శ్యాం బాబా శిరస్సు ఉన్న చోటు- ఖాటు

 

 

మహాభారతంలో బర్బరీకుడు అనే గొప్ప పాత్ర గురించి నిన్న తెలుసుకున్నాము. ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుడు మహాబలశాలి. అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరీకుని తలను తనకు కానుకగా అడుగుతాడు. అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్‌లోని ఖాటు అనే గ్రామంలో పడిందట. అ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా!

రాజస్తాన్‌- ఖాటు
జైపూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్‌సింగ్‌ చౌహాన్‌ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీవినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్‌సింగ్‌ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు.

 

 

శ్యాం కుండ్‌, శ్యాంబగీచా
ఖాటు శ్యాం శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండ్‌గా పిలుచుకుంటారు జనం. ఈ కొలనులో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలూ, సకల రోగాలూ నశిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉన్న శ్యాం బగీచా అనే అందమైన పూల తోట నుంచే ఆలయంలోని ఇలవేల్పుని అలంకరించేందుకు కావల్సిన పుష్పాలను సేకరిస్తారు. ఇక ఖాటు శ్యాం ఆలయానికి దగ్గర్లోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైనదే. మహిమ కల్గినదే! ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయబోగా, శివలింగం నుంచి రక్తధార వెలువడిందట. దాంతో భయపడిన సైనికులు తోక ముడిచారని అంటారు.

 

భక్త జనం, పర్వదినం
ఉత్తరాదిన ఎన్నో వేల కుటుంబాలకు ‘ఖాటు ఖ్యాం’ ఒక ఇలవేల్పు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖాటు శ్యాంను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఈ గ్రామానికి చేరుకుంటారు. ఖాటు శ్యాం కేవలం కృష్ణుడి పేరు మాత్రమే కాదు, కృష్ణుని అంశ సైతం ఉన్న దైవంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి సంబంధించిన పండుగలన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక ఖాటు శ్యాం జన్మించిన శుక్ల పక్ష ఏకాదశి, ఆయన తలను దానం చేసిన శుక్ల పక్ష ద్వాదశి తిథులలో ఆలయం కిక్కిరిసిపోతుంది. పిల్లలకు తలనీలాలను అందించేవారు. కోరికలను తీర్చమంటూ నిషాన్‌ పేరుతో ఆలయంలో జెండాను ఉంచేవారు ఖాటుకు పోటెత్తుతారు. ఇక ఆలయంలో ఖాటు శ్యాంను ప్రతిష్టించిన ‘ఫల్గుణ శుద్ధ ఏకాదశి’ సందర్భంగా జరిగే ఫాల్గుణ మేళా గురించి చెప్పుకొనేందుకు మాటలు చాలవు. పాదయాత్రలు చేసుకుంటూ, భజనలు పాడుకుంటూ, ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ లక్షలాది మంది జనం ఈ జాతరకు చేరుకుంటారు. ఆ సమయంలో ఖాటు అనే కుగ్రామం కాస్తా ఒక జనసంద్రంగా మారిపోతుంది.

అహ్మదాబాద్‌ మొదల్కొని, నేపాల్‌ వరకూ శ్యాంబాబాకు అనేక ఆలయాలు ఉన్నాయి. శ్యాంబాబాబా, బలీయదేవ్‌, తీన్‌ బాణ్ ధారి, ఖాటు నరేష్‌, మోర్వీ నందన్‌... ఇలా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ ఆలయంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగదైవం శ్యాంబాబా అన్నది ఉత్తరాది భారతీయుల నమ్మకం.

- నిర్జర


More Purana Patralu - Mythological Stories