విష్ణుమూర్తి - హిరణ్యాక్షుడు

Hiranyaksha Killed by Vishnumurthy

 

హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరూ దితి, కశ్యపుల సంతానం. హిరణ్యాక్షుడి తండ్రి కశ్యపుడు తపోసంపన్నుడు. తల్లి దితి. బలి చక్రవర్తి మాదిరిగానే హిరణ్యాక్షుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వెళ్ళి, వారి సంపదలన్నీ కొల్లగొట్టి, నానా భీబత్సం చేస్తుండేవాడు.

కలహప్రియుడిగా కనిపించే నారద మహర్షి ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా! ఒకసారి హిరణ్యాక్షుడిని కలిసేందుకు వచ్చాడు. తీరా నారదుడు వచ్చేసరికి హిరణ్యాక్షుడు ఎక్కడికో వెళ్లేందుకు సన్నాహమయ్యాడు.

''ఏం, హిరణ్యాక్షా! ఎక్కడికో బయల్దేరావు?! చేతిలో గద కూడా ఉంది...'' అన్నాడు నారదుడు.

''మా దానవులకు వినాశనం కలిగించే విష్ణుమూర్తిని చంపాలనే కృతనిశ్చయంతో బయల్దేరాను.. ఆ విష్ణువు నశిస్తేగానీ మాకు సుఖసంతోషాలు లేవు'' అన్నాడు హిరణ్యాక్షుడు.

''అదా సంగతి... అయితే విష్ణుమూర్తి అక్కడెక్కడో లేడు.. నువ్వు విసిరేసిన ధరణీదేవిని రక్షించేందుకు వరాహావతారం ఎత్తాడు కదా.. సముద్రగర్భంలో పాతాళంలో ఉన్నాడు'' అని చెప్పాడు నారదుడు.

హిరణ్యాక్షుడు వ్యంగ్యంగా ఒక వికటాట్టహాసం చేశాడు. వెంటనే పాతాళం చేరుకుని మహా గర్వంతో ఊగిపోతూ, ''హూ.. శ్రీహరీ, చివరికి సూకర రూపం (పంది) దాల్చావా? ఈ భూమి నాది.. సముద్రంలోకి విసిరింది నేను.. దాన్ని స్పృశించే హక్కు నీకు ఎక్కడిది? నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి'' అన్నాడు.

శ్రీహరికి ఆగ్రహం ముంచుకొచ్చింది. అయినా, భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి, ''ఓ హీనుడా.. నువ్వు తగని మిడిసిపాటుతో ఉన్నావు. భూమాతనే విసిరికొట్టావు అంటే, నువ్వెంత ఆపదను కొనితెచ్చుకున్నావో నీకు అర్ధం కావడంలేడు. భూమాతను సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాను. కనుక భూమిపై నాకే అధికారం ఉంది.. భూమి నా అధీనంలోనే ఉంది'' అన్నాడు శ్రీహరి.

హిరణ్యాక్షుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే, దేవతలు ముక్తకంఠంతో ''దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మారు పేరైన శ్రీహరీ, ఆ రాక్షసాధముని తక్షణం హతమార్చు.. ఇటువంటి హీనులవల్ల కీడే గానీ మేలు జరగదు కదా'' అన్నారు.

శ్రీహరి ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే హిరణ్యాక్షుని చంపేశాడు.

భూమాతకు సంతోషంతో ఆనందబాష్పాలు వచ్చాయి. తనను ఘోర ఆపద నుండి కాపాడిన శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంది.

దేవతలు హర్షంతో పూలవాన కురిపించారు.

 

hindu mythological character hiranyaksha, hindu purana hiranyaksha, hiranyaksha story in mythology, hindu epics and hiranyaksha, Hiranyaksha, mythological characters in hinduism, hindu bhakti stories and characters


More Purana Patralu - Mythological Stories