5 నుంచి మొదలైన గవిమఠంలో
బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధిచెందిన శ్రీ గవి మఠ స్థిత చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం కంకణధారణ, 6న స్వామివారికి ప్రత్యేకంగా తయారుచేసిన నాగాభర ణ ఉత్సవం, 7న నెమలి వాహనోత్స వం, 8న ఐరావత వాహనోత్సవం, 9న మహాగణారాధన, బసవేశ్వర వాహనోత్సవం నిర్వహించనున్నట్లు మఠం పీఠాధిపతులు తెలిపారు. 10వ తేదీ సాయంత్రం జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వాముల ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి ఆధ్యాత్మిక భక్తి ప్రవచన ప్రబోధనలు, 11వ తేదీ లంకాదహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గవి మఠం చరిత్ర
ఉరవకొండ కరిబసప్ప గవి మఠం ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతి గాంచింది. ఈ మఠం మనోహర శిల్పాలు, వస్తు కళాసంపదకు నిలయం. కరిబసవ రాజేంద్ర మహాస్వామిని దర్శించుకుని జన్మసార్థకం చేసుకునేందుకు వచ్చే భక్తకోటితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. దాదాపు 770 మఠాలు తమ ఉపమఠాలుగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పరిచి కోట్లాది రూపాయల ఆస్తులు ఏర్పాటుచేశారు. శైవ మత ప్రచారం కోసం దాదాపు 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన గవి మఠాన్ని కరిబసవ రాజేంద్ర స్వాము లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అప్పటి ఊరగాద్రి ప్రస్తుతం ఉరవకొండలో తమ గురువు ఆదేశం మేరకు ప్రారంభమైన ఈ మఠంలో ఒక గుహ వుండడం, ఇందులో పీఠాధిపతి ధ్యా నం చేయడంతో దీనికి గవిమఠం అని పేరు వచ్చింది. దినదినాభివృద్ధి చెందుతున్న గవి మఠంలో వెలసిన చంద్రవౌళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. క్రీస్తు శకం 1814లో ప్రారంభమైన ఈ రథోత్సవం నిర్వహణ ఇప్పటిదాకా నిరంతరాయంగా కొనసాగుతున్నది. 1423 లో మైసూరు మహారాజులకు అన్నం చూస్తే పురుగుల మాదిరి కనిపించేదట. ఈ వ్యాధిని తమ శక్తితో స్వామి వారు తొలగించడంతో ఆయన భక్తితో వజ్ర వైడూర్యాలు, గండపెండేరం కాలికి తొడిగి సత్కరించారు.
ఉరవకొండలో స్వామి వారికి ఒక విశ్రాంతి భవనం నిర్మించి ఇచ్చారు. మైసూరు రాజదర్బార్‌లో తాను కూర్చునే రకంగానే ఒకమహల్‌ను నిర్మించి ఇచ్చారు. పూర్తిగా చెక్కతో నిర్మించబడిన ఈ మహల్ ఎన్నో కళాకృతులతో పాటు మైసూర్ రాజ్యలక్ష్మికి చెందిన గుర్తు తో వుండటం నేటికీ చూడవచ్చు. శైవ మత ప్రచారానికి జీవితం అంకితం చేసి స్వామి వారు జీవ సమాధి అయి నా నేటికీ భక్తులను కాపాడుతూ ఉన్నారు. ఈ గురు పరంపరలో భాగంగా 8వ పీఠాధిపతిగా వ్యవహరించిన చెన్నబసవ రాజేంద్ర స్వామి భక్తి కార్యక్రమాలతో పాటు ప్రజాసంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం 8వ పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి బసవ రాజేంద్ర స్వాములు మఠాన్ని యాత్ర స్థలంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కుబడి తీర్చుకుంటుంటారు.
