కణ్వ మహర్షి ఎవరంటే...

 

 

కణ్వ మహర్షి పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. విన్నా ఆయన గురించి జ్ఞప్తికి ఉంచుకునేంత శ్రద్ధ వహించకపోవచ్చు. కానీ ఎవరి ఆసక్తి ఎలా ఉన్నా... హైందవ సంస్కృతిలో కణ్వుడి పాత్ర అసమానమైనది. మన దేశానికి భారతదేశం అన్న పేరు రావడం దగ్గర నుంచీ, కృష్ణుడు దేహాన్ని చాలించడం వరకూ...  అరుదైన మలుపులెన్నింటిలోనో కణ్వుడు కనిపిస్తాడు.

 

అంగీరసుని వంశంలో ఘోరుడు అనే రుషికి జన్మించినవాడు కణ్వుడు. కణ్వుడు మహా నిష్టాగరిష్టుడు. గొప్ప తపస్సంపన్నుడు. తన తపస్సు నిరాటంకంగా సాగేందుకు ఆయన మాలిని అనే నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఈ మాలినీ నది హరిద్వార్‌కు దగ్గరలో ఉందని అంటారు. అక్కడ కోట్‌ద్వార అనే ఊరిలో కణ్వుడి పేర ఇప్పటికీ ఓ ఆశ్రమం ఉంది. మరికొందరేమో మహారాష్ట్రలోని కణాల్ద (జల్‌గావ్) అనే ప్రాంతంలో ఉన్న గుహలే ఆనాటి కణ్వుడి ఆశ్రమం అని నమ్ముతారు.

 

కణ్వుని ఆశ్రమం ఎక్కడ ఉండేదన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, ఆయన వంశజులు దర్శించిన మంత్రాలు మన చతుర్వేదాలలో అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడుగా ‘కణ్వస్మృతి’ పేరుతో ఈయన రచించిన ధర్మశాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది.

 

ఇలా మాలినీ తీరాన ఉన్న ఆశ్రమంలో ధార్మిక జీవనాన్ని గడుపుతున్న కణ్వుడి జీవితం ఒక రోజు అనుకోని మలుపు తిరిగింది. ఆయనకు పక్షుల నీడన పెరుగుతున్న ఓ చిన్న బిడ్డ కనిపించింది. మేనక, విశ్వామిత్రులకు జన్మించిన ఆ బిడ్డకు తన ఆశ్రమానికి తెచ్చుకుని... ఆమెను పెంచి పెద్దచేశాడు కణ్వుడు. మనం తరచూ వినే శకుంతల ఆమే! ఆ శకుంతలని ఒకరోజు దుష్యంతుడు అనే రాజు చూసి మోహిస్తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోతాడు. దుష్యంతుడు తనని సకలలాంఛానాలతో అతని రాజ్యానికి తీసుకుని వెళ్తాడని కలలలో తేలిపోతుంటుంది శకుంతల. అదే మైమరపులో ఆశ్రమంలోకి అడుగుపెట్టిన దుర్వాస మహర్షిని సరిగా గమనించుకోదు. శకుంతల పరధ్యానానికి కోపగించుకున్న దుర్వాసుడు.... దుష్యంతుడు ఆమెను మర్చిపోతాడంటూ శపిస్తాడు. ఆ తరువాతకాలంలో శాపవిమోచనం లభించి శకుంతలా దుష్యంతులు కలుసుకోవడం, వారిరువురికీ జన్మించిన భరతుడు దుష్యంతుని రాజ్యానికి వారసుడు కావడం... ఇదంతా కూడా తరచూ చదువుకునే ఇతిహాసమే! ఆ భరతుని పేరుగానే మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది.

 

కణ్వుడు ఈ తీరున ఒక వంశం ఏర్పడేందుకే కాదు, మరో వంశం నిర్మూలం అయ్యేందుకు కూడా కారణం అయ్యాడు. అదెలాగంటే- కణ్వుడు ఒకనాడు విశ్వామిత్రుడు, నారదుడు వంటి మహర్షులతో కలిసి కృష్ణుని పాలనలో ఉన్న ద్వారకకు చేరుకున్నారు. ఈ మహర్షులను చూసిన యాదవ కుర్రకారుకి వారిని కాసేపు ఆటపట్టాలని అనిపించింది. వెంటనే సాంబుడు అనే యాదవుని దుస్తులలో ఒక ముసలం (రోకలి) పుడుతుందనీ, ఆ సంఘటన తరువాత యాదవ వంశం నిర్మూలం అవుతుందనీ శపిస్తాడు కణ్వుడు. శాపవశాన నిజంగానే సాంబుడి కడుపున ముసలం జన్మిస్తుంది. ఆ సంఘటన తరువాత యాదవులంతా తాగి ఒకరితో ఒకరు కలియబడి చంపుకుంటారు. అదే సమయంలో కృష్ణుడు సైతం ఒక వేటగాడి బాణం తగిలి తన తనువుని చాలించాలని నిర్ణయించుకుంటాడు.

 

ఇలా కణ్వ మహర్షి అనేక సందర్భాలలో మనకు తారసిల్లుతారు. జ్ఞానిగా, తండ్రిగా, తపస్సంపన్నుడిగా హైందవ సందప్రదాయంలో చెరిగిపోని గుర్తుగా మిగిలిపోతారు.


- నిర్జర.


More Purana Patralu - Mythological Stories