కృష్ణమ్మ సంగతి తెలుసుకున్నాము, సంగమంలో స్నానం చేశాము.  ఇంక ఆలస్యమెందుకు  వేణు గోపాలుని దర్శించి, ఆలయ విశేషాలు తెలుసుకుందాం పదండి.

 

ఆలయ విశేషాలు

వూర్వం దేవతలు సముద్రతీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకున్నాము కదా.  వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట.  కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది.  అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు.  ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.

 

స్వామి ఆవిర్భావం గురించి కధ.  పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా వుండేవు.  అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు.  అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి  గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు.  పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది.  స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు.  అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామిని దర్శించారు.  అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు.  ఆ విగ్రహమే ఇది.  నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా  కాక  నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.

 

దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి.  ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు.  ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.  మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.  ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.  

 

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

 

సరదాలు

ఆలయం దగ్గరనుండి సాగర సంగమందాకా సముద్రం ఒడ్డునే మన వాహనంలో సరదాగా తిరగచ్చు.  నేల గట్టిగా వుంటుంది.
చీరెల మీద డిజైన్లు కొత్తవి కావాలనుకుంటున్నారా  డిజైనర్లు పేపర్లూ పెన్నులూ పట్టుకెళ్ళండి.  మీకు తిండీ తిప్పలూ గుర్తు రావు.  సముద్రం ఒడ్డున పీతలు పెట్టే గుడ్లు ఎన్ని రకాల డిజైనలుగా వుంటాయో. అందులో కొన్ని పిల్లలయి కను రెప్పపాటులో నేలలోకి వెళ్ళటం చూసి తీరవలసిందే.

 

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది.  ఇలాంటి ప్రదేశాలకి  మన వాహనాల్లో  వెళ్తే  ఏ అలసట లేకుండా వుంటుంది.  మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి.  అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు.  వెలుతురువున్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


More Krishna Pushkaralu